నరసాపురంలో బాపు స్మృతి చిహ్నం

15 Dec, 2014 00:28 IST|Sakshi
నరసాపురంలో బాపు స్మృతి చిహ్నం

బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) పేరు చెప్పగానే తెలుగు అక్షరం పులకిస్తుంది.. తెలుగు బొమ్మ  తల ఎగరేస్తుంది.. తెలుగు గీత సంతోషంతో ఉప్పొంగుతుంది.. గోదారమ్మ అలలు, అలలుగా ఎగసి పడుతుంది.. చిత్రకారుడిగా, రసరమ్య దృశ్య కావ్యాలను వెండి తెరపై తనదైన శైలిని ఆవిష్కరించిన దర్శకుడిగా, హాస్యర్షిగా ప్రపంచ గుర్తింపు పొందిన బాపు జ్ఞాపకం ఆయన పురిటిగడ్డ నరసాపురంలో ఇక పదిలమనే చెప్పవచ్చు. బాపు స్మృతి చిహ్నం ప్రపంచంలోనే మొదటిగా నరసాపురంలో గోదావరి చెంతన రూపుదిద్దుకుంది. తెలుగువాళ్ల గీతను మార్చిన నిశబ్ద గీతాకారుడి కీర్తిని భవిష్యత్ తరాలు స్మరించుకునేలా బాపు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన జయంతి సందర్భంగా సోమవారం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మహత్తర ఘట్టం కోసం ‘పశ్చిమ’ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
 
 నరసాపురంలో ప్రాథమిక విద్య
 బాపు 1933 డిశంబర్ 15న నరసాపురంలో ఆయన అమ్మమ్మ ఇంట్లో వెంకట వేణుగోపాలరావు, సూరమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలో కొద్దికాలం ఆయన ఇక్కడే పెరిగారు. తండ్రి మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1939-40లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బాపును మద్రాసు నుంచి నరసాపురం తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండేళ్లపాటు నరసాపురంలో టేలర్ హైస్కూల్‌లో బాపు ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం బాపు కుటుంబం మద్రాసు చేరుకుంది. అక్కడ న్యాయశాస్త్రం (లా) చదివిన బాపు కొద్దికాలం తండ్రితోపాటు న్యాయవాద వృత్తిని కొనసాగించారు.
 
 గోదావరి అంటే ప్రాణం
 గోదారమ్మ ఒడిలో పెరగడం వల్ల ఆయనకు గోదావరి యాస, భాష, హోయలు అంటే ఎంతో ఇష్టం. ఆయన చాలా చిత్రాలను గోదావరి కథాంశం, బ్రాక్‌డ్రాప్‌తోనే తెరకెక్కించారు.39 సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో 30 వరకు గోదావరి ప్రధానంశంగా సాగినవి కావడం విశేషం. గోదావరి అందాలను జగద్విదితం చేయడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా సోయగాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
 
 ప్రచారం ఇష్టముండదు
 బాపు పలుమార్లు జిల్లాకు, నరసాపురానికి వచ్చారు. ప్రచారంపై ఆసక్తి చూపని ఆయన ఎవర్నీ కలిసేవారు కాదని, సభలు, సమావేశాలు, సత్కారాలకు ఆహ్వానించినా ఆసక్తి చూపేవారు కాదని బాపు మేనల్లుడు, న్యాయవాది నిడమోలు రామచంద్రరావు అన్నారు. కొద్ది మంది మిత్రుల బాగోగులను ఆరా తీసేవారని చెప్పారు. ఇష్టమైన వృత్తిని, ప్రవృత్తిని ఎంచుకుని ముందుకు వెళ్లాలని బాపు సూచించేవారని అన్నారు. బాపు సినిమాల్లో కథానాయకులే ప్రధాన భూమికలు. మహిళా పక్షపాతిగా ముద్రపడిన బాపు విగ్రహాన్ని ఓ మహిళ తీర్చిదిద్దడం విశేషం. తాడేపల్లిగూడేనికి చెందిన ప్రముఖ శిల్పి దేవికారాణి వడయార్ బాపు కాంస్య విగ్రహాన్ని త యారుచేశారు.
 
 ఐదో పద్ముడు
 నరసాపురానికి చెందిన ప్రముఖుల్లో ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకున్న వ్యక్తుల్లో బాపు అయిదవవారు. ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు అయ్యగారి సాంబశివరావు (ఏఎస్ రావు) పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. మహిళా పునర్వివాహాలకోసం పాటుపడిన అద్దేపల్లి సర్విశెట్టి, ఎన్‌జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌గా పనిచేసిన డాక్టర్ ఎంఎన్ రావు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం పొందగా గతేడాది బాపును పద్మశ్రీ అవార్డు వరించింది.  
 
 అధికారికంగా వేడుకలు
 నరసాపురం లలితాంబ ఘాట్ వద్ద బాపు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. కెనడాలో ఉంటున్న  బాపు పెద్ద కుమారుడు వేణుగోపాల్, హైదరాబాద్‌లో ఉంటున్న చిన్నకుమారుడు ప్రత్యేక ఆహ్వానితులు కాగా.. ప్రభుత్వం నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. సినీ రంగ ప్రముఖులు రానున్నట్టు తెలిసింది. బాపు విగ్రహ ఏర్పాటుకు తానా విశేషంగా కృషిచేసింది. తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్, ప్రతినిధులు కోమటి జయరామ్, వేమన సతీష్ రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. మరో రూ.5 లక్షలను ఎంపీ తోట సీతారామలక్ష్మి నిధుల నుంచి మంజూరు చేశారు. బాపు జయంతి వేడుక, విగ్రహావిష్కరణ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక  శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉత్తర్వులు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.  
 
 ఇది అద్భుతం
 నరసాపురంలో బాపు విగ్రహం నెలకొల్పడం అద్భుతమైన విషయం. బాపు ప్రపంచస్థాయి మనిషి. ఆయన పుట్టినచోట, ఆయన నిత్యం ప్రేమించిన గోదావరి తీరంలో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయం. తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగు ప్రజల గుండెల్లో బాపు, ఆయన లిపి, బొమ్మలు పదిలంగా ఉంటాయి. ఏటా బాపు జయంతి వేడుకలను నిర్వహించాలి.
 - రెడ్డప్ప ధవేజీ
 
 ఆయన ప్రత్యేకత ఎవరికీ రాదు
 ప్రపంచంలో ఎందరో చిత్రకారులు ఉన్నారు. వారిలో బాపు ప్రత్యేకమైన వారు. తనపేరుపై ప్రత్యేక లిపిని సృష్టించిన గొప్ప మనిషి ఆయన. ఎందరో చిత్రకారులకు బాపు ఆదర్శనీయులు. ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయం. బాపు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారంగా నిర్వహించడం అభినందనీయం.
 - విజయ్‌కుమార్, ప్రపంచ తెలుగు చిత్రకారుల సంఘం ఉపాధ్యక్షుడు
 
 చిత్రసీమ పులకిస్తోంది
 బాపు పేరు చెప్పగానే తెలుగు చిత్రసీమ పులకిస్తోంది. ఆయన స్క్రిప్టు ఆయన బొమ్మలాగే ఉంటుందని చెబుతుంటారు. యువ దర్శకులు, మాలాంటి యువ కళాకారులకు ఆయన జీవితం ఓ పాఠ్య గ్రంథం. నరసాపురంలో గోదావరి తీరంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం విశేషం. అదీ మొదటిసారిగా బాపు విగ్రహం ఇక్కడ పెట్టడం మరీ విశేషం.
 - చేగొండి అనంత శ్రీరామ్, సినీ గేయ రచయిత
 
 గర్వం లేని మనిషి
 బాపు చాలాసార్లు ఇక్కడకు వచ్చారు. ఆయనలో ఎప్పుడూ గర్వాన్ని, దర్పాన్ని చూడలేదు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు. ఇక్కడే టేలర్ హైస్కూల్‌లో కొంతకాలం చదువుకున్నారు. బాపు బాల్య స్నేహితుల్లో చాలా మంది మరణించారు. కొద్దిమంది ఇప్పటికీ ఉన్నారు. నరసాపురంలో ఆయన విగ్రహం పెట్టడం అభినందనీయం.
 - నిడమోలు రామచంద్రరావు, బాపు మేనల్లుడు
 

మరిన్ని వార్తలు