పోరాటాలతోనే ప్రత్యేక హోదా

14 Sep, 2015 02:57 IST|Sakshi
పోరాటాలతోనే ప్రత్యేక హోదా

 రాష్ట్ర సదస్సులో పలువురు వక్తలు
 
 మంగళగిరి : పోరాటాలతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాలని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కల్యాణమండపంలో ఆదివారం ప్రత్యేక హోదాపై నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. ముఖ్య అతిథిగా హాజరైన  రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించలేకపోతే అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతామని చెప్పారు. రాజకీయాలకతీతంగా పోరాడి హోదా సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.   హోదా కోసం రాజకీయపార్టీలన్నీ ఏకమై పోరాడాల్సిన అవసరముందని తెలిపారు.

భావితరాలకు అన్యాయం చేసిన వారిగా చరిత్రలో మిగిలిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రధానమంత్రి హోదాపై హామీ ఇస్తే చట్టంతో సమానమని గుర్తించాలన్నారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్యాకేజీ చాలని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటివరకు విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసం కాదని తెలిపారు. 

అఖిపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోదాసాధనకు కృషి చేయాలని కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటి మాజీ వీసీ కె.వియన్నారావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి రెండేళ్ళు కావస్తున్నా విభజన చట్టంలోని ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వాలపై పౌరసమాజం పోరాడాలని పిలుపునిచ్చారు. నాన్‌పొలిటికల్ జేఏసి కన్యీనర్ అప్పికట్ల శ్రీహరినాయుడును రాష్ట్రనాన్‌పొలిటికల్ జేఏసీ కన్యీనర్‌గా ఎన్నుకున్నారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు వీవీ ప్రసాద్, వీవీ వెంకటేశ్వరావు, రాజశేఖర్, ఏటుకూరి గంగాధరరావు, పద్మావతి, ఉమాశ్రీ, అయ్యస్వామి, కోటేశ్వరావు, చెన్నా అజయ్‌కుమార్, సింహాద్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు