ఇదేం దారుణం

18 Jan, 2014 03:34 IST|Sakshi

నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ :  నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన పథకాలు బ్యాంకుల్లో పరపతి ఉన్నవారికే దక్కుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రుణాలను అమలు చేసే బాధ్యత బ్యాంకులపై ఉంచడంతో వారి దయాదాక్షిణ్యాలపై రుణాలందుతున్నాయి. ఎస్సీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, గిరిజన సంక్షేమ అధికారులు సైతం ముందుగా బ్యాంకుల నుంచి రుణ మంజూరు పత్రాలను తెచ్చుకున్న వారికే సబ్సిడీ విడుదల చేస్తామని బాహాటంగానే చెబుతుండటంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. లబ్ధిదారుల ఎంపికల్లోనూ నేతల దందా కొనసాగుతున్నది.
 
 అధికార పార్టీ నేతలు సిపారసు చేసిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాం కులు, సంక్షేమ అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అర్హత కలిగిన వారికి బ్యాంకులు, అధికారులు ఉపాధి యూనిట్లను మంజూరు చేయడం లేదని కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. జిల్లాలోని మున్సిపల్, మండల కేంద్రాల్లో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు  ఈ నెల 24వ తేదీలోపు లబ్దిదారులను ఎంపిక నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు సిపారసు చేసిన వారికి మాత్రమే రుణాలు అందించేందుకు అధికారులు జాబితాలు సిద్ధం చేసుకుని మొక్కుబడిగా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
 
 స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు.  గ్రామీణ ప్రాంతాల్లో మార్జిన్ మనీ, పట్టణ ప్రాంతాల్లో రాజీవ్ అభ్యుదయ యోజన పథకాల కింద 50 నుంచి 60 శాతం వరకు సబ్సిడీ ఇస్తారు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఐటీడీఏ, మైనార్టీ కార్పొరేషన్, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ఈ ఏడాది సుమారు 12,656 మందికి స్వయం ఉపాధి పథకాలకు రుణాలను మంజూరు చేయాలని, దాదాపు రూ.120 కోట్ల మార్జిన్ మనీ అందించాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.
 
 మార్జిన్ మనీ ఇవ్వాలంటే బ్యాంకులు యూనిట్లకు సంబంధించి రుణాలను ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు లబ్ధిదారులకు పత్రాలు ఇవ్వాలి. ముందుగా ప్రభుత్వం నుంచి జిల్లాకు మంజూరైన యూనిట్లను బ్యాంకర్ల కమిటీలో ఆమోదం తీసుకుంటారు. ముందుగా లబ్ధిదారులే బ్యాంకర్లను ప్రసన్నం చేసుకుంటే తప్ప మంజూరు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు.   
 
 అర్హత కల్గిన వారికే రుణాలు : డాక్టర్ సోమయ్య, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్
 అర్హత కలిగిన వారికే కార్పొరేషన్ రుణాలను మంజూరు చేస్తున్నాం. మండల స్కీనింగ్ సెలక్షన్ కమిటీ సిపారస్సు చేసిన వారిని మాత్రమే అర్హులుగా నిర్ణయిస్తాం. ఈ కమిటీలో బ్యాంకు అధికారులు కూడా సభ్యులుగా ఉన్నందున కమిటీ ఎంపిక చేసిన వారందరికి రుణాలను అందజేస్తాం. ముందుగా బ్యాంకు విల్లింగ్ లెటర్‌ను దరఖాస్తుకు జత చేయాల్సిన అవసరం లేదు.
 
 బ్యాంకులతో నిమిత్తం లేకుండా రుణాలివ్వాలి : పద్మజా యాదవ్,
 బీసీ సంక్షేమ సంఘం, మహిళా కార్యదర్శి
 నిరుద్యోగ యువతకు బ్యాంకు రుణ మంజూరు పత్రంతో నిమిత్తం లేకుండా స్వయం ఉపాధి రుణాలను అందజేయాలి. బీసీ కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది బ్యాంకు విల్లింగ్ లెటర్ ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అర్హత కలిగిన వారికి అన్యాయం జరుగుతుంది.
 
 అనర్హులకే రుణాలు : డాక్టర్ శ్రీను నాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు
  బ్యాంకు పరపతి ఉన్నవారికే ఐటీడీఏ అధికారులు స్వయం ఉపాధి రుణాలకు మంజూరు చేస్తుండటంతో అర్హత కలిగిన గిరిజన యువతి, యువకులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. రాజకీయ నాయకులు సిపారస్సు చేసిన వారికే బ్యాంకు అధికారులు విల్లింగ్ లెటర్లు ఇవ్వడం అన్యాయం. అర్హత కల్గిన వారికే రుణాలను, సబ్సిడీలను అందజేయాలి.
 

>
మరిన్ని వార్తలు