అందనంత వేగం!

18 Aug, 2014 01:58 IST|Sakshi
అందనంత వేగం!

 తత్కాల్ రిజర్వేషన్ టిక్కెట్లు మరింత వేగంగా, ఎక్కువమందికి అందించాలన్న రైల్వే శాఖ ఆలోచన ఆచరణలో వికటిస్తోంది. ట్రావెల్ ఏజెన్సీలు, టిక్కెట్ల బ్రోకర్లకే ఇది ఉపయోగపడుతోంది. కౌంటర్లలో రాత్రి తెల్లవార్లూ నిరీక్షించే సామాన్య ప్రయాణికులకు మాత్రం ప్రయాసలే మిగులుతున్నాయి. ఒకరిద్దరికి మాత్రమే టిక్కెట్లు అందుతున్నాయి. మిగిలిన వారు ఉత్తి చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది.
 
 శ్రీకాకుళం, ఆమదాలవలస: రైల్వే రిజర్వేషన్ కౌంటర్లపై ఆధారపడే ప్రయాణికులకు తత్కాల్ టిక్కెట్లు దొరకడం దుర్లభమవుతోంది. ఇటీవల ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ వేగాన్ని పెంచిన తర్వాతే ఈ పరిస్థితి ఎదురవుతోందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. గతంలో రిజర్వేషన్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడిన వారిలో 10 మంది వరకు తత్కాల్ టిక్కెట్లు పొందగలిగేవారు. ఇప్పుడు ఇద్దరుముగ్గురికి  మించి పొందలేకపోతున్నారు. ఉదయం 10 గంటలకు తత్కాల్ వెబ్‌సైట్ తెరుచుకుంటుంది. ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ అయిపోతున్నాయి. గతంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వెబ్‌సైట్ వేగవంతంగా ఉండేది. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను కూడా అదే స్థాయికి పెంచడంతో కౌంటర్ల వద్ద క్యూలో నిరీక్షించే వినియోగదారులకు కష్టాలు ఎదురవుతున్నాయి.
 
 కౌంటర్‌లోని సిబ్బంది వినియోగదారులు రిజర్వేషన్ ఫారంలో పేర్కొన్న సమాచారాన్ని వెబ్‌సైట్‌లో నమోదు చేసి, వారి నుంచి డబ్బులు తీసుకొని, ప్రింటెడ్ టిక్కెట్ ఇచ్చేందుకు మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతోంది. తిరిగి చిల్లర ఇవ్వాల్సి వస్తే మరో నిమిషం పడుతుంది. ఐఆర్‌సీటీసీ వైబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు తీసుకునే విషయంలో ఇంత తతంగం ఉండదు. రైల్వే కౌంటర్‌లో ఒకటికి మించి కంప్యూటర్లను వినియోగించే అవకాశం లేకపోలేక పోగా ఐఆర్‌సీటీసీ ఏజెంట్లు పలు కంప్యూటర్లను ఏర్పాటు చేసుకొని ఏక కాలంలో ఎక్కువ టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. ఈ టికెటింగ్ విధానంలో అప్పటికప్పుడు టిక్కెట్ ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడం కూడా వీరికి అనుకూలంగా మారింది.
 
 గతంలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ స్పీడ్ తక్కువగా ఉండడం రైల్వే వెబ్‌సైట్ స్పీడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు రైల్వే కౌంటర్‌లోని సిబ్బంది ఒక వినియోగదారుని లావాదేవీలు పూర్తి చేసే సరికే దాదాపు టిక్కెట్లన్నీ అయిపోతున్నాయి. దీని వల్లఅర్ధరాత్రి నుంచి క్యూలో వేచి ఉన్న వినియోగదారులు టిక్కెట్లు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. సాంకేతిక అంశాలు తెలియని పలువురు వినియోగదారులు రైల్వే కౌంటర్లలోని సిబ్బంది వల్లే ఇలా జరుగుతోందన్న భావనతో వారితో వాదనకు దిగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
 
 ఇటువంటి పరిస్థితులను కొందరు ఐఆర్‌సీటీసీ ఏజెంట్లు తమకు అనుకూలంగా మలచుకొని తమ వద్దకు వచ్చే వినియోగదారుల వద్ద టిక్కెట్ ధర కంటే అదనంగా రూ. 400 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సినవారు గత్యంతరం లేక ఎక్కువ మొత్తాలు చెల్లించి టిక్కెట్లు తీసుకుంటున్నారు. రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్టు రైల్వే అధికారులు ప్రకటించక ముందే ప్రైవేటు ఏజెంట్లకు లాభం జరిగేలా నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
 
 సామాన్యులకు దొరకడంలేదు
 వేకువజామున మూడు గంటలకు వచ్చి క్యూలో నిల్చున్నా తత్కాల్ దొరకడం లేదు. సామాన్యులు కౌంటర్ వద్ద నిలబడడమే తప్ప టిక్కెట్ మాత్రం లభించడం లేదు. సిబ్బందిని అడిగితే తామేమీ చేయలేమని అంటున్నారు.          -వై.వెంకటేష్, ఆమదాలవలస
 
 తత్కాల్ అందడం గగనమే
 శనివారం రాత్రి జి.కె.వలస బస్సుకు వచ్చి తత్కాల్ కోసం క్యూలో నిల్చున్నాను. అయినా టిక్కెట్ దొరకలేదు. క్యూలో నిలబడిన ముగ్గురికి మాత్రమే టిక్కెట్లు దక్కాయి. ఏ ట్రైన్‌కు అడిగినా అయిపోయాయంటున్నారు.
 - నక్క రాము, జి.కె.వలస, ఆమదాలవలస మండలం
 

మరిన్ని వార్తలు