ట్రంకు పెట్టెల గోల్‌మాల్‌

30 Aug, 2019 08:20 IST|Sakshi

బీసీ హాస్టళ్లకు ట్రంకు పెట్టెల సరఫరాలో మతలబు

సరఫరా చేయకుండానే రూ.89.50 లక్షలు ఏజెన్సీ ఖాతాలో జమ

వంటపాత్రలు, ప్లేట్లు, గ్లాసుల సరఫరాలోనూ ఇదే పరిస్థితి 

సాక్షి, అనంతపురం: బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు ట్రంకు పెట్టెల సరఫరాలో గోల్‌మాల్‌ జరిగింది. పెట్టెల సరఫరా పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. వంద, రెండొందలు కాదు.. ఏకంగా రూ.89,50లక్షలు ఏజెన్సీ ఖాతాలోకి  జమ చేశారు. ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా హాస్టళ్లకు పూర్తిస్థాయిలో ట్రంకు పెట్టెలు చేరకపోవడం చూస్తే.. అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. వాస్తవానికి పెట్టెలను హాస్టళ్లకు సరఫరా చేసిన తర్వాత నిబంధనల ప్రకారం నాణ్య తను పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాతే బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండానే, ఒక్కటంటే ఒక్క పెట్టె సరఫరా చేయక ముందే బిల్లు చెల్లించడం గమనార్హం.

ఫిబ్రవరిలో బిల్లు పెట్టిన అధికారులు 
ఈ ఏడాది ఫిబ్రవరి 2న బిల్లు మంజూరు చేసిన అధికారులు ట్రెజరీకి పంపించారు. అయినా సదరు ఏజెన్సీ పెట్టెలు సరఫరా చేయలేదు. అనివార్య కారణాల వల్ల బిల్లు ట్రెజరీలో పెండింగ్‌ పడినా మే 2న ఏజెన్సీ ఖాతాలో జమ అయ్యింది. నాలుగు రోజులు గడిస్తే సరిగ్గా నాలుగు నెలలు అవుతుంది. ఇప్పటిదాకా 9,230 ట్రంకు పెట్టెలు సరఫరా చేసినట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. వీరి లెక్క ప్రకారమైనా ఇంకా 2,784 ట్రంకు పెట్టెలు సరఫరా చేయాల్సి ఉంది. 8వేల పెట్టెలు మాత్రమే సరఫరా చేశారనేది బీసీ సంక్షేమశాఖ అధికారుల లెక్క. అంటే.. ఇంకా 3,784 సరఫరా చేయాల్సి ఉంది. ఎవరి లెక్కలు వాస్తవమో వారికే తెలియాలి. టెండరు దక్కించుకున్న తర్వాత నెలలోపు సరఫరా చేయాల్సి ఉన్నా.. ఏడు నెలలవుతున్నా పూర్తిస్థాయిలో పెట్టెలు సరఫరా చేయకపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థంకాని పరిస్థితి. బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది.

అన్నింటా ఇదే పరిస్థితి 
హాస్టళ్లకు ప్లేట్లు, గ్లాసులు, వంటపాత్రలు సరఫరా చేయడంలోనూ అధికారులు ఇదేరకంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వస్తువులు సరఫరా చేయకముందే పునీత్‌ ఏజెన్సీకి రూ.73 లక్షల బిల్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. ప్లేట్లు, గ్లాసులకు సంబంధించి రూ.13,81,610, వాటర్‌ డ్రమ్ములకు రూ.2,88,000, చార్జింగ్‌ లైట్లకు రూ.5,25000 చెల్లించారు. అలాగే వంటపాత్రల సరఫరాకు దాదాపు రూ.51 లక్షలు ముట్టజెప్పారు. ఈ బిల్లులను ఏకంగా జనవరి 10వ తేదీనే పెట్టారు. ట్రెజరీలో జాప్యం జరగడంతో వెనక్కు వచ్చాయి. తిరిగి 20 రోజుల కిందట ఈ మొత్తం బిల్లులు ట్రెజరీకి పంపించేశారు. ఏ క్షణమైనా ఏజెన్సీ ఖాతాలో జమ కావచ్చు. కానీ ఇప్పటిదాకా ఒక్క గ్లాసు కూడా సరఫరా చేయని పరిస్థితి.

ఇంకా నెల పట్టొచ్చు  
హాస్టళ్లకు పూర్తిస్థాయిలో ట్రంకు పెట్టెలు సరఫరా చేసేందుకు ఇంకా నెల పట్టొచ్చు. ఇప్పటిదాకా 9,230 ట్రంకు పెట్టెలు సరఫరా చేశాం. ఇంకా 2,784 ఇవ్వాల్సి ఉంది. సచివాలయ పరీక్షల నిర్వహణకు వివిధ మెటీరియల్‌ అవసరమని జిల్లా అధికారులు చెప్పడంతో పెట్టెల తయారీని పక్కనపెట్టాం.  
– శతృసింగ్, పునీత్‌ ఏజెన్సీ

నేను రాకముందే ఇచ్చేశారు   
ట్రంకు పెట్టెలకు సంబంధించిన బిల్లు నేను చార్జ్‌ తీసుకోకముందే ఇచ్చేశారు.  పెట్టెలు సరఫరా చేయాలని ఏజెన్సీపై ఒత్తిడి తెస్తున్నాం. ఇప్పటిదాకా 8వేలు ఇచ్చారు. హాస్టళ్లకు ప్లేట్లు, గ్లాసులు, వంటపాత్రల సరఫరాకు సంబంధించిన బిల్లు ట్రెజరీకి పంపాం. ఇన్‌ ఆపరేషన్‌ అకౌంటులో ఉండేలా బ్యాంకు అధికారులతో మాట్లాడాం. వస్తువులు సరఫరా చేసిన తర్వాతే ఆ మొత్తం డ్రా చేసుకునేలా చూస్తాం. 
– యుగంధర్, బీసీ సంక్షేమ శాఖ డీడీ 


 

మరిన్ని వార్తలు