లంచం తీసుకుంటూ దొరికిపోయిన తహసీల్దార్‌

25 Sep, 2017 08:30 IST|Sakshi

పథకం ప్రకారం పట్టుకున్న ఏసీబీ అధికారులు

పాకాల/పూతలపట్టు : పూతలపట్టు తహసీల్దార్‌ కె.సుధాకరయ్య లంచం తీసుకుం టూ తిరుపతి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ఏసీబీ అధికారులు ఆయనను ఆదివారం ఉదయం 9 గంటలకు అతని స్వగృహంలో అరెస్టు చేశారు. అనంతరం 3 గంటల వరకు సోదాలు నిర్వహిం చారు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి కథనం మేరకు.. పూతలపట్టు తహసీల్దార్‌గా పని చేస్తున్న కె.సుధాకరయ్య పాకాల పట్టణంలోని భారతంమిట్టలో నివాసముంటున్నారు. పూతలపట్టు మండలంలోని పి.కొత్తకోట వద్ద 4 హెక్టార్లలో ఉన్న ఒక క్వారీకి ఎన్‌వోసీ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.2.50 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు.

తాను అంత డబ్బు ఇవ్వలేనని, రెండు లక్షలు ఇస్తానని మధుసూదన్‌రెడ్డి చెప్పాడు. అందుకు తహసీల్దార్‌ అంగీకరించారు. ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి శనివారం తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు ఆదివారం ఉదయం మధుసూదన్‌రెడ్డి తహసీల్దార్‌కు ఆయన నివాసంలో డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం సుధాకరయ్యను పూతలపట్టు కార్యాలయానికి తీసుకెళ్లి రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా, లంచం అడిగినా 9440446190 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, గిరిధర్, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జైలుకు తరలింపు
ఏసీబీ వలలో చిక్కిన పూతలపట్టు తహసీల్దారు సుధాకరయ్యను నెల్లూరు ఏసీబీ జైలుకు తరలించారు. ఆయన సొంత నివాసం పాకాలలో సోదాలు అనంతరం పూతలపట్టు తహసీల్దారు కార్యాలయానికి ఆయనను తీసుకొచ్చి విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 7.30గంటల వరకు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, నెల్లూరుకు తరలించారు.

రికార్డులు తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు

మరిన్ని వార్తలు