మంటకలిసిన మానవత్వం

2 Aug, 2017 13:28 IST|Sakshi
మంటకలిసిన మానవత్వం
► విద్యార్థినికి వాంతులు వస్తున్నా బస్సు ఆపనివ్వని ప్రయాణికులు
►  పరిస్థితి విషమించడంతో నిండు ప్రాణం బలి  

జయపురం(ఒడిశా): మృత్యువు ఎన్ని రకాలుగా సంభవిస్తుందో చెప్పతరం కాదు. రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్య సమస్యలు వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండి, హుషారుగా ఉంటూ చదువుకొనే ఒక విద్యార్థిని మరణం అందరికీ వింతగానే ఉంది. ఈమె వాంతులు చేసుకొనేందుకు తగిన అవకాశం లేక ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ సంఘటన జయపురం వాసులను కలవర పరచటంతో పాటు విషాదాన్ని కలిగించింది.

ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. జయపురంలోని శ్రీరామనగర్‌ నివాసి రాజేంద్ర మహంతి కుమార్తె గిరిజ మహంతి(17) ఆకస్మికంగా మృతి చెందింది. ఈమె మంచి ఆరోగ్య వంతురాలు, హుషారుగా ఉంటూ బాగా చదువుకుంటున్న విద్యార్థిని. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పంతో ఆమె క్యాట్‌ కోసం కోచింగ్‌ తీసుకొనేందుకు భువనేశ్వర్‌ వెళ్లింది. గత శనివారం ఆమె భువనేశ్వర్‌ నుంచి జయపురం వచ్చేందుకు భువనేశ్వర్‌లో ఒక ప్రైవేట్‌ బస్సు ఎక్కింది. ఆమెతో పాటు సహచర విద్యార్థిని ఆము ఉంది. ఎయిర్‌ కండిషన్‌ బస్సు కావటంతో బయట నుంచి గాలి రావటంలేదు. బస్సులో కూర్చున్న కొంత సమయానికి ఆమెకు వాంతి వచ్చింది. బస్సు కిటికి తలుపు నుంచి ఆమె వాంతి చేసింది. మార్గంలో బస్సు భోజనాలకు ఆపగా ఆమె వాంతులు వస్తాయేమోనన్న భయంతో భోజనం చేసేందుకు వెళ్లలేదు. బస్సులో ఉన్న ఒక ప్రయాణికురాలు ఆమెకు బిస్కెట్‌ ఇచ్చింది. దీనిని గిరిజ తిన్నది.
 
అయినా ఆమెకు వాంతులు తగ్గలేదు. వాంతులు వచ్చినప్పుడల్లా ఆమె డ్రైవరకు చెప్పి బస్సు నిలుపమంది. అయితే తోటి ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బస్సు ఆపిన డ్రైవర్‌ను తిట్టటంతో ఆమె గిల్టీగా ఫీలయింది. అందుచేత మరలా వాంతి వస్తున్నా బస్సు ఆపమని చెప్పకుండా వాంతిని అదుపుచేసుకుంది. అలా వాంతి చేయకుండా ఉండటంతో ఆం«ధ్రప్రదేశ్‌ రాష్ట్రం సాలూరు వచ్చేటప్పటికీ ఆమె పరిస్థితి శోచనీయంగా మారింది. ఆమె తన పరిస్థితిని తన ఇంటికి ఫోన్‌ చేసి తెలిపింది. వెంటనే ఆమె తండ్రి రాజేంద్ర మహంతి, చిన్నాన్న నరేంద్ర మహంతి సాలూరులో ఉన్న తమ బంధువులకు తెలియజేసి గిరిజకు సహాయం అందించమని తెలిపారు. వారు వెంటనే సాలూరులో బస్సును ఆపి గిరిజను సమీప హాస్పిటల్‌లకు తీసుకువెళ్లారు.
 
హాస్పిటల్‌లో ఆమె మరణించింది. వస్తున్న వాంతిని చేయకుండా ఉంచటంతో అది శరీరంలో లంగ్స్‌లోకి ప్రవేశించిందని, దీంతో ఆమె రక్త ప్రసరానికి అవరోధం ఏర్పడి ఆమె మరణించినట్టు డాక్టర్లు వెల్లడించినట్టు సమాచారం. బస్సులో వాంతి చేసుకొనే అవకాశం లేక ఆమె మరణించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన ప్రజలను కలవర పరుస్తుంది. బస్సును ఆపినందుకు డ్రైవర్‌పై ప్రయాణికులు కోపగించటం వల్ల ఒక నిండు ప్రాణం బలి అయింది. ఒక కుటుంబం బిడ్డను కోల్పోయింది. ఇది దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు పురావృతం కాకుండా ప్రయాణికులు మానవత్వంతో వ్యవహరిస్తారని ఆశిద్దాం.   
>
మరిన్ని వార్తలు