మంత్రులు + ఇష్టులు

2 Sep, 2014 01:53 IST|Sakshi

మంత్రులు కాని వారికీ మంత్రివర్గ భేటీకి అనుమతి
 కేబినెట్ పవిత్రత, నిబంధనలకు ఏపీ ప్రభుత్వం తూట్లు
 సోమవారం భేటీలో సీఎం ఓఎస్‌డీ అభీష్ట, సలహాదారు పరకాల
  గత కేబినెట్ భేటీల్లో పాల్గొన్న  సుజనా చౌదరి, సీఎం రమేశ్
 
 సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గం పవిత్రతకు, నిబంధనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మంత్రులు కాని వారిని కూడా కేబినెట్ సమావేశంలో కూర్చోవడానికి అనుమతిస్తోంది. నిబంధనల ప్రకారం కేబినెట్ సమావేశంలో మంత్రులు మాత్రమే పాల్గొనాలి. ఏదైనా శాఖకు సంబంధించిన చర్చలో అవసరమనుకొంటే ఆ శాఖ ఉన్నతాధికారులను అనుమతిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రమే మంత్రివర్గ సమావేశంలో అజెండా పూర్తయ్యేవరకు ఉంటారు. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రులు కాని వారిని కూడా మంత్రివర్గ సమావేశానికి అనుమతిస్తున్నారు. గతంలో ఎంపీలు సుజనా చౌదరి, సి.ఎం.రమేశ్, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కేబినెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. తాజాగా సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఓఎస్‌డీ అభీష్ట, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు. వారు సమావేశంలో కూర్చోవడమేకాకుండా మరో అడుగు ముందుకేసి కేబినెట్ చర్చల్లో కూడా పాలుపంచుకున్నారు. సీనియర్ మంత్రు లు, ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

 

ఎంపీలు, సలహాదారు మంత్రివర్గ సమావేశంలో కూర్చోవడమే కాకుండా చర్చల మధ్య జోక్యం చేసుకుంటూ మాట్లాడటంపై సీనియర్ మం త్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఇందుకు అవకాశం కల్పించడంతో మంత్రులు కూడా ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు. మంత్రులు కాని వారిని సమావేశంలో కూర్చోపెట్టాక అది మం త్రివర్గ సమావేశం ఎలా అవుతుందో అర్థంకావడంలేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు