చకచకా కరెంటు.. కుళాయి

20 Nov, 2023 03:45 IST|Sakshi

వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో ముమ్మరంగా సదుపాయాల కల్పన

నిర్మాణం పూర్తయిన 5.02లక్షల ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు 

ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు 

తాత్కాలికంగా డ్రెయినేజీ కోసం 1.15లక్షల ఇంకుడు గుంతలు 

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదు­పాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథ­కం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచి­తంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

అదేవి­ధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారు­లకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 

6,655 కాలనీల్లో విద్యుత్‌ పనులు పూర్తి 
పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో విద్యుత్‌ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్‌ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్త­యిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 

1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు
కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్‌ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణా­లన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదు­పాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమ­యంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమ­వుతాయి.

అందువల్ల ప్రస్తుతం నిర్మా­ణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్‌ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది.

ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్‌ల నిర్మా­ణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగు­తున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్‌ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

మరిన్ని వార్తలు