స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ

Published Thu, Jan 11 2024 5:38 AM

Conduct of elections in a free environment - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా స్వేచ్ఛా­యుత, పారదర్శక వాతావరణంలో ఎన్ని­కలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలకు సమప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ ఓటర్ల జాబితాతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య హక్కును కాపాడాలని, పోలింగ్‌లో పెద్దఎత్తున పాల్గొనాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.

రానున్న లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ 2024 ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిష­నర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌లతో కలిసి విజయవాడలో రాజీవ్‌ కుమార్‌ రెండు రోజుల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా 2024లో తొలి సమీక్ష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో మొదలు పెట్టినట్లు తెలిపారు.

ఎన్నికల సన్నద్ధతపై స్టేక్‌ హోల్డర్స్‌ అందరితో సమావేశాలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 1.99 కోట్లు, మహిళలు 2.07 కోట్లు ఉన్నారని వివ­రించారు. రాష్ట్రంలో 159 అసెంబ్లీ నియోజక­వర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం శుభపరిమాణ­మన్నారు. 2014లో 1013గా ఉన్న పురుష, మహిళా ఓటర్ల నిష్పత్తి ఇప్పుడు 1036కు పెరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 5.8 లక్ష­ల మంది ఉన్నారని, వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలి­పారు.

పోలింగ్‌ స్టేషన్‌ కాకుండా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకున్న వారు ఫాం­12డీ పూర్తి చేయడం ద్వారా అవకాశం పొందవ­చ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో 18–19 ఏళ్లు ఉన్న 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగంచుకోనున్నట్లు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 22న విడుదల చేయనున్నట్లు చెప్పారు.

ధన ప్రవాహం తగ్గించే విధంగా చర్యలు
ఎన్నికల్లో ధన ప్రవాహంతగ్గించే విధంగా పటిష్ట­మైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వివిధ శాఖలకు చెందిన 139 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. మద్యం, నగదు పంపిణీ, బహుమతుల పంపిణీ వంటి వాటి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టడి చేసేందుకు కేంద్రరాష్ట్రాలకు చెందిన 20 టాస్క్‌ఫోర్స్‌లు సమ­న్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపా­రు.

గత రెండేళ్లుగా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో పెద్దఎత్తున నగదు జప్తు చేశామన్నారు. 2018–19లో రూ. 366 కోట్ల నగదును సీజ్‌ చేస్తే 2022–23లో ఆ మొత్తం విలువ రూ. 3,247 కోట్లకు చేరిందన్నారు. 

అందుబాటులోకి సీవిజిల్‌ యాప్‌
నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని ఓటర్లకు పలు సేవలను అందుబాటులోకి తీసు­కొచ్చామని, ఇందుకోసం సీవిజిల్‌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఏదైనా ఫిర్యాదు వస్తే 100 నిమిషాల్లోనే అధికారులు స్పందించి తగు చర్య­లు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు.

ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా ఓటర్లకు సంబంధించిన అన్ని సేవలను అందిస్తున్నామని, అలాగే అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా సమర్పించే అఫిడవి­ట్లు, ర్యాలీల అనుమతి కోసం సువిధ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మొదట ఏ పార్టీ దరఖాస్తు చేస్తే ఆపార్టీకే అనుమతివ్వా­ల్సిందిగా అధికారు­లను ఆదేశించామన్నారు. పోటీలో ఉన్న అభ్య­ర్థుల నేర చరిత్ర తెలుసుకునే విధంగా కేవైసీ (నో యువర్‌ కాండిటేట్‌) యాప్‌ను తీసుకురావడంతో పాటు అభ్యర్థి నేరచరిత్రను తప్పనిసరిగా మూడుసార్లు దినపత్రికలు, టీవీ ఛానల్స్‌లో ప్రచురించాల్సిందిగా కోరారు.

దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద అని ఏర్పాట్లు చేస్తున్నా­మన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అనూప్‌ చంద్రపాండే, అరుణ్‌గోయల్, రాష్ట్ర ఎన్నికలప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధి­కారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement