ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలు అరెస్టు | Sakshi
Sakshi News home page

ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలు అరెస్టు

Published Mon, Sep 25 2017 8:38 AM

Two Suspected robbers arrested in ysr district

పొదిలి:
అంతర్‌ రాష్ట్ర దొంగలు ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ ఎస్‌.సుబ్బారావు ఆదివారం రాత్రి నిందితుల వివరాలు వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల రోటరీపురానికి చెందిన కొమ్ముద్ది ఖలందర్‌ అలియాస్‌ సలీమ్‌ అనే యువకుడు కడప, రాయచోటి, జమ్మలమడుగు తదితర పట్టణాల్లో గృహాల తలుపులు పగులగొట్టి దొంగతనాలు చేసేవాడు. కొన్ని రోజులు జైలులో ఉన్నాడు. తిరిగి విడుదలైన అనంతరం బెంగళూరులో గ్యాస్‌ సిలిండర్లు దొంగతనం చేసేవాడు. అక్కడ పోలీసులు పట్టుకోవడంతో కర్నాటక జైలులో ఉన్నాడు. విడుదలైన వచ్చిన తర్వాత అతనికి పులివెందుల మారుతీ బజార్‌కు చెందిన నాగూర్‌ సుభాన్‌వలి అలియాస్‌ వలి అనే దొంగతో పరిచయం ఏర్పడింది. వలి రాయచోటి, వేముల, పులివెందుల, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో గృహాల తలుపులు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవాడు. బైకు దొంగతనం కేసులో పులివెందుల జైలులో ఉన్నాడు. వీరిద్దరూ ఒక్కటై పెద్ద దొంగతనం చేసి జల్సాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కంభంలో పల్సర్‌ మోటారు సైకిల్‌ దొంగిలించి దానిపై పొదిలి వచ్చారు. లాక్‌ చేసి ఉన్న గృహాలపై కన్నేశారు. ఆగస్టు 12వ తేదీన విశ్వనాథపురం రెండో లైనులోని ఆదినారాయణ గృహంలో తలుపు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ వారికి ఏమీ దొరకలేదు.

అదే రోజు నిర్మలా కాన్వెంట్‌ రోడ్డులోని గుంటకల లక్ష్మణరావు ఇంట్లో దొంగతనం చేశారు. అక్కడ సుమారు లక్ష నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించారు. తిరిగి పులివెందుల వెళ్లారు. పొదిలిలో దొంగతనాలు చేస్తే దొరకమని భావించిన ఇద్దరూ సెప్టెంబర్‌ 10వ తేదీన పొదిలి వచ్చారు. వైన్‌ షాపును పగులగొట్టి టేబుల్‌లో ఉన్న రూ.7 వేల నగదు దొంగిలించారు. ఆదివారం పొదిలిలో సంచరిస్తున్నారనే సమాచారం అందడంతో కాపు కాసి పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.లక్ష నగదు, పల్సర్‌ మోటార్‌ సైకిల్, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ రాఘవ, శేషగిరి, శివ, హోంగార్డు కిరణ్‌లను ఎస్‌ఐ సుబ్బారావు అభినందించారు.

Advertisement
Advertisement