పేదలే సమిధలుగా అగ్లీ స్కాం

14 Mar, 2019 09:43 IST|Sakshi

అగ్రిగోల్డ్‌ను బంగారు బాతుగా మలచుకున్న ప్రభుత్వ పెద్దలు

అది 32.02 లక్షల మంది
ఆత్మఘోష.. 8 లక్షల మంది 
ఏజెంట్ల మనోవేదన..

ఏడు రాష్ట్రాలను కుదిపేస్తున్న కుంభకోణం.. అధిక వడ్డీకి ఆశపడిన చిరుజీవుల నుంచి డిపాజిట్లు సేకరించి నిండా ముంచేశారు.. వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఆ డబ్బుతో ఆస్తులు కొన్నారు.  ఆ ఆస్తులను అమ్మి బాధితులను కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన ప్రభుత్వ పెద్దలు వాటిని అక్రమంగా దక్కించుకునే ఎత్తులు వేశారు. ఐదేళ్ల నుంచినిరవధికంగా పోరాడుతున్న అగ్రిగోల్డ్‌ బాధితుల గోడు వినేదెవరు? 10 వేల కోట్ల రూపాయల అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల సమాహారమిది.  

అగ్రిగోల్డ్‌ కుంభకోణమిది..
దేశంలో ఏడు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది చిరుద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలు కష్టపడి పైసాపైసా కూడబెట్టిన సొమ్మును అగ్రిగోల్డ్‌ సంస్థలో మదుపు చేశారు. 1995 నుంచి డిపాజిట్‌ చేసిన డిపాజిటర్లకు సొమ్ము చెల్లించకుండా 2014లో సంస్థ చేతులెత్తేసింది. దీంతో రూ.7,623 కోట్లు డిపాజిట్‌ చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్, అండమాన్‌–నికోబార్‌ దీవులకు చెందిన 32,02,632 ఖాతాదారులు, మరో 8 లక్షల మంది ఏజెంట్లు రోడ్డున పడ్డారు. మొత్తం ఖాతాదారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 19,43,497 మంది ఉన్నారు. వీరు మొత్తం రూ.3,965 కోట్లు డిపాజిట్‌ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాగానే అగ్రిగోల్డ్‌ యాజమాన్యం డిపాజిటర్లకు సొమ్ము చెల్లించకుండా చేతులెత్తేయడంతో బాధితులు పోలీస్‌స్టేషన్ల గడప తొక్కారు. అగ్రిగోల్డ్‌ మోసాలపై దేశంలో 29 కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్‌లో 15 కేసులు, తెలంగాణలో మూడు, కర్ణాటకలో 9, అండమాన్‌–నికోబార్, ఒడిశాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ కేసు సీబీఐకి వెళితే తాము అనుకున్నట్టు జరగదనే ఎత్తుగడతో చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా సీఐడీకి కేసును అప్పగించింది. ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో అగ్రిగోల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అవ్వా వెంకటరామారావుతోపాటు పలువురు డైరెక్టర్లను కంటితుడుపు చర్యగా అరెస్టు చేయించింది. అతి విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులపై ప్రభుత్వ పెద్దలు కన్నేయడంతో సీఐడీ దర్యాప్తు సైతం సక్రమంగా జరగలేదనే విమర్శలున్నాయి. సీఐడీ దర్యాçప్తు చేస్తున్న తీరును అనేకమార్లు హైకోర్టు కూడా తప్పుపట్టింది.  

మొత్తం కుంభకోణం- 10,000 కోట్లు (దాదాపు)
7 రాష్ట్రాల్లోని బాధితులు- 32.02 లక్షలు
ఏపీలో బాధితులు- 19.43లక్షలు
దేశవ్యాప్తంగా నమోదైన కేసులు- 29
ఆత్మహత్యలు- 280
ఏపీలో కేసులు- 15

అగ్రిగోల్డ్‌ ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు 
ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులను కూడబెట్టుకోవడానికి మళ్లించింది. డిపాజిటర్లను మోసం చేసి అగ్రిగోల్డ్‌ సంస్థ దోషిగా నిలబడిన దశలో బాధితులకు న్యాయం చేయకుండా అగ్రిగోల్డ్‌కు చెందిన ఆస్తులను కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలే గద్దల్లా వ్యవహరించారనే విమర్శలున్నాయి. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాలతో అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసింది.. ఎన్నో ఆస్తులను కూడబెట్టింది. రియల్‌ ఎస్టేట్, అగ్రిఫామ్స్, హాయ్‌ల్యాండ్, బయోప్రొడక్ట్‌ ప్రాజెక్టులు, అగ్రి మిల్క్‌ తదితర 156 అనుబంధ సంస్థలకు ప్రజల డిపాజిట్లను మళ్లించింది. అంతటితో ఆగకుండా బంగారం, వెండి, వాహనాలు, భవనాలు వంటి స్థిర, చరాస్తులను పెద్ద ఎత్తున కూడబెట్టింది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్‌ ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలే వాటిని గద్దల్లా తన్నుకుపోవడానికి ప్రయత్నించారు. వాస్తవానికి.. ఇటువంటి భారీ కుంభకోణంలో ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లను అందరినీ అరెస్టు చేయాల్సి ఉంది. అంతేకాకుండా ఆ కంపెనీకి, దాని యాజమాన్యానికి ఉన్న ఆస్తులు అమ్మి వచ్చిన మొత్తాన్ని డిపాజిటర్లకు చెల్లించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే.. ఈ కుంభకోణం బయటకు రాకముందే అగ్రిగోల్డ్‌ ఆస్తులను యాజమాన్యం అమ్మేసుకుంది. ఉన్న డబ్బును తమ సొంత అకౌంట్లకు మళ్లించుకుంది. ఇదంతా ప్రభుత్వ సహాయ, సహకారాలతోనే చేసిందనే విమర్శలున్నాయి. అందుకు ప్రతిఫలంగా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను నామమాత్రపు ధరలకే ప్రభుత్వ పెద్దలకు అమ్మేసింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌లో ఆలస్యం, నిందితులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడాన్ని బట్టి వీరి బంధం ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు.  

ప్రభుత్వ పెద్దలు, యాజమాన్యానిది బలమైన బంధం 
అగ్రిగోల్డ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ డొప్పా రామ్‌మోహన్‌రావు 2016, ఏప్రిల్‌ 30న టీడీపీలో చేరారు. చంద్రబాబుకు, అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి ఇదొక నిదర్శనం. అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్‌ను గతంలో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మాగంటి మురళీమోహన్‌లు కారుచౌకగా దక్కించుకునే ప్రయత్నాలు చేశారనే విమర్శలున్నాయి. అప్పట్లో హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి వీరు బేరమాడినట్టు కథనాలు కూడా రావడం గమనార్హం. వాస్తవానికి 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్‌ భవనాలు, సామాగ్రి దాదాపు 25 ఎకరాల్లో ఉన్నాయి. ఆ భూములు, భవనాలు, సామాగ్రి లెక్కగట్టినా మార్కెట్‌ విలువ భారీగానే ఉంటుందని, కానీ కారుచౌకగా దక్కించుకునే ప్రయత్నాలు జరిగాయనే విమర్శలున్నాయి. కాగా.. అగ్రిగోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ జీవో రాక ముందే అంటే.. 2015 జనవరి 19న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ కంపెనీ అయిన రామ్‌ ఆవాస్‌ రిసార్ట్స్‌ హోటల్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ దినకర్‌ నుంచి 14 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మంత్రి భూములు కొనుగోలు చేశాక 2015, ఫిబ్రవరి 20న అగ్రిగోల్డ్‌ ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇవ్వడం గమనార్హం. డిపాజిటర్లు చెల్లించిన మొత్తానికి వడ్డీ కలుపుకుంటే రూ.10 వేల కోట్ల కుంభకోణమైన అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తుల వాస్తవ విలువలో పరస్పర విరుద్ధ అంచనాలు ఉన్నాయి. దాదాపు 23 వేల ఎకరాలతోపాటు అనేక భవనాలు, ఇతర ఆస్తుల విలువ రూ.3,940 కోట్లు అని గతంలో ప్రకటించిన సీఐడీ తాజాగా రూ.3,861 కోట్ల 76 లక్షలని ప్రకటించడం గమనార్హం. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రూ.2,200 కోట్లు ఉంటుందని ఎస్సెల్‌ గ్రూప్‌ సంస్థ పేర్కొంటే, వాటి విలువ రూ.2,500 కోట్లు ఉంటుందంటూ ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు చెప్పారు. వాస్తవానికి రూ.10 వేల కోట్ల స్కామ్‌కు సంబంధించిన అగ్రిగోల్డ్‌ ఆస్తులను బహిరంగ మార్కెట్‌లో ఖచ్చితంగా అమ్మగలిగితే రూ.35 వేల కోట్లు విలువ చేస్తాయని అంచనా.  

బాధితుల వెతలెన్నో.. 
అగ్రిగోల్డ్‌ సంస్థ బోర్డు తిప్పేయడంతో న్యాయం కోసం బాధితులు ఏళ్ల తరబడి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 2015 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బాధితులు చేపట్టిన ఉద్యమాలకు లెక్కేలేదు. బాధితులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ, సీపీఎం, బీజేపీలు అండగా నిలిచాయి. బాధితులకు డిపాజిట్లు చెల్లించకపోగా చనిపోతే పరిహారం అందించి సరిపెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పటివరకు దాదాపు 280 మందికి పైగా బాధితులు మరణించగా వారిలో 143 మందికి మాత్రమే రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చి సరిపెట్టారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులు చెల్లిస్తామని రెండేళ్ల క్రితం చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఆ దిశగా పూర్తి చర్యలు చేపట్టలేదు. రెండు నెలల క్రితం రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. అయితే ఆ మొత్తం ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం. మరోవైపు ప్రతి జిల్లాలోనూ ఉన్న వేలాది మంది డిపాజిటర్లు బాండ్ల పరిశీలనకు దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లడానికి తీవ్ర వ్యయప్రయాసలు పడుతున్నారు. గత నెల 19న ప్రారంభించిన బాండ్ల పరిశీలన ఈ నెల 11 వరకు కొనసాగుతుంది. అయితే బాండ్ల పరిశీలన నత్తనడకన సాగుతుండటంతో ఈ నెల 20 వరకు పొడిగించాలని బాధితులు కోరుతున్నారు. కాగా, బాండ్ల పరిశీలనలో.. రోజువారీగా కట్టిన బాండ్లు, నెలవారీగా కట్టిన బాండ్లకు సంబంధించిన నగదు రసీదులు, కంపెనీ ఇచ్చిన రూ.పదివేల లోపు చెక్కులు తీసుకోవడం లేదు. కంపెనీ ఇచ్చిన సెటిల్మెంట్‌ (పే ఆర్డర్‌ రిసీప్ట్‌)ను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఒకేసారి రూ.10 వేల మొత్తాన్ని చెల్లించినవారి బాండ్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంతో వారికే ఇస్తారేమోనన్న అనుమానాన్ని డిపాజిటర్లు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రూ.10 వేల డిపాజిటర్లకు చెల్లింపు మొత్తాల్లో కోతపెట్టడమే ప్రభుత్వం ఎత్తుగడగా ఉంది. రూ.10 వేలు చెల్లించిన వారు దాదాపు ఎనిమిది లక్షల మంది ఉంటారని చెబుతున్నారు. వారికి ఖచ్చితంగా చెల్లిస్తే కనీసం రూ.363 కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం ప్రకటించిన రూ.250 కోట్లు ఎంతమందికి ఇస్తారన్నది అనుమానమే. 

బాధితుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం
లక్షలాది మంది అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోరాటం చేస్తోంది. ప్రత్యేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ ఏర్పాటు చేసి లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో ఉద్యమాన్ని నడుపుతోంది. డిపాజిట్లు తిరిగి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం తక్షణం రూ.20 వేల లోపు ఉన్న డిపాజిట్లు చెలించి, మిగిలినవారికి కాల పరిమితితో కూడిన బాండ్లు ఇవ్వాలని బాధితుల భరోసా కమిటీ డిమాండ్‌ చేస్తోంది. మానసిక వేదనతో మృతి చెందిన బాధితులు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం అందించాలని కోరుతోంది.  

కనికరం లేని సర్కార్‌
ఎండనకా వాననక నెట్టుడు బండిపై అరటి పళ్లు అమ్ముకోగా వచ్చిన డబ్బు రూ.80 వేలను అగ్రిగోల్డ్‌లో దాచుకున్నాను. వృద్ధాప్యంలో ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఆశించా. ఇప్పుడా డబ్బులు రావని చెబుతున్నారు. మాలాంటి పేదలపై ఈ ప్రభుత్వానికి కనికరం కూడా లేదు. మా డబ్బు వెనక్కి ఇప్పించేలా ఇకనైనా చర్యలు తీసుకోవాలి. –మాకం గాలెమ్మ, యర్రగొండపాలెం, ప్రకాశం 

న్యాయం జరగడం లేదు
ఎంతో కష్టపడి తమలపాకులు పండించి వచ్చిన పైసా పైసా కూడబెట్టి అగ్రిగోల్డ్‌లో దాచుకున్నాం. డబ్బు చేతికొస్తుందనుకున్న సమయంలో సంస్థ మూతబడింది. టీడీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. అప్పటి నుంచి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదు.  – పాచిపెంట నీలకంఠం, విజయనగరం 

అప్పులు చేసి డబ్బులు కట్టా 
ప్రతి నెలా రూ.1,500 కట్టాను. సమయానికి డబ్బులు లేకపోయినా అప్పుచేసి కట్టాను. ఆ విధంగా రూ. 50 వేలు కట్టా. దీంతో నేను అప్పులు పాలయ్యాను. ఈ విధంగా అగ్రిగోల్డ్‌ మోసం చేస్తుందని అనుకోలేదు. ప్రభుత్వం స్పందించి నాకు డబ్బులు చెల్లించే విధంగా చూడాలి.     – చెవుల మస్తాన్, అగ్రిగోల్డ్‌ బాధితుడు, రాజుపాలెం

అగ్రిగోల్డ్‌ మోసానికి డిపాజిటర్ల మృతి 
అగ్రిగోల్డ్‌ మోసాలకు ఎంతో మంది డిపాజిటర్లు మృతి చెందారు. నేను పిడుగురాళ్ల ఆఫీసులో 15 ఏళ్లు ఏజెంట్‌గా పనిచేసి రూ.20 లక్షలు డైలీ, ఆర్డీలు, డిపాజిట్‌లు కట్టించాను. అగ్రిగోల్డ్‌ వల్ల నష్టపోయిన లబ్ధిదారులకు నా సొంత డబ్బులు రూ.5 లక్షలు చెల్లించాను. దీంతో నా కుటుంబం రోడ్డున పడింది. ఇంకా కొంత మంది ఇస్తావా...చస్తావా.... అని నా వెంట పడుతున్నారు. ప్రభుత్వం కూడా మోసం చేసిన వారికే వంత పాడుతుంది. –జంగం రవీంద్ర, అగ్రిగోల్డ్‌ ఏజెంట్, రాజుపాలెం

రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటుతున్న అగ్రిగోల్డ్‌ బాధితుల ఆక్రందనలు వినిపించడం లేదా? ఇది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురవుతున్న ప్రశ్న. అధికారం చేపట్టిన తొలినాళ్లలో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు ఈ ఐదేళ్లు నాన్చుడు ధోరణి అవలంబించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయమాటలతో మరోసారి అగ్రిగోల్డ్‌ బాధితులను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ఏళ్లు గడుస్తున్నా బాధితులను ఆదుకునే దిశగా ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయలేదనే విమర్శలు ఇప్పటికే మిన్నంటాయి.  – ఐ. ఉమామహేశ్వరరావు ,సాక్షి, అమరావతి 

మరిన్ని వార్తలు