136 రోజుల జేడీ సోదరుని పాలన..నేటితో

20 Jun, 2019 09:23 IST|Sakshi

ఎస్వీయూ వీసీ రాజేంద్రప్రసాద్‌ రాజీనామా

గవర్నర్‌కు రాజీనామా లేఖ

సొంత నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం 

సాక్షి, తిరుపతి : ఎస్వీయూ వీసీగా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన ప్రొఫెసర్‌ వీవీఎన్‌ రాజేంద్రప్రసాద్‌ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 3న ఎస్వీయూ 18వ వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ రాజేంద్రప్రసాద్‌ కేవలం 136 రోజులు మాత్రమే పనిచేశారు. ఈయన తన నాలుగు నెలల పాలనలో సొంత నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారు. గత ప్రభుత్వంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆర్కే అనురాధ, దూరవిద్యా విభాగానికి చెందిన మాజీ డైరెక్టర్‌ వి.రవి నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పనిచేసినట్లు విమర్శలున్నాయి. రెక్టార్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ జీ.జానకి రామయ్యతో రాజీనామా చేయించడం మినహా ఇతర కీలక నిర్ణయాలు ఏమీ లేవు. ఈ నిర్ణయంకూడా వారి సూచనలకు అనుగుణంగానే తీసుకున్నట్లు క్యాంపస్‌లో ప్రచారం ఉంది.

నియామకమే తప్పు
ఎస్వీ యూనివర్సిటీ వీసీ నియామకానికి గత యేడాది ఆగస్టులో నోటిఫికేషన్‌ వెలువడింది. అయితే ఈ పోస్టుకు ప్రొఫెసర్‌ రాజేంద్రప్రసాద్‌ దరఖాస్తు చేయలేదు. జనవరిలో నిర్వహించిన సెర్చ్‌ కమిటీ సమావేశానికి వారం ముందు ఈయనను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికపుడు దరఖాస్తు తెప్పించుకున్నారు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి రెండేళ్లపాటు ఇబ్బందులకు గురిచేసిన సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీ నారాయణ రుణం తీర్చుకొనేందుకు... ప్రభుత్వం ఆయన సోదరుడైన ప్రొఫెసర్‌ వీవీఎన్‌ రాజేంద్రప్రసాద్‌కు వీసీ పదవి కట్టబెట్టింది. మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌ సహకారం కూడా ఈయన నియామకంలో పాత్ర ఉంది.

నియామకంపై కేసులు
యూజీసీ నిబంధనల ప్రకారం వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్‌ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శి సభ్యుడుగా ఉండరాదు. విద్యారంగ నిపుణుడే సభ్యుడిగా ఉండాలి. ఎస్వీయూ సెర్చ్‌ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శిని సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం గత యేడాది డిసెంబర్‌లో జీఓ జారీ చేసింది. ఈ జీఓను వ్యతిరేకిస్తూ ఎస్వీయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పి.మునిరత్నం రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 4న తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ కేసులో తీర్పును ముందే ఊహించిన ప్రభుత్వం ఫిబ్రవరి 3న అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 4వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.

అయితే ముందు రోజే విధుల్లో చేరినట్లు అప్పటి అధికారుల సహకారంతో తప్పుడు జాయినింగ్‌ రిపోర్ట్‌ సమర్పించారు. అనంతరం ఎస్వీయూ వీసీగా రాజేంద్రప్రసాద్‌ను తొలగించాలని కోరుతూ ప్రొఫెసర్‌ మునిరత్నం రెడ్డి కో వారెంటో దాఖలు చేశారు. వీసీ నియామకానికి సంబంధించిన రెండు కేసుల్లో ఈ నెల 24న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ కేసులో ఈయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17న విద్యాశాఖ మంత్రిని కలిసి తన రాజీనామా విషయంపై చర్చించారు. అమరావతి నుంచి మంగళవారం తిరిగి వచ్చారు. బుధవారం సన్నిహితులతో చర్చించిన అనంతరం తన రాజీనామా లేఖను గవర్నర్, ఉన్నత విద్యామండలికి పంపారు. ఈ రాజీనామా ఆమోదం పొందడం లాంఛనమే.

ముందే చెప్పిన సాక్షి 
ఎస్వీయూ వీసీగా ప్రొఫెసర్‌ రాజేంద్రప్రసాద్‌ నియామకం, నిబంధనల ఉల్లంఘన, హైకోర్టులో కేసులు తదితర అంశాలపై సాక్షి పలు కథనాలు ప్రచురించింది. ఈ నెల 18న ఎస్వీయూ వీసీపై వేటుకు రంగం సిద్ధం అన్న శీర్షికన కథనం ప్రచురతమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు