తిరిగి వెళ్తున్న బస్సులపై రాళ్ల దాడులు

8 Sep, 2013 01:55 IST|Sakshi
తిరిగి వెళ్తున్న బస్సులపై రాళ్ల దాడులు

ఎల్బీ స్టేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సు అనంతరం సీమాంధ్రకు తిరిగి వెళ్తున్న ఐదు బస్సులపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పలుచోట్ల రాళ్ల దాడులకు పాల్పడ్డారు. విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిలోని హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మధ్య ఈ దాడులు చోటుచేసుకున్నాయి. హయత్‌నగర్‌లోని సన్‌రైస్ ఆసుపత్రి సమీపంలో ఒక బస్సు, రేడియో స్టేషన్ సమీపంలో ఒక బస్సు, లక్ష్మారెడ్డిపాలెంలో రెండు బస్సులు, అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఒక బస్సుపై రాళ్లు విసిరారు. దీంతో ఆ బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కమర్షియల్ టాక్స్ ఉద్యోగి కట్టా సత్యనారాయణ, డ్రైవర్ విఘ్నేష్ గాయపడ్డారు. సత్యనారాయణను చికిత్స నిమిత్తం సన్‌రైజ్ ఆసుపత్రిలో చేర్పించారు.

దాడి అనంతరం బస్సులో వెళ్తున్న వారంతా లక్ష్మారెడ్డిపాలెం వద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణలో మాకు రక్షణ లేదని, పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు అరగంట సేపు ఆందోళన నిర్వహించగా కిలో మీటరు మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎల్‌బీనగర్ డీసీపీ రవివర్మ, వనస్థలిపురం ఏసీపీ ఆనంద్‌భాస్కర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. అనంతరం బస్సులను పోలీసు ఎస్కార్ట్ సహాయంతో పంపించారు.

అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన దాడి ఘటనలో.. బస్సులోంచి దిగిన ఉద్యోగులు రామోజీ ఫిలింసిటీ చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నాకు దిగారు. తెలంగాణవాదులు కూడా అక్కడకు చేరుకోవడంతో ఇరువర్గాల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. దీంతో అక్కడికి చేరుకున్న హయత్‌నగర్ సీఐ శ్రీనివాస్‌కుమార్ వారిని శాంతింపజేసి బస్సును ఎస్కార్ట్ సాయంతో ముందుకు పంపారు.
 

>
మరిన్ని వార్తలు