శ్రీబాగ్ ఒప్పందాన్ని ఆమోదించాలి

16 Feb, 2014 02:34 IST|Sakshi
  • సీమ హక్కులను నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటే
  •  బాస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల స్పష్టీకరణ
  •  మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ఊపందుకున్న వేళ రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం సీమ నేత లు స్వరం పెంచుతున్నారు. రాయలసీమను సౌభాగ్య సీమగా మార్చగల ‘శ్రీబాగ్ ఒప్పందం’ అమలు కోసం భారతీయ అంబేద్కర్ సేన (బాస్) కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా శనివారం పట్టణంలోని బేబి వెల్‌కమ్ హోమ్‌లో పార్టీలకు అతీతంగా, ప్రజాసంఘా లు, వివిధ రాజకీయ పార్టీలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.

    ‘రాయలసీమ సమస్యలు-పరిష్కార మార్గాలు’ అన్న అంశంపై బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివప్రసా ద్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగిం ది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ చినబాబు, టీడీపీ మాజీ ఎమెల్యే దొమ్మలపాటి రమేష్, వల్లిగట్ల రెడ్డెప్ప, సీపీఐ నాయకులు కృష్ణప్ప, సమాజ్‌వాదీ పార్టీకి చెంది న తుర్ల ఆనంద్‌యాదవ్‌తో పాటు పలు స్వ చ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, కుల సం ఘాల నాయకులు పాల్గొని సీమ సమస్యలను వివరించారు.

    రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్(జీవోఎం)బిల్లులో శ్రీబాగ్ ఒప్పందంపై చర్చించక పోవడాన్ని పలువురు నేతలు తీవ్రం గా ఖండించారు. ఇప్పటికైనా సీమ హక్కులపై స్పందించి లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించి, శ్రీబాగ్ అమలును ఆమోదించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేకుంటే సీమ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా తిరుగుబాటు తప్పదని నాయకులు హెచ్చరించారు.

    ఈ సమావేశంలో బాస్ జిల్లా అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు జింకా వెంకటాచలపతి, పోర్డు లలితమ్మ, కృషి సుధాకర్, డీఎస్‌ఎస్ నాయకుడు చిన్నప్ప, బీసీ నాయకులు పులిశ్రీనివాసులు, డీవీ.రమణ, రాయల్‌బాబు, కొమరం భీమ్ అధ్యక్షులు దివాకర్, బాస్ నాయకులు శ్రీచందు, కేవీ.రమణ, నాషీ, మను, లారా, లక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
     
     మండలిలో చర్చిస్తాం

     ఏళ్ల తరబడి రాయలసీమ కరువు కోరల్లో విలవిల్లాడుతోం ది. ఇక్కడి ప్రజల నీటి కష్టాలు వర్ణనాతీతం. వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక రంగం, అభివృద్ధి సూచిల్లో తెలంగాణ  కంటే సీమ వెనుకబడింది. శ్రీబాగ్ ఒప్పంద అమలు ద్వారా సీమ కష్టాలు తీరుతాయి. దీనిపై శాసనమండలిలో చర్చిస్తా. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పార్టీ పొలిట్‌బ్యూరోలో మాట్లాడుతా.  
     - ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి (వైఎస్సార్‌సీపీ)
     
     మ్యానిఫెస్టోలో పెట్టేవిధంగా ఒత్తిడి తెద్దాం
     శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తామని రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ మ్యానిఫెస్టోలో పెట్టే విధంగా సీమ నేతలు ఒత్తిడి తేవాలి. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఈ ప్రమాదం నుంచి సీమను కాపాడుకోవాలంటే శ్రీబాగ్ ఒప్పందం అమలు జరగాల్సిందే.
     - దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే(టీడీపీ)
     
     నదీ జలాలు సీమకే కేటాయించాలి
     కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదుల నీటిపై శ్రీబాగ్ ఒప్పందం ద్వారా సంపూర్ణ హక్కులు లభించినా, దాన్ని కాలరాసి కోస్తాంధ్ర, తెలంగాణాలకు నదీజలాలను తరలించుకుపోతున్నారు. 40 అడుగుల్లో భూగర్భ జలాలున్న కోస్తాంధ్రకు నదీజలాలు ఇస్తున్నారు. వెయ్యి అడుగుల బోర్లు వేసినా నీళ్లు పడని సీమకు నదీ జలాలు ఇవ్వకుండా ఎడారిగా మార్చారు. సీమాంధ్ర నేతలు శ్రీబాగ్ ఒప్పందం అమలుకు కృషి చేయాలి.        
     - జింకా చలపతి వైఎస్సార్‌సీపీ
     
     సీమను సింగ్‌పూర్‌లా మార్చుకుందాం

     30 ఏళ్లలో సింగపూర్ ఎంతో అభివృద్ధి సాధించి అమెరికా వంటి దేశాలతో పోటీపడుతోంది. సీమలో అపారమైన ఖనిజ, అటవీ సంపద ఉన్నాయి. నదీజలాలు, విద్యుత్ మిగులు ఉంది. కష్టజీవులున్నారు. ఈ వనరులన్నీ వినియోగంలోకి తెస్తే రాయలసీమ రానున్న 20 ఏళ్లలో సింగపూర్ ను మించిపోతుంది. శ్రీబాగ్ ఒప్పందం అమలుకు రాజకీ య పార్టీలు ఉద్యమించాలి.
     - పీటీఎం. శివప్రసాద్, బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు
     

మరిన్ని వార్తలు