స్వైన్‌ టెర్రర్‌

9 Nov, 2018 10:59 IST|Sakshi

మరో గర్భిణికి వ్యాధి లక్షణాలు

నాలుగుకు చేరిన బాధితుల సంఖ్య

అనంతపురం న్యూసిటీ: ‘అనంత’ స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. రోజురోజుకో చోట స్వైన్‌ఫ్లూ కేసు నమోదవుతుండడంతో జనం వణికిపోతున్నారు. స్వైన్‌ఫ్లూతో ఇప్పటికే జిల్లాలోని ముగ్గురు కర్నూలు, హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... తాజాగా ఓ గర్భిణికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. రెండ్రోజుల క్రితం నార్పలకు చెందిన ఓ గర్భిణి(26)కి స్వైన్‌ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కుటుంబీకులు హుటాహుటిన బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యశాఖాధికారులు గర్భిణికి త్రోట్‌ స్వాప్‌ తీయగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆమెను బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే విషయమై డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్‌ను ఆరా తీయగా..స్వైన్‌ఫ్లూ సోకిన మాట వాస్తవమేనన్నారు.

గర్భిణీ ఆరోగ్యం మెరుగుపడుతోందన్నారు.  ఇప్పటికై కళ్యాణదుర్గం బైపాస్‌కు చెందిన ఓ మహిళ స్వైఫ్లూతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా...అనంతపురం నగరానికి చెందిన ఓ వ్యక్తి, ఓడీసీ మండలం కొండకమర్లకు చెందిన ఓ మహిళ స్వైఫ్లూతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా జిల్లాలో స్వైన్‌ఫ్లూకు చికిత్స చేసేందుకు అవసరమైన సదుపాయాలు, మందులు లేకపోవడంతో జనం భయాందోళనలు చెందుతున్నారు. స్వైన్‌ఫ్లూ ఇంతగా విజృంభిస్తున్నా... వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు