మోసం చేయడం టీడీపీ నైజం

21 Aug, 2019 07:30 IST|Sakshi
నెల్లూరులో పర్యటిస్తున్న మంత్రి అనిల్‌ 

జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌  

సాక్షి, నెల్లూరు: ఒకే అబద్దాన్ని పదేపదే చెప్పి ప్రజలను మోసం చేయడం టీడీపీ నైజమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు. నగరంలోని 52వ డివిజన్‌ రంగనాయకులపేటలో గల రైల్వే గేట్‌ ప్రాంతం, 47వ డివిజన్‌ కుక్కలగుంట, మహాలక్ష్మమ్మ గుడి ప్రాంతాల్లో మంగళవారం పర్యటించిన ఆయన ప్రజా సమస్యలను ఆరాతీశారు. వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సోమశిలకు నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. నాలుగో తేదీనే వదిలి ఉంటే సోమశిల నిండేదంటూ ఓ టీడీపీ నేత మాట్లాడటం బాధాకరమన్నారు. నాలుగో తేదీన నీరొదిలితే సోమశిలకు చేరేందుకు 12 రోజులు పడుతుందని, 16 నాటికి సోమశిలకు నీరు చేరిందని చెప్పారు.

ఈ విషయమై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సదరు నేతకే చెల్లిందని ఎద్దేవా చేశారు. అవగాహన లేకుండా విమర్శలు చేసే పద్ధతిని ఇప్పటికైనా విడనాడాలని హితవు పలికారు. ఆరు రోజుల పాటు 8 లక్షల క్యూసెక్కుల నీరొస్తే కొద్ది సమయంలోనే ఏడు లక్షల క్యూసెక్కులకు సర్దుబాటు చేయగలిగామని వివరించారు. 845 లెవల్లోనే 44 వేల క్యూసెక్కులు తీసుకోలేకపోయారని ఓ నాయకుడు పత్రికల్లో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే రాష్ట్రంలో మూడు జలాశయాలు నిండాయని, సోమశిల, కండలేరులో సైతం నీటిని నింపుతామని, రైతులకు పూర్తిస్థాయిలో నీరందిస్తామని ప్రకటించారు. నీతి, నిజాయతీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు.

సీఎంగా చంద్రబాబు 14 ఏళ్లు పనిచేశారని, 1998లో వరద వచ్చిందన్నారు. ఆయన చేతగానితనంతో శ్రీశైలం పవర్‌ హౌస్‌ను ముంచేశారని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో 35 మంది, కృష్ణా నదిలో ఐదుగుర్ని బలిగొన్న మీ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏ లెవల్‌ నుంచి ఎంత నీరు తీసుకోవాలో అంత సామర్థ్యం మేరే తీసుకెళ్తామని వివరించారు. పార్టీ నేతలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు