రెండో విడతకు నో

12 Sep, 2014 01:17 IST|Sakshi

* ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
* ఏపీ ఉన్నత విద్యామండలి తీరుపై ఆగ్రహం
* గడువు పొడిగింపు గతంలోనే ఎందుకు కోరలేదని ప్రశ్న
* భారీగా సీట్లు మిగిలిపోయాయని అభ్యర్థించిన మండలి
* సీట్లు మిగిలినా అనుమతివ్వబోమన్న కోర్టు.. పిటిషన్ కొట్టివేత
 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అడ్మిషన్ల కోసం ఇంతకుముందే గడువు పొడిగించామని, మళ్లీ పెంచాలని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయన్న ఏపీ ఉన్నత విద్యామండలి వాదనను తప్పుబట్టింది. ప్రతిసారీ గడువు పొడిగించలేమని, సీట్లు మిగలడానికి మండలి తీరే కారణమని పేర్కొంటూ.. పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతివ్వాలంటూ ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ సుధాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ప్రఫుల్ల చంద్రపంత్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత ఏపీ మండలి తరఫున న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ...

‘‘ఏఐసీటీఈ నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం జూలై 31లోపు అడ్మిషన్లు పూర్తిచేసి, ఆగస్టు 1న తరగతులు ప్రారంభించాలి. మిగతా సీట్ల భర్తీని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ప్రభుత్వం ఏకాభిప్రాయానికి వచ్చిన మీదట.. మీరు ఆగస్టు 31 వరకు గడువు పొడిగించారు. దాని ప్రకారం మేం కౌన్సెలింగ్ నిర్వహించాం. లక్షా 17 వేల సీట్లు భర్తీకాగా.. ఇంకా 65 వేల సీట్లు మిగిలిపోయాయి.

వాటి భర్తీ కోసం కౌన్సెలింగ్‌కు అదనపు గడువు ఇవ్వాలని కోరుతున్నాం..’’ అని విన్నవించారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ... ‘‘ఇంతకుముందు మీరు కోరిన తేదీల ప్రకారమే గడువు పొడిగించాం. కానీ అదనపు గడువు కావాలని మీరు ఆరోజు ప్రస్తావించలేదు. ఒకసారి అవకాశం ఇస్తే మళ్లీ మళ్లీ వస్తారా? ఈ రోజు గడువు పొడిగిస్తే మీరు మరో విడత కౌన్సెలింగ్ అంటారు.. ప్రతిసారీ ఇలా గడువు పొడిగించలేం. సీట్లు మిగిలిపోతే మిగలనివ్వండి.. అందుకు మీరే కారణం కదా..’’ అని పేర్కొన్నారు.

దీనికి విశ్వనాథన్ బదులిస్తూ.. ‘‘ఆ రోజున కౌన్సెలింగ్ ముగింపు తేదీ ఆగస్టు 31 అని ఇచ్చాం. అయితే తదుపరి అడ్మిషన్ల ప్రక్రియకు మరో 15 రోజుల గడువు ఉంటుంది. ఆ మేరకు ఏఐసీటీఈ నిర్దేశిత షెడ్యూలులో కూడా ఉంది. మేం యాజమాన్యాల తరఫున గానీ ఎవరి తరఫునగానీ మాట్లాడడం లేదు. అడ్మిషన్లు నిర్వహించాల్సిన అథారిటీగా కోర్టును ఆశ్రయించాం..’’ అని పేర్కొన్నారు. కానీ దీనిని న్యాయమూర్తి తప్పుబట్టారు. ‘‘మీరు సూచించిన తేదీల ప్రకారమే అనుమతించాం. మళ్లీ గడువు కోరడం సమంజసం కాదు. సెప్టెంబరు 1నే తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు 11వ తేదీ. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకెప్పుడు చేస్తారు..?’’ అని ప్రశ్నించారు.

అయితే.. పంజాబ్‌లోని కొన్ని కళాశాలల్లో కూడా సీట్లు మిగిలిపోయాయని, సీబీఎస్‌ఈ ఫలితాల విడుదలలో జాప్యం కారణంగా 6 కళాశాలల్లో 180 సీట్లు మిగిలాయని మరో న్యాయవాది కోర్టు దృష్టికి తేగా... ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో 65 వేల సీట్లు మిగిలిపోయాయని గుర్తుంచుకోవాల’ని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు అనుమతిస్తే ఏఐసీటీఈని సంప్రదించి 15 రోజుల పాటు గడువు కోరుతామని ఏపీ ఉన్నత విద్యామండలి న్యాయవాది అభ్యర్థించగా... న్యాయమూర్తి స్పందిస్తూ ‘మీరు ఏఐసీటీఈకి వెళ్లినా అనుమతివ్వాల్సింది కోర్టే కదా..’ అని స్పష్టం చేశారు. ‘ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మంచి రోజు కోసం ఎదురుచూడండి..’ అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చారు.

మరిన్ని వార్తలు