రాజ్‌భవన్‌కు పదే పదే! అలా ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..

10 Nov, 2023 17:28 IST|Sakshi

ఒకప్పుడు గవర్నర్ వ్యవస్థను తప్పుబట్టి.. ఆ వ్యవస్థనే ఎత్తివేయాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ..  ఇప్పుడు పదే,పదే గవర్నర్‌ను ఆశ్రయిస్తూ ఏవేవో ఫిర్యాదులు చేస్తోంది. వ్యవస్థ ఉంది కనుక గవర్నర్ వద్దకు వెళ్లడం తప్పుకాదు. కాని.. ఓటుకు నోటు కేసు సమయంలో గవర్నర్‌ను టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు వంటివారు ఎలా నిందించారో గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు వారు చేస్తున్న విన్యాసాలు గమనించేవారికి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పడమే ఉద్దేశం. 

కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ బృందం మరోసారి గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు  చేసింది. ఎప్పుడు వీలైతే అప్పుడల్లా.. ప్రతీ చిన్నదానికి కూడా టీడీపీ బృందాలు గవర్నర్ వద్దకు వెళ్లడం పనిగా పెట్టుకున్నాయి. చివరికి కోర్టులలో ఉన్న విషయాలకు కూడా ప్రభుత్వానికే ఆపాదిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నిందిస్తూ..  పేజీలకొద్ది రాసేస్తూ గవర్నర్కు ఇస్తూ వస్తున్నారు. దాని వల్ల వచ్చేదేమీ లేకపోయినా.. అప్పటికప్పుడు వారికి మద్దతు ఇచ్చే టీవీలలో లైవ్ కవరేజీ ద్వారా ప్రభుత్వాన్ని తిట్టడానికే ఇదొక ఈవెంట్గా పెట్టుకుంటున్నారనిపిస్తుంది. మరుసటి రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలలో మొదటి పేజీలో అచ్చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. ఈ వినతిపత్రాలలో కొత్త విషయం ఒక్కటి కూడా కనిపించదు.

టీడీపీ వాళ్లు మీడియా సమావేశాలు పెట్టి తిట్టిపోసే అంశాలనే గవర్నర్ వద్దకు మళ్లీ తీసుకువెళతారు. మరోసారి అదే పనిచేశారు. కాకపోతే ఆంగ్ల భాషలో వాటిని ఎవరో ఒక లాయర్‌తోతో రాయించి ఇస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వద్దని ప్రచారం చేసే తెలుగుదేశం నేతలు.. గవర్నర్‌కు మాత్రం ఆంగ్లంలోనే తమ ఫిర్యాదు కాపీని అందచేస్తారు. అది వేరే విషయం!. ఇక ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తే.. అవన్నీ అత్యధిక భాగం అబద్ధాల పుట్ట అని ఇట్టే తేలిపోతుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పెట్టేవన్నీ అక్రమ కేసులేనని గవర్నర్‌కు టీడీపీ వాళ్లు చెబుతారు. గవర్నర్ అనుమతి లేకుండానే కేసులు పెట్టారని ఆరోపిస్తారు. అంతే తప్ప.. ఆ స్కాంల ఆరోపణలకు కచ్చితమైన సమాధానం మాత్రం ఇవ్వరు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నిజం గెలిచి జైలునుంచి బయటకు వచ్చారట!. ఆయన ఎలా బెయిల్ పొందింది గవర్నర్‌ నజీర్‌కు తెలియదా?. కంటి ఆపరేషన్ కోసం బెయిల్ కోరింది నిజం కాదా?. చంద్రబాబు జైలులో ఉన్నంత కాలం ఆయన ఆరోగ్యంపై ఎన్నెన్ని అబద్దాలు ప్రచారం చేసింది.. తలచుకుంటేనే ఏహ్య భావం కలుగుతంది. తీరా జైలు నుంచి బయటకు వచ్చాక.. ఆయన శుభ్రంగా ఉండడమే కాకుండా పద్నాలుగు గంటలు ఏకధాటిగా కారులో ప్రయాణించడంతో ఆ అబద్దాలన్ని ప్రజలకు తెలిసిపోయాయి. అంతకు ముందు మమ్మల్ని ఏమీ పీకలేవు.. అంటూ సవాల్ చేసిన చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడు అవినీతి కేసులు మీద పడుతుండేసరికి అదంతా ‘కక్ష’ అని గగ్గోలు పెట్టి.. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.

టీడీపీ హయాంలో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షాన్ని కనుమరుగు చేయాలని విఫలయత్నం చేసిన టీడీపీ నేతలు.. ప్రస్తుతం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ వినతిపత్రం చదివితే అర్థమైపోతుంది. ఏపీలో శాంతిభద్రతలు మృగ్యం అయ్యాయని ఆరోపిస్తారు. నిజానికి ఈ ఐదేళ్లు రాష్ట్రం ఉన్నంత ప్రశాంతగా ఎప్పుడూ లేదు. ప్రజలలో ఉద్యమాలే లేవు. ఆయా వర్గాల గొడవలే లేవు. కాకపోతే టీడీపీ వాళ్లు అప్పడప్పుడు సృష్టించే అశాంతి మాత్రం ఉంటుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత అది కూడా లేదు. రాష్ట్రం మరింత ప్రశాంతంగా ఉంది. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇష్టారీతిన రెచ్చగొట్టి జనంలో గందరగోళం సృష్టించాలన్న వారి ఆటలకు కళ్లెం పడిందన్నదే వారి బాద. వారిపై ఆధారసహితంగా కేసులు వస్తున్నాయన్నదే వారి భయం.

చంద్రబాబు టైంలో మాదిరి 20  మంది ఎర్రచందనం కూలీలను ఎన్‌కౌంటర్ చేసి మానవహక్కులకు విఘాతం కలిగే సందర్భం జగన్ పాలనలో ఒక్కటైనా ఉందా?. అసలు ఈ ఐదేళ్లలో ఎక్కడైనా పరిస్థితి కాల్పులవరకు వెళ్ళిందా?. టీడీపీవాళ్లు చంద్రబాబు సమక్షంలో అరాచకం సృష్టించి పోలీసులపై రాళ్లు విసిరి,వాహనాలు దగ్దం చేసి, ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టినా.. పోలీసులు మాత్రం సంయమనంగా ఉన్నారు తప్ప కాల్పులు మాత్రం జరపలేదు. చంద్రబాబు తన కుటుంబంతో పుష్కరాలకు వెళ్లి సామాన్య భక్తులను ఘాట్లోకి రానివ్వకుండా నిలువరించిన ఫలితంగా ఏర్పడిన తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే ఒక్కరిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. మరి జగన్ తన కుటుంబాన్ని తీసుకు వెళ్లి అలాంటి దారుణాలకు ఎక్కడైనా కారణమయ్యారా?. జగన్ మానసిక పరిస్థితి సౌండ్ గా లేదని లోకేష్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇంతకన్నా పచ్చి అబద్దం ఇంకేదైనా ఉంటుందా? అసలు మతి స్థిమితం లేనిది తన మామ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అని డాక్టర్ల నుంచి సర్టిఫికెట్ పొందిన విషయం ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారు.

జగన్ ఒక ఎమ్మెల్యేగానే పనికిరారట. 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో ఎంపీగా, తొంభైవేల ఓట్ల ఆధిక్యతతో ఎమ్మెల్యేగాను గెలవడం ఒక ఎత్తు అయితే.. తనతో పాటు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్ను అలా అంటారా?. ఆయన ప్రజలకు బాగా పనికి వస్తారనే అంత ఘనంగా ఎన్నుకున్నారు. లోకేష్ ప్రజలకు ఉపయోగపడరనే మంగళగిరిలో ఓడించారా?. ఎదుటివారిపై ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు, విమర్శ చేసేటప్పుడు తమగురించి ఆలోచించకపోతేఏ అది వారికే నష్టం. మొన్నటిదాకా ప్రభుత్వంతో గొడవ పడి ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని కార్యకర్తలను రెచ్చగొట్టిన చంద్రబాబు, లోకేష్‌లు.. తమపై కేసులు వస్తే తెగ గోల చేస్తున్నారు. వీరే ఇలా వ్యవహరిస్తే, వీరి మాటను నమ్మి గలభాలుచేసి కేసులపాలైన కార్యకర్తల పరిస్థితి ఏమిటి? జేసీ ప్రభాకరరెడ్డి వంటివారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారట!. ఇదే తెలుగుదేశం నేతలు జేసీ సోదరులు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎన్ని ఆరోపణలుచేసేవారు!. ఇప్పుడేమో వారి స్కామ్ లను వెనుకేసుకొస్తున్నారు.  

చంద్రబాబు,తదితరులపై వచ్చిన అవినీతి కేసులన్నింటి మీద టీడీపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. 17-ఏ సెక్షన్ కింద గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఆయనకే చెప్పడం విశేషం. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చీఫ్ జస్టిస్‌కు పంపిన లేఖ మాదిరే.. ఈ వినతిపత్రం కూడా ఉంది. గవర్నర్ నజీర్ తో లోకేష్ వ్యక్తిగతంగా కాసేపు భేటీ అయ్యారట. అప్పుడు వారిద్దరి మధ్య ఏమి జరిగి ఉంటుంది! వ్యవస్థలను  మేనేజ్ చేయడానికే అలా కలిశారని ఎవరైనా అంటే ఒప్పుకుంటారా?. ఒకపక్క సుప్రీంకోర్టులో దీనిపై కేసు వేసిన తర్వాత ఆయనకు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. గవర్నర్ వెంటనే జగన్ ప్రభుత్వంపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరి అలా తీసుకోవాలంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నిసార్లు చర్యలు తీసుకోవాలి?అసలు గవర్నర్ వ్యవస్థనే అవమానించినవారు ఇతర ప్రభుత్వాలపై గవర్నర్ చర్య తీసుకోవాలని కోరడమే వారి సిద్దాంత నిబద్దత లేమికి నిదర్శనంగా చెప్పాలి.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు