అడిగితే.. అలకేంటి రాజా?

2 Apr, 2019 10:36 IST|Sakshi
హుస్సేన్‌పురంలో హౌసింగ్‌ లోన్‌ రాక అసంపూర్తిగా ఉన్న ఇంటితో బాధితురాలు (అంతర చిత్రం) హుస్సేన్‌ పురంలో చినరాజప్పను నిలదీస్తున్న స్థానికులు

సాక్షి, సామర్లకోట(పెద్దాపురం): ఆ గ్రామంలో టీడీపీ నాయకుల అక్రమాలు పెరిగాయి.హౌసింగ్‌ రుణాల పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సొమ్ములు ముట్టజెప్పిన వారికే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అభివృద్ధి పనుల్లోనూ ‘పచ్చ’పాత వైఖరి అవలంబిస్తున్నారు. వీటన్నింటిని సహిస్తూ.. భరిస్తూ ఉన్నారు నిజమైన లబ్ధిదారులు. వీటిపై కొందరు తెగించి స్థానిక టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే.. వారిపై కేసులు బనాయించడం అక్కడ అలవాటుగా మారింది. అయితే ప్రస్తుత ఎన్నికల వేళ.. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, ఏపీ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప ఆ గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. ఇన్నాళ్లూ తాము పడిన ఇబ్బందిని ఆగ్రామ జనం ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో జరుగుతోన్న అన్యాయాలు, అక్రమాలపై ఆయనను ప్రశ్నించారు. దీంతో అవాక్కయిన రాజప్ప స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. దీంతో గ్రామస్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. చినరాజప్పకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని హుస్సేన్‌పురం గ్రామంలో చోటుచేసుకుంది. 

మండల పరిధిలో హుస్సేన్‌పురం గ్రామానికి టీడీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన మహిళలు, యువకులు డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ను అడ్డగించారు. దీంతో డిప్యూటీ సీఎంను అడ్డగించిన వారిని వేధించే అవకాశం ఉండడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆందోళన కారులకు అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ సమస్యలపై సమాధానం ఇచ్చి ముందుకు వెళ్లాలని డిమాండ్‌ చేసినా ఉపముఖ్యమంత్రి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ‘‘సమస్యలు ఉంటే క్యాంప్‌ కార్యాలయానికి వచ్చి చర్చించాలని, ఎన్నికల పర్యటనలో ఉన్నాను’’ అని తన వాహనాన్ని ముందుకు తీసుకుపోవడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తు న్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే సమస్యలు పరిష్కారం కాక పోతే తరువాత ఎవరేం చేస్తారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సమస్యలు చెప్పుకోనివ్వరా..
గ్రామ టీడీపీ నాయకులు హౌసింగ్‌ లోన్లు ఇప్పిస్తామని చెప్పి మొండి చేయి చూపారని, ఈ సమస్య చెప్పుకోవడానికి కూడా రాజప్ప అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హౌసింగ్‌ లోన్‌ వస్తుందనే ఆశతో గ్రామంలోని అనేక మంది ఉన్న గుడిసెను తొలగించుకున్నామని, ఎండకు, వానకు ఉండలేక అప్పులు చేసుకొని ఇంటి నిర్మాణాలు చేసుకున్నామని, అయితే ఎన్నికలు సమీపించినా హౌసింగ్‌ రుణాలు రాకపోవడంతో ఈ విషయాన్ని మంత్రి రాజప్పకు చెప్పుకోవడానికి వస్తే అవకాశం ఇవ్వలేదని లబ్ధిదారులు వాపోతున్నారు.

మంజూరైన హౌసింగ్‌లోన్లు వారికి కావలసిన వారికే జన్మభూమి కమిటీ సభ్యులు అప్పగించారని ఆరోపించారు. అదే విధంగా పింఛన్లు కూడా తమకు నచ్చిన వారికే ఇచ్చారని, అర్హత ఉన్నా ఎంపిక చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో వారికి నచ్చిన ప్రాంతాల్లోనే రోడ్లు, డ్రైన్లు నిర్మించారని, ముంపునకు గురవుతున్న ప్రాంతాలను విస్మరించారనే వాదనలు ఉన్నాయి. పరిశ్రమల కాలుష్యం మధ్య అనారోగ్యానికి గురవుతూ జీవనం గడుపుతున్నా పట్టించుకునే వారు కరువైపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కమిటీ నాయకులు టీడీపీ పాలనలో రూ.కోట్లు సంపాదించుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలోని సమస్యలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాట్సాప్‌లో పెడితే అమాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.  

ఆ అప్పు తీర్చలేని పరిస్థితి
ఇంటి రుణం వస్తుందని ఆశ చూపి రూ.రెండు వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పు చేసి రూ.రెండు వేలు టీడీపీ నాయకులకు ఇచ్చా ను. అయితే హౌసింగ్‌ లోన్‌ రాలేదు. అప్పు చేసి ఇచ్చిన రూ.రెండు వేలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పు చేసి నిర్మాణం చేసిన ఇళ్లు అసంపూర్తిగా ఉంది.
– కోట ఏగులమ్మ, బాధితురాలు, హుస్సేన్‌పురం


మండల స్థాయి నాయకుల దృష్టికి తీసుకు వెళ్లినా స్పందన లేదు 
గ్రామంలో హౌసింగ్‌లోను కావాలంటే రూ.రెండు వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. పేద వారు ఏవిధంగా ఇస్తారని, ఎంపీపీతో టీడీపీకి చెందిన ఇతర మండల స్థాయి అధికారుల దృష్టికి  సమస్యను తీసుకు వెళ్లినా వారు స్పందించలేదు.
– మార్ని చక్రం, మాజీ సర్పంచ్, హుస్సేన్‌పురం


 

>
మరిన్ని వార్తలు