ముందస్తు ప్రణాళికతో వడదెబ్బ నివారణ

4 Mar, 2017 13:07 IST|Sakshi

► ముఖ్య కూడళ్లలో మజ్జిగ, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
► బాధితులకు అత్యవసర వైద్య సేవలందించాలి
► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం


విజయనగరం కంటోన్మెంట్‌: వేసవి కాలంలో ప్రజలు వడదెబ్బ భారిన పడకుండా ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాల కొండయ్యతో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్య జాగ్రత్తలను వివరించాలన్నారు. తెలుపు రంగు ఉన్న పలుచటి కాటన్‌ వస్త్ర ధారణను ప్రోత్సహించాలని సూచించారు. ఓఆర్‌ఎస్, గ్లూకోజ్, ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

 

పీహెచ్‌సీల్లో 24 గంటల వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ఉపాధి హామీ వేతనదారులు ఉదయం 6 నుంచి 9.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల దాహార్తి తీర్చేందుకు, వైద్యం అందించేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ జిల్లాలో వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. జిల్లాలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీకి గతేడాది జిల్లాకు రూ.3 కోట్లు విడుదలయ్యాయని, వీటిలో రూ.23.38 లక్షలు ఖర్చు చేసి మిగతా నిధులు ప్రభుత్వానికి తిరిగి పంపించామన్నారు. 2015లో జిల్లాలో 149 వడదెబ్బ మరణాలు సంభవిస్తే బాధిత కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా అందించామన్నారు. 2016లో 115 మంది వడదెబ్బకు గురై మృతి చెందగా మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా చెల్లించేందుకు ప్రతిపాదించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ శ్రీకేశ్, బి.లఠ్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్ర, సీపీఓ జె.విజయలక్ష్మి, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల జేడీలు లీలావతి, వై.సింహాచలం, ఉద్యాన వన శాఖ డీడీ పీఎన్‌వీ లక్ష్మీనారాయణ, డీఎఫ్‌ఓలు వేణుగోపాల్, లక్ష్మణ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ పద్మజ, డీసీహెచ్‌ఓ ఉషశ్రీ, సాలూరు కమిషనర్‌ మల్లయ్యనాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు