అస్మదీయులకు అప్పుల విందు!     

11 May, 2019 03:59 IST|Sakshi

పోలింగ్‌కు రెండు రోజుల ముందే రూ.5,000 కోట్లు అప్పు చేసిన సర్కారు

ఏప్రిల్‌–జూలై వరకు ఓపెన్‌ మార్కెట్‌లో రూ.8,000 కోట్ల అప్పులకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి

ఈ నెలలో ఇప్పటికే రూ.1,000 కోట్లు అప్పు తీసుకున్న వైనం

మళ్లీ రూ.1,000 కోట్లు అప్పు కావాలంటూ ఆర్బీఐకి తాజాగా లేఖ

దీంతో ఈ ఆర్థిక ఏడాది ప్రారంభమైన రెండు నెలల్లోనే రూ.7,000 కోట్లకు చేరిన అప్పులు

అధికారం చివరి రోజుల్లో గరిష్ట స్థాయిలో అప్పులకు సిద్ధమైన టీడీపీ సర్కారు

14న కేబినెట్‌ భేటీ ముసుగులో ఇతర బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం

కొత్త ప్రభుత్వానికి అప్పులు పుట్టకుండా చంద్రబాబు చర్యలు

ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఆర్థికశాఖ కార్యదర్శులు

సాక్షి, అమరావతి: అధికారం అంతిమ ఘడియల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అస్తవ్యస్తంగా మార్చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనుండటం, టీడీపీ అధికారం కోల్పోవటం ఖాయమనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు అస్మదీయుల బిల్లులు చెల్లించాలంటూ ఆర్థికశాఖ కార్యదర్శులు పీయూష్‌కుమార్, సత్యనారాయణలపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. చంద్రబాబు చెప్పుచేతల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులిద్దరూ సీఎం చెబితే చేయాల్సిన అవసరం ఉంటుంది కదా అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.  

పోలింగ్‌కు ముందు రూ.5 వేల కోట్ల అప్పు
గత ఐదేళ్ల పాటు బడ్జెట్‌ లోపల, బయట ఇష్టానుసారంగా పరిమితికి మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని రుణాల ఊబిలోకి నెట్టేసిన సీఎం చంద్రబాబు ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే గరిష్ట స్థాయిలో అప్పులు చేసి తదుపరి ఏర్పాటయ్యే ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు లేకుండా చేయడంతోపాటు అధికారం చివరి రోజుల్లో కావాల్సిన వారికి బిల్లులు చెల్లించేందుకు బరి తెగిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి మేరకు ఓపెన్‌ మార్కెట్లో రూ.32 వేల కోట్లు అప్పు చేసేందుకు అనుమతించాలని టీడీపీ సర్కారు కేంద్ర ఆర్థికశాఖను కోరింది. అయితే తొలి నాలుగు నెలలకు అంటే ఏప్రిల్‌ – జూలై వరకు రూ.8,000 కోట్లు ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా అప్పు చేసేందుకు కేంద్రం అనుమతించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు ఏప్రిల్‌ 9వ తేదీన ఆర్థిక శాఖ అధికారులు ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ.5,000 కోట్లు అప్పు చేశారు. అప్పు తీసుకున్న డబ్బులను ‘నీరు–చెట్టు’ పనుల కింద టీడీపీ నేతలతోపాటు అస్మదీయ సంస్థలకు ప్రభుత్వం చెల్లించింది. 

మళ్లీ రూ.1,000 కోట్లు కావాలంటూ ఆర్బీఐకి లేఖ
ఏప్రిల్‌ నెలలోనే మరో వెయ్యి కోట్లరూపాయలు అప్పు చేసేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆర్బీఐని కోరింది. అయితే ఇప్పటికే రూ.5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నందున వెంటనే రుణానికి ఆర్బీఐ నిరాకరించింది. వారానికి రూ.500 కోట్ల చొప్పున ఓపెన్‌ మార్కెట్‌లో నెలలో రూ.2 వేల కోట్ల రుణానికి మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 2, 7వ తేదీల్లో రూ.500 కోట్ల చొప్పున ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా ఆర్థిక శాఖ అప్పు చేసింది. దీంతో కేంద్రం అనుమతించిన రూ.8,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.6,000 కోట్ల అప్పు చేసినట్లైంది. ఇక కేవలం రూ.2,000 కోట్ల మేరకే అప్పులు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తేదీ సమీపిస్తుండటం, టీడీపీ ఓటమి ఖాయమనే నిర్ణయానికి వచ్చిన సీఎం చంద్రబాబు గరిష్ట స్థాయిలో అప్పులు తీసుకునే లక్ష్యంతో ఆ రూ.2,000 కోట్లను కూడా సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 14వ తేదీన మరో రూ.1,000 కోట్లు ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా అప్పు చేసేందుకు అనుమతించాలంటూ ఆర్థిక శాఖ కార్యదర్శులు శుక్రవారం హడావుడిగా  ఆర్బీఐకి లేఖ రాశారు. వారానికి రూ.500 కోట్ల చొప్పున మాత్రమే అనుమతిస్తామని చెప్పినప్పటికీ రూ.1,000 కోట్లు కావాలంటూ ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆర్బీఐకి లేఖ రాయడం గమనార్హం.

సీఎం చెప్పారంటూ చెల్లించేందుకు సన్నాహాలు
కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 14వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు అనుమతిస్తే ఈ భేటీలో అంతర్లీనంగా మరిన్ని అంశాలను చేర్చి టీడీపీ నేతలు, కోటరీ కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే క్యాబినెట్‌ భేటీ జరిగే మంగళవారం నాటికి రూ.2 వేల కోట్లను సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈసీ ఆమోదంతో కేబినెట్‌ సమావేశం జరిగితే సీఎం ఆదేశించారంటూ ఆయన చెప్పిన బిల్లులను చెల్లించేందుకు ఆర్థికశాఖ కార్యదర్శులు రంగం సిద్ధం చేశారు.
 
అప్పులు చేసి టీడీపీ నేతల జేబులు నింపేందుకు సిద్ధం

అధికారం చివరి రోజుల్లో అప్పుల ద్వారా సేకరించిన నిధులను వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు, కోటరీ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు వినియోగించనున్నారు. మరికొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి అప్పులు పుట్టకుండా చేయడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖజానాను కొల్లగొట్టిన డబ్బులతో జేబులు నింపి కమీషన్లు వసూలు చేసుకోవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాను పిలిస్తే అధికారులు ఎందుకు రారో చూస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారని సచివాలయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరిన్ని వార్తలు