రెండో ఘాట్‌లో కూలిన కొండ చరియలు

1 Dec, 2015 18:13 IST|Sakshi

తిరుమల : తిరుమలలో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది. ఆదివారం ప్రారంభమైన వర్షం మంగళవారం సాయంత్రం వరకు కొనసాగింది. ఆది, సోమవారాల్లో దఫదఫాలుగా కురిసిన వర్షం మంగళవారం మాత్రం ప్రభావం పెంచింది. దీనివల్ల తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో 11, 12, 14 కిలోమీటర్ల ప్రాంతాల్లో కొండ చరియలు కూలి రోడ్డు మీద పడ్డాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వాటిని తొలగించారు. వర్షాలపై టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఇంజినీర్లతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.

ఐదు జలాశయాల నుంచి నీరు విడుదల
గతవారం కురిసిన వర్షాలకే తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనంతో పాటు జంట ప్రాజెక్టులైన కుమారధార, పసుపుధార ప్రాజెక్టులు నిండాయి. అధికారులు ముందు జాగ్రత్తగా డ్యాముల నుంచి నీటిని కిందికి వదిలిపెట్టారు. తాజాగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో డ్యాముల్లోకి చేరుతున్న నీటి శాతం మేరకు మంగళవారం కిందికి వదిలిపెట్టారు. ఇదే పరిస్థితి తిరుపతిలోని కల్యాణీ డ్యాంలో కూడా ఉంది.

మరిన్ని వార్తలు