ఆశ చూపారు..అంతా మాయ చేశారు..

18 Oct, 2019 11:32 IST|Sakshi
ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మోసపోయిన ఎస్సీలు 

రుణాల మంజూరులో నాటి పాలకుల నిర్లక్ష్యం 

1783మందికి ఇస్తామని నమ్మించి... 408 మందికే ఇచ్చిన వైనం 

దరఖాస్తుకోసం చేసిన ఖర్చు వృథా అయిందని ఆవేదన 

‘ఇస్తామంటే ఆశ... కొడతామంటే భయం...’ ఇది మానవ సహజం. ఇక్కడ ఇస్తామని ఆశ పెట్టిన గత ప్రభుత్వం లేనిపోని కారణాలతో అందనీయకుండా మాయ చేసింది. ఏదో వస్తుందన్న ఆశతో దరఖాస్తులు... ఇతర ధ్రువపత్రాలకోసం వేలాదిరూపాయలు ఖర్చుచేసిన లబ్ధిదారులు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. 

విజయనగరం పూల్‌బాగ్‌: గత ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ. 26.96కోట్లతో 1783 యూనిట్లు రుణాలుగా అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ అందులో 883 మందికి సబ్సిడీ రిలీజ్‌ కాగా, 408 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్‌ పూర్తి చేసింది. మిగిలినవారికి రిక్తహస్తంచూపింది.2018–19 సంవత్సరం లో 8745 మంది ఎస్సీ లబ్ధిదారులు ఎంతో ప్రయాసలకోర్చి మీసేవ, ఈ –సేవా నెట్‌ సెంటర్లలో రుణాల కోసం ధ్రువపత్రాలు ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. ఇందుకోసం తలకుమించి ఖర్చుచేశారు. చెప్పులు అరిగేలా అనేకసార్లు వివిధ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగారు. సరిగ్గా రుణాలు మంజూరు చేసేసమయానికి ఎన్నికల కోడ్‌ పేరుతో అప్పటి ప్రభుత్వం రుణాల మంజూరు నిలిపివేసింది. ఇక ఏం చేయాలో తెలీక దరఖాస్తులుదారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు.

8745 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1783 యూనిట్లు మంజూరయినట్టు చెప్పి... కేవలం 883 మందికే సబ్సిడీ రిలీజ్‌ చేశారు. తీరా రూ.13.62కోట్లతో 408 యూనిట్లు గ్రౌండింగ్‌ చేశా రు. మిగిలినవారి పరిస్థితి అగమ్యగోచరం చేశారు. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటయ్యాక... నాడు దరఖాస్తు చేసుకున్నవారి పరిస్థితిని గుర్తించి మళ్లీ ఈ ఏడాది దరఖాస్తు చేసుకోనక్కర లేకుండా తాజా సంవత్సరానికి వాటిని బదలాయించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి 1355 యూ నిట్లు మంజూరుకాగా వాటి కోసం రూ.23.25 కోట్లు మంజూరయ్యాయి.వాటి కో సం 8151 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా రుణా ల కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. 

పాతవారికి మరో ఛాన్స్‌..
2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి రు ణాలకోసం దరఖాస్తు చేసు కుని రుణాలు మంజూరు కాని 900 దరఖాస్తులను ఈ ఏడాదికి బదలాయించాం. వారు తిరిగి దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 
– సాధు జగన్నాథం, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, విజయనగరం

మరిన్ని వార్తలు