విజయమ్మ అరెస్ట్కు రాష్ట్రవ్యాప్తంగా నిరసన

31 Oct, 2013 21:27 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అరెస్ట్కు నిరసన వ్యక్తమవుతోంది. వరద బాధితులను పరామర్శించడానికి వెళుతున్న విజయమ్మను ఖమ్మం-నల్గొండ సరిహద్దు ప్రాంతమైన పైనంపల్లి వద్ద  అడ్డుకొని, అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె అరెస్ట్కు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. పోలీసుల చర్యని ఖండించారు. ఆ పార్టీ నేతలు హైదరాబాద్ లో డిజిపి ప్రసాదరావును కలిసి తమ నిరసన తెలిపారు.  ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి విజయమ్మ పర్యటనను అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు.  విజయమ్మ అరెస్ట్కు నిరసనగా ఖమ్మం జిల్లా తల్లాడలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.

తిరుపతి చంద్రగిరి రోడ్డులో ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ విజయమ్మ పర్యటనను అడ్డుకోవడం పిరికిపంద చర్య అన్నారు.  తక్షణమే మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలను తొలగించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సెంటర్లో ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రు ఆధ్వర్యంలో కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేశ్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కొవ్వూరులో కొయ్యె మోషన్ రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా చేశారు.  వైఎస్ఆర్ జిల్లా  పులివెందుల పూలఅంగళ్ల సర్కిల్‌లో పార్టీ కార్యకర్తలు జానారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

కర్నూలులో ఆ పార్టీ నేత  భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ  ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన ప్రాంతాలలో ప్రధాని, సోనియా గాంధీ పర్యటిస్తే ఇలానే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఆ పార్టీ  నేత కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ  విజయమ్మను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అన్నారు.  మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతకాని దద్దమ్మలు, ఓడిపోతామనే భయంతోనే  విజయమ్మను అడ్డుకున్నారన్నారు.

మరిన్ని వార్తలు