రింగ్.. రింగా

5 Oct, 2014 03:40 IST|Sakshi

- బెజవాడ చుట్టూ రియల్ సిండికేట్ల భూ దందా
- తనఖా భూములపై కన్ను
- వేలం ప్రక్రియ ద్వారా కారుచౌకగా సొంతం
- రింగ్ అయిన వ్యాపారులు
- సిండికేట్ల ఉచ్చులో ప్రభుత్వ అధికారులు
రూ. 32 కోట్ల విలువైన భూమి వేలంలో రూ. 7.25 కోట్లకే..
సాక్షి, విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని విజయవాడ చుట్టుపక్కల సరికొత్త భూదందా మొదలైంది. నగరం చుట్టూ భూముల ధరలు చుక్కలనంటుతుండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం తనఖా ఉన్న ఆస్తులను వేలం పేరుతో కారుచౌకగా కాజేస్తున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలోని భీమవరంలో ఇటీవల జరిగిన వేలం ఉదంతమే ఇందుకు నిదర్శనం. భీమవరం గ్రామంలో 65వ నంబరు జాతీయ రహదారి సమీపాన సర్వే నంబర్లు 307/2, 307/3లలో 13.19 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 20 ఏళ్ల క్రితం కొందరు ఈస్ట్ ఇండియా గ్రానైట్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ నిర్వాహకులు 15 ఏళ్ల క్రితం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్‌సీ) నుంచి రూ.4 కోట్లు రుణం పొందారు.

ఇందుకోసం కంపెనీని మార్ట్‌గేజ్(తాకట్టు) చేశారు. దీని ప్రకారం రుణం చెల్లించకపోతే సదరు కంపెనీ ఆస్తిపై సర్వ హక్కులూ ఎస్‌ఎఫ్‌సీకి ఉంటాయి. ఈస్ట్ ఇండియా గ్రానైట్ కంపెనీ నిర్వాహకులు వ్యాపారం సాగించి ఎస్‌ఎఫ్‌సీకి రుణం తిరిగి చెల్లించలేదు. ఏడేళ్ల క్రితం కంపెనీని కూడా మూసివేశారు. రుణం చెల్లించాలని ఎస్‌ఎఫ్‌సీ అధికారులు ఆ కంపెనీ నిర్వాహకులకు మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. చివరి ప్రయత్నంగా రుణం కోసం ష్యూరిటీగా చూపిన కంపెనీ, 13.19 ఎకరాల భూమిని వేలం వేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ కంపెనీ నిర్వాహకుల నుంచి స్పందన లేదు. దీంతో సదరు ఆస్తిని వేలం వేసే బాధ్యతను హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన పృథ్వీ ఎస్టేట్స్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ కంపెనీ లిమిటెడ్‌కు అప్పగించారు.
 
ఇక్కడ నుంచే అసలు కథ మొదలు..
ఈస్ట్ ఇండియా గ్రానైట్ కంపెనీ ఆస్తులను వేలం వేసేందుకు పృథ్వీ ఎస్టేట్స్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ కంపెనీ లిమిటెడ్ సంస్థ పత్రికల్లో ప్రకటన విడుదల చేసింది. వేలంపాటలో పాల్గొనే వారు గత నెల 23న సదరు కంపెనీ తనఖా పెట్టిన ఆస్తిని పరిశీలించే వెసులుబాటు కల్పించారు. ఆ మరుసటి రోజు(24) నుంచి 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు సీల్డ్ టెండర్లు స్వీకరించారు. ఈ క్రమంలో ఆస్తిని సులభంగా వేలం వేసేందుకు రెండుగా విభజించారు. మొదటి లాట్‌లో కంపెనీ మిషనరీ, షెడ్లు పేర్కొన్నారు. రెండో దానిలో కంపెనీ ఉన్న స్థలాన్ని కేటాయించారు. లాట్-1కు రూ.30 లక్షలు రిజ్వర్ ధర నిర్ణయించారు. టెండరుతోపాటు పది శాతం మొత్తం రూ. 3లక్షలు చెల్లించేలా నిబంధన విధించారు.

లాట్-2లోని ఆస్తి రిజర్వు ధరను రూ.5.5కోట్లుగా నిర్ణయించారు. దీనికి రూ.55 లక్షలను టెండరుతోపాటే సమర్పించేలా షెడ్యూల్ ప్రకటించారు. లాట్-2లో పేర్కొన్న భూమిని పొందేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పక్కాగా పథకం రచించారు. ముందుగానే అందరూ రింగ్ అయ్యారు. పథకం ప్రకారం జిల్లాకు చెందిన ఏడుగురు రియల్టర్లు ముందుగానే మాట్లాడుకుని దానికి అనుగుణంగా టెండర్లు దాఖలు చేశారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో రూ.32 కోట్లకు పైగా ధర పలికే 13.19 ఎకరాల స్థలాన్ని కేవలం రూ.7.25 కోట్లకే సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎస్‌ఎఫ్‌సీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.  
 
ఎకరా విలువ రూ.2.5 కోట్లుపైగానే...
ప్రస్తుతం భీమవరం వద్ద జాతీయ రహదారి సమీపంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్ర విభజనకు ముందు ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ లక్షల రూపాయల్లోనే పలికేది. విజయవాడను రాజధానిగా ప్రకటించిన తర్వాత కోట్ల రూపాయలకు చేరింది. ఒక దశలో ఎకరం రూ. 5కోట్లకు పైగా పలికింది. ప్రస్తుతం రూ.2.5 కోట్లు చెబుతున్నారు. ఈ లెక్కన 13.19 ఎకరాలు రూ. 32.5 కోట్లు ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ.7.25 కోట్లకే పొందడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
 
నియంత్రణ ఎక్కడ!
ప్రస్తుతం రాజధానికి భూసేకరణకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో వీజీటీఎం ఉడా పరిధిలో లేఅవుట్లకు అనుమతులు నిలిపివేశారు. క్రయవిక్రయాలపై కొన్నిచోట్ల నిషేధం విధించారు. ఇలా అనేక మార్గాల్లో ధరలను నియంత్రించటంతోపాటు భూముల క్రయవిక్రయాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. కానీ, భీమవరంలో 13.19 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు వేలంలో సొంతం చేసుకుని ప్రత్యక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినా అధికారులెవరూ పట్టించుకోకపోవటం గమనార్హం.

మరిన్ని వార్తలు