టీడీపీలో ఎవరి దారి వారిదే

19 Jul, 2014 00:42 IST|Sakshi
టీడీపీలో ఎవరి దారి వారిదే

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘అడగనిదే అమ్మయినా పెట్టదంటారు. సీఎం చంద్రబాబు అయినా అంతేకదా. జిల్లా అభివృద్ధికి అంతా కలిసి ఆయనను ఏమైనా అడుగుదామంటే ఎవరూ కలిసి రావడం లేదు. నా మటుకు నేను నా నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా చేయమని అడుగుతూ ఓ వినతి ప్రతం ఇస్తున్నానంతే’ బుధవారం ద్వారకాతిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాకకోసం వేచిచూస్తున్న సందర్భంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’ ఎదుట వెలిబుచ్చిన అభిప్రాయమిది. వాస్తవానికి ఇది ఆయనొక్కరి ఆవేదన మాత్రమే కాదు. జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
 
లోపం ఎక్కడుందో తెలియదు కానీ.. జిల్లాలోని 15మంది ఎమ్మెల్యేల్లో 14మంది టీడీపీకి, ఒకరు మిత్రపక్ష బీజేపీకి చెందిన వారే అయినప్పటికీ ఎవరూ ఇప్పటివరకు జిల్లా అభివృద్ధికి ఉమ్మడి ప్రణాళిక రూపొందించలేకపోయారు. రెండు రోజులపాటుపర్యటించిన సీఎం చంద్రబాబును అంతా కలిసి ‘జిల్లాకు ఈ వరాలు  ప్రకటించండి’ అని కోరే ధైర్యం చేయలేకపోయారు.

‘పశ్చిమగోదావరి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ వన్ చేస్తా.. నాకు అన్ని జిల్లాలు ఓ ఎత్తు.. ఈ జిల్లా ఓ ఎత్తు’ అంటూ చంద్రబాబు పదేపదే అంటున్నా.. ఇక్కడి సమస్యలు, వనరులు, మంజూరు చేయూల్సిన ప్రాజెక్టులు, అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రితో వివరంగా మాట్లాడి జిల్లాకు ఏదైనా కీలక ప్రాజెక్టు ఇచ్చేలా ఒక్క ప్రకటన అరుునా చేయించలేకపోయారు.
 
బాబు రాకకు ముందురోజు ఏలూరులో ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో కొంతమంది టీడీపీ నేతలు సమావేశమై జిల్లా సమగ్రాభివృద్ధిపై సీఎంకు నివేదిక ఇచ్చి నిధులు కోరతామని విలేకరులకు చెప్పారు. సీఎం పర్యటన తొలినాడే జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ లేదా ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీ ఏర్పాటు గురించి ప్రకటించే అవకాశం ఉందని ఎంపీ మాగంటి బాబు ఆ రోజు చెప్పారు.
 
ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్  కూడా జిల్లాకు ఎయి మ్స్ ప్రకటించే అవకాశం ఉందన్నారు. కానీ.. రెండురోజుల పర్యటనలో వీటిపై కూడా చంద్రబాబు ఎక్కడా ప్రకటన  చేయలేదు. పార్టీ సమీక్షా సమావేశంలో డెల్టా ప్రాంతానికి చెంది న ఓ ఎమ్మెల్యే ధైర్యం చేసి ఐఐటీ లేదా యూనివర్శిటీ వస్తే బాగుంటుందని సూచించినప్పటికీ దానిపైనా చంద్రబాబు ప్రస్తావన తీసుకురాలేదు.
 
హామీల సంగతి అంతే...
కొత్త ప్రాజెక్టుల విషయం పక్కనపెట్టినా కనీసం పాత హామీల అమలు పైనా చంద్రబాబు నుంచి టీడీపీ నేతలు స్పష్టత ఇప్పించలేకపోయూరు. ప్రధానంగా పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో లక్షలాది మందిని ప్రభావితం చేసే కొల్లేటి సమస్యపై చంద్రబాబు  ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొల్లేరును ఐదో కాంటూర్ నుంచి మూడో కాంటూర్‌కు కుదిస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పార్టీ నాయకులు హామీలు గుప్పిం చారు.
 
ఇదే అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో సైతం చేర్చారు. సీఎం హోదాలో జిల్లాకు వచ్చిన చంద్రబాబుతో ఈ విషయమై ఎలాంటి ప్రకటనా ఇప్పించలేకపోయారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలసి తొలిసారి వచ్చిన చంద్రబాబుకు ఓ ఉమ్మడి ప్రణాళిక ఇస్తే ముఖ్యమంత్రి కచ్చితంగా ఏదైనా స్పష్టమైన ప్రకటన చేసుండేవారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మరి ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు సంఘీభావంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు సాధిస్తారా.. లేదా అనేది వేచి చూడాల్సిందే.
 
కలెక్టర్‌ను సర్వే చేయమన్నారు
జిల్లాకు ఏవేం కేంద్ర ప్రాజెక్టులు వస్తే బాగుం టుందో అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్‌కు సూచించారు. నాలుగైదు ప్రాజెక్టులపై సర్వే చేస్తే జిల్లాకు ఉపయోగపడే కీలక ప్రాజెక్టును ప్రకటిస్తామన్నారు. నరసాపురం సముద్ర తీరంలో పోర్టు, తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మించాలని కోరాం. జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. మా అధినేత కచ్చితంగా మాట నిలబెట్టుకుంటారు. త్వరలోనే హామీలు కార్యరూపం దాలుస్తాయి.              
 - తోట సీతారామలక్ష్మి, రాజ్యసభ సభ్యురాలు
 
ఏదైనా ప్రకటించి ఉంటే బాగుండేది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు ఏదైనా ప్రాజెక్టు ఇస్తామన్నారు. కానీ.. ఎందుకో ఏదీ ప్రకటించకుండానే వెళ్లిపోయారు. ప్రకటించి ఉంటే బాగుండేది. మరి ఆయన మనసులో ఏముందో.
 - గోకరాజు గంగరాజు, నరసాపురం ఎంపీ

మరిన్ని వార్తలు