రాష్ట్రం విడిపోదనే నమ్మకం కలుగుతోంది!

27 Oct, 2013 23:59 IST|Sakshi
రాష్ట్రం విడిపోదనే నమ్మకం కలుగుతోంది!

‘సమైక్య శంఖారావం’లో ప్రజల స్పందనపై కొణతాల వ్యాఖ్య
సమైక్య స్ఫూర్తిని చాటిన లక్షలాది మంది ప్రజలకు ధన్యవాదాలు
ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు విభజనపై పునరాలోచించాలి
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోవడానికి వాటాలు, ఒడంబడికలు చేసుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు సమైక్య శంఖారావం సభకు హాజరై చూపిన సమైక్య స్ఫూర్తి రాష్ట్రం విడిపోదనే నమ్మకాన్ని తమలో కలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సభను చూసైనా ఢిల్లీ పెద్దలు విభజన నిర్ణయంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తుపాను, వరదలు అతలాకుతలం చేస్తున్నా లెక్క చేయకుండా సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి వచ్చిన లక్షలాది మంది ప్రజలకు పార్టీ తరపున, అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒకే మాట, ఒకే బాట, ఒకే రాష్ట్రంగా ఉండాలనే స్ఫూర్తితో సమైక్య శంఖారావానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రకృతి సహకరించకపోయినా ఈ స్థాయిలో జరిగిన సభను తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ చూడలేదని, ఈ సభకు వచ్చిన ప్రజలకు పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి ైవె ఎస్ రాజశేఖరరెడ్డికి, ఎల్బీ స్టేడియం సభలకూ మధ్య అవినాభావ సంబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రి అయినపుడు ఇదే స్టేడియంలో వేదికపై నుంచి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారని, రైతులకు రుణమాఫీ ప్రకటన కూడా ఇక్కడే చేశారన్నారు. ఇపుడు ఆయన తనయుడు జగన్ నిర్వహించిన సభ తరువాత రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే విశ్వాసం ప్రజలకు కలుగుతోందన్నారు.

సమైక్య సభకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారని వారు కూడా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నందుకే సమైక్య శంఖారావానికి ప్రత్యేక రైళ్లను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విమర్శలకు కొణతాల స్పందిస్తూ.. పాట్నాలో నరేంద్రమోడీ తలపెట్టిన సభకు 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారని అది కూడా మ్యాచ్ ఫిక్సింగేనంటారా? అని ప్రశ్నించారు.

వరద బాధితులను ఆదుకోవాలి
తుపాను, ఇటీవలి వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల కోసం తక్షణమే సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని కొణతాల డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో రోడ్లు దెబ్బతినడమే కాక, రిజర్వాయర్లు నిండి లక్షలాది ఎకరాల్లో పంట ముంపునకు గురైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు పైనే పంట నష్టం జరిగిందన్నారు. 30 మంది వర్షాల బారిన పడి మరణించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు