విశాఖలో తల్లీ తనయుడి అనుమానాస్పద మృతి

25 Feb, 2017 01:44 IST|Sakshi
విశాఖలో తల్లీ తనయుడి అనుమానాస్పద మృతి

నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో కాలిబూడిదైన వైనం
కుమారుడు అమెరికాకు బయల్దేరాల్సి ఉండగా దుర్ఘటన


డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణం): కుటుంబ కలహాలో.. మరే కారణమో తెలియదు గానీ తల్లి, కుమారుడు మంటల్లో కాలి బూడిద య్యారు. కుమారుడు మరో గంటలో అమెరి కాకు పయనమవ్వాల్సిన ఉండగా ఈ దుర్ఘటన జరగడం అందరినీ నివ్వెరపరి చింది. విశాఖపట్నం డాబాగార్డెన్స్‌ లలితా కాలనీలోని విష్ణుకిరీటి అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తులో న్యాయవాది కంచుబోయన భాగ్యలక్ష్మి(67) నివసిస్తున్నారు. భర్త డాక్టర్‌ రామారావుతో విభేదాల కారణంగా ఆమె 20 ఏళ్లనుంచి విడిగా ఉంటున్నారు. రామారావు తగరపువలసలో నివసిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

కుమారుడు ఫణిమహేష్‌(40) తన భార్యతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. రెండు నెలల క్రితం వీరికి పాప పుట్టింది. ఎనిమిది రోజుల కిందట ఫణిమహేష్‌ విశాఖపట్నం వచ్చాడు. శుక్రవారం తిరిగి అమెరికాకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యాడు. లగేజీ సిద్ధం చేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఆటో కూడా పిలిచారు. ఇంతలో తల్లీకొడుకుల మధ్య ఏం జరిగిందో తెలియదు. ఇంటిలో నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ అప్రమత్తమయ్యాడు. తలుపుకు తాళం వేసి ఉండడంతో మిగిలిన అపార్టుమెంట్‌వాసులకు సమాచారమిచ్చాడు.

వారంతా వచ్చి తాళం విరగ్గొట్టి చూసే సరికి ఇంటి ప్రధాన ద్వారం వద్ద భాగ్యలక్ష్మి మృతదేహం కాలి బూడిదై కనిపించింది. లోపల దేవుడి గదిలో ఫణిమహేష్‌ కూడా కాలి బూడిదై కనిపించాడు. అపార్ట్‌మెంట్‌వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు భాగ్యలక్ష్మి, ఫణిమహేష్‌ మృతదేహాలను పోస్టుమార్టం కోసం కింగ్‌జార్జి హాస్పిటల్‌(కేజీహెచ్‌)కు తరలించారు. కుటుంబంలో కలహాలు ఉన్నాయని, తాను ఒంటరినయ్యానన్న మానసిక వేదనతో భాగ్యలక్ష్మి ఆత్మాహుతి చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. తల్లిని రక్షించే యత్నంలో ఫణిమహేష్‌ కూడా కాలిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. వాచ్‌మన్‌తో భాగ్యలక్ష్మి కిరోసిన్‌ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. తన భార్య, కుమారుడు చనిపోయారన్న సమాచారం అందుకున్న భాగ్యలక్ష్మి భర్తకు డాక్టర్‌ రామారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు