వివాదాలతో ఇరువురికీ నష్టం: బాబు | Sakshi
Sakshi News home page

వివాదాలతో ఇరువురికీ నష్టం: బాబు

Published Mon, Aug 18 2014 1:58 AM

వివాదాలతో ఇరువురికీ నష్టం: బాబు - Sakshi

 సాక్షి, హైదరాబాద్: వివాదాలు పడుతూ ఉంటే సమయం వృథా అని ఇరు రాష్ట్రాలూ నష్టపోతాయని, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావుతో భేటీలో స్పష్టం చేశానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదివారం రాజ్‌భవన్‌లో కేసీఆర్‌తో చర్చల అనంతరం.. చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన హేతుబద్ధత లేకుండా జరిగిందని, రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ఉంటే ఈ సమస్యలుండేవి కావని కేసీఆర్ కూడా అభిప్రాయపడ్డారన్నారు. ‘‘సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల విభజన అంశం చర్చించాం. సీఎస్‌లు దీన్ని పరిష్కరిస్తారు. సమస్యలేమైనా ఉంటే సీఎంలు ఇద్దరం మళ్లీ మాట్లాడతాం. కేంద్ర సర్వీసు అధికారుల విభజన ఈ నెల 22, 23 తేదీల నాటికి కొలిక్కి వస్తుంది’’ అని బాబు చెప్పారు. హైదరాబాద్ అంశం కేంద్రం సెక్షన్ 8లో పెట్టినా స్పష్టత ఇవ్వకపోవడం వల్ల సమస్యలు ఏర్పడుతోందన్నారు. ఇతర దేశాలనుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలంటే బందరు పోర్టు సేవలు అవసరమవుతాయని కేసీఆర్ ప్రస్తావించారన్నారు. ఏపీ రాజధాని గురించి కేసీఆర్ అడిగారని, తెలుగు వ్యక్తిగా, సీఎంగా, సమైక్య రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినందున అడగడంలో తప్పులేదన్నారు. ‘‘రాష్ట్రంలో ఏ స్కీము ఉంచాలో దేన్ని తీసేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం.  ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు సంబంధించి కొత్త పథకాన్ని పెడుతున్నామని కేసీఆర్ చెప్పారే తప్ప ఫలానా వారికి ఇవ్వబోమనడం లేదు. అక్కడ  పన్నులు చెల్లించే వారికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. స్థానికతకు 1956 కటాఫ్ అంటే అమలుకు వీలుకాదు. ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అది వారి సొంత ప్రాంతమని నిబంధనలు చెబుతున్నాయి’’ అని బాబు వ్యాఖ్యానించారు.

 సర్వేలో ఇబ్బందులుంటే.. అక్కడి టీడీపీ చూస్తుంది: రాజకీయ పార్టీగా సర్వేలోని మంచి చెడ్డలను బేరీజు వేసి ఇబ్బందులుంటే విభేదిస్తామని, తెలంగాణలోనూ టీడీపీ ఉంది కనుక అక్కడి పార్టీ నేతలు దాన్ని చూస్తారన్నారు. టీసీఎస్‌గా ఉన్న రాజీవ్‌శర్మ ఉత్తరాదికి చెందిన వారని, ఆయన లాటరీలో ఏపీకి వస్తే.. తెలంగాణకు ఇస్తామని ఎన్‌ఓసీ ఇవ్వండని కేసీఆర్ నవ్వుతూ అడిగారని బాబు చెప్పారు. ‘‘తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కావాలి కనుక ఏపీ సమావేశాలు ముందుగా ముగించాలని కేసీఆర్ అడిగారు. సమావేశంలోనే ఏపీ స్పీకర్ కూడా ఉన్నందున ఆ మేరకు నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తామన్నారు’’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement