గెలిచామా.. ఓడామా.. కాదు 

18 Nov, 2023 04:23 IST|Sakshi

పోటీ చేశామా లేదా అన్నదే ముఖ్యం 

ఇదే రీతిన ఈసారి లెక్కకు మించి అభ్యర్థులు పోటీ 

30 నుంచి 40 మంది వరకు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 11 

40 మందికిపైగా పోటీ చేస్తున్న నియోజకవర్గాలు రెండు 

‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్‌ దిగిందా లేదా’.. ఈ పూరీ మార్కు డైలాగ్‌ను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలామంది..’’ గెలిచామా.. ఓడామా.. కాదు  పోటీ చేశామా లేదా అన్నదే ముఖ్యం’’ అన్న రీతిన మార్చేసి బరిలో సై అంటున్నారు. మునుపెన్నడూ అంతగా లేని విధంగా  ఈసారి ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలోకి దిగారు.

ప్రధాన రాజకీయ పార్టీల నుంచే కాకుండా చిన్నాచితకా పార్టీల నుంచి, ఇండిపెండెంట్లు కలిపి రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఏకంగా 2,290 మంది పోటీలో ఉన్నట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 20 మంది పోటీ చేస్తున్నారన్న మాట.

ఈ పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే 65 చాలా నియోజకవర్గాల్లో రెండు లేదా మూడు బ్యాలెట్‌ యూనిట్లు వినియోగించాల్సి వస్తోంది. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 16లోపు ఉంటేనే ఒక బ్యాలెట్‌ యూనిట్‌ సరిపోతుంది.కానీ, ఈసారి అంతకంటే ఎక్కువ మంది 65 స్థానాల్లో బరిలో ఉండడంతో బ్యాలెట్‌ యూనిట్లను పెంచాల్సి వస్తోంది. 

ఎల్బీనగర్‌ టాప్‌ 
ఇక నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఎక్కువ మంది పోటీ చేస్తున్న జాబితాలో ఎల్బీనగర్‌ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి ఏకంగా 48 మంది అభ్యర్థులు అమీతుమీ తేల్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నుంచి 44 మంది బరిలో ఉన్నారు. ఇక, ఏడుగురే పోటీలో ఉండి రాష్ట్రంలో అతి  తక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గంగా బాన్సువాడ నిలిచింది.

పది మంది కంటే తక్కువగా పోటీ చేస్తున్న నియోజకవర్గాలు మొత్తం నాలుగు కాగా,  20నుంచి 30 మంది పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 33, 30 మంది కంటే ఎక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 13 ఉన్నాయి. మొత్తం స్థానాల్లో నామినేషన్‌ వేసిన 2898 అభ్యర్థులలో 608 మంది విత్‌డ్రా చేసుకున్నట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించించిన సంగతి తెలిసిందే.  

పేరు కోసం ఒకరైతే... పోటీ చేయాలనే తపన మరొకరిది 
ఎలాగైనా పోటీ చేయాలని కొందరు అభ్యర్థులు భావిస్తే మరికొందరు పేరు కోసం పోటీ చేసినట్టుగా ఉంది. ఏదో నామినేషన్‌ వేశామా లేదా అన్నట్లుగా పోటీలో ఉంటున్నారు. ప్రచారం చేయడం కానీ, ఎన్నికల సంఘం కేటాయించిన తన గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ ఇప్పటి వరకైతే చేయడంలేదు.

మరో వైపు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, అభ్యర్థిపై నిరసనతోనో...లేక ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదనో పోటీకి దిగుతున్నారు.. కొన్నిచోట్ల  సొంతపార్టీ నుంచి టికెట్‌ రాక  రెబల్స్‌గా పోటీ చేస్తున్నారు. మరో వైపు  అభ్యర్థి ఓట్లను చీల్చాలని మరికొందరు పోటీ చేస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. 

మరిన్ని వార్తలు