రాజకీయ ప్రముఖులకు చుక్కెదురు

1 Aug, 2013 03:04 IST|Sakshi

గుడివాడ, న్యూస్‌లైన్ : రాజకీయ ప్రముఖులకు వారి సొంత గ్రామాల్లో చుక్కెదురైంది. ప్రత్యర్థుల చేతిలో వారి పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. దీంతో ఆయా నేతల అనుచరులు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది.  కావూరి  సాంబశివరావు సొంతూరు దోసపాడు (పెదపారుపూడి మండలం)లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసింది.  ఆ పార్టీ బలపరిచిన సర్పంచి అభ్యర్థి సజ్జా శ్రీనివాసరావుపై టీడీపీ బలపరిచిన అభ్యర్థి సజ్జా శివకుమార్  731 ఓట్ల మెజార్టీ సాధించారు. కావూరి తాను పుట్టి పెరిగిన దోసపాడు గ్రామ అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదని గ్రామస్తులు బహిరంగంగానే  విమర్శిస్తున్నారు.   
 
 బాలకృష్ణకు బహుమతిగా ఇస్తామని ప్రగల్భాలు పలికి...
 పామర్రు మండలం కొమరవోలులో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా రంగంలోకి దిగిన పొట్లూరి కృష్ణకుమారి పరాజయం పాలయ్యారు. ఆమె సినీనటుడు బాలకృష్ణకు అక్క వరుస అవుతారు. బాలకృష్ణ సొంత గడ్డ నిమ్మకూరుకు ఈ గ్రామం కూతవేటు దూరంలో ఉండగా కొమరవోలులో బాలకృష్ణకు బంధుగణం ఎక్కువగానే ఉంది. కొద్దికాలం నుంచి బాలకృష్ణ జిల్లాకు వచ్చినపుడల్లా పామర్రు మండలంలోని కొమరవోలుకు వచ్చి విలేకరుల సమావేశాలు పెడుతుండటం తెలిసిందే. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా కూడా గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపారు.
 
 ఈ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తదితర నేతలు గ్రామంలో మాట్లాడుతూ తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి పొట్లూరి కృష్ణకుమారిని గెలిపించి బాలకృష్ణకు బహుమతిగా ఇస్తామని ప్రగల్భాలు పలికారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో కంగుతిన్నారు. కొమరవోలులో గ్రామ ప్రముఖుడు కాట్రగడ్డ రమేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థిగా రంగంలోకి దిగిన పొట్లూరి కృష్ణకుమారి  (ఇద్దరి పేర్లు ఒకటే)  74 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తొలుత బాలకృష్ణ పేరు చెప్పు కొని రాజీ యత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొమరవోలు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పరాజయం పాలవ్వడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
 రుద్రపాకలో వైఎస్సార్‌సీపీ విజయం
 నందివాడ మండలం రుద్రపాక గ్రామం మాజీ మంత్రి, ప్రస్తుతం కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఉన్న పిన్నమనేని వెంకటేశ్వరరావు స్వగ్రామం.  పంచాయతీ పుట్టిన దగ్గర నుంచి పిన్నమనేని కుటుంబ సభ్యులు చెప్పినవారే గెలుపొందుతున్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి బేతపూడి విజయలక్ష్మి పిన్నమనేని వెంకటేశ్వరరావు బలపరిచిన గుర్రం విజయనిర్మలపై ఐదు ఓట్ల తేడాతో విజయం సాధించారు. గతంలో గ్రామ సర్పంచిగా పిన్నమనేని  తండ్రి పిన్నమనేని కోటేశ్వరరావు పనిచేశారు.
 
 గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని రాజకీయ చతురతతో వైఎస్సార్‌సీపీ ఈ గ్రామాన్ని చేజిక్కించుకుంది. ఓదార్పు యాత్ర సందర్భంగా వైఎస్ జగన్‌ను రుద్రపాక శివారు గాజులపాడుకు వచ్చినపుడు గ్రామస్తులు ఎంతో ఆప్యాయతతో తీసుకెళ్లారు. ఆ గ్రామంలో వేరే పార్టీ జెండా పెట్టడం అదే మొదటిసారి. గ్రామ దళితులంతా దివంగత వైఎస్‌పై అభిమానాన్ని చాటారు. అదే ప్రాంతానికి చెం దిన బేతపూడి విజయలక్ష్మి ప్రస్తుతం సర్పంచిగా విజయం సాధించడంతో తరతరాల పిన్నమనేని కుటుంబీకుల ఆధిపత్యానికి గండి పడినట్లయింది.
 

మరిన్ని వార్తలు