కుంట నక్కలు

25 Feb, 2016 03:14 IST|Sakshi
కుంట నక్కలు

సాక్షి ప్రతినిధి, కర్నూలు:అధికార పార్టీ నేతల అవినీతి దందా పరాకాష్టకు చేరింది. పంట పొలాల్లో తవ్వుతున్న కుంట(ఫాంపాండ్స్)లనూ వదలని పరిస్థితి. ఉపాధి కూలీలతో చేయించాల్సిన ఈ నిర్మాణాలను యంత్రాలతో చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలు తమ పొక్లెయిన్లనే ఇందుకోసం వినియోగిస్తున్నారు. అయితే, మస్టర్‌లో మాత్రం కార్మికులు పనికి వచ్చినట్టు దొంగ హాజరు సృష్టిస్తున్నారు. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి ఉపాధి హామీ ఫీల్డ్ సిబ్బంది కూడా అవినీతిలో పాలుపంచుకుంటున్నారు. సహకరించకపోతే ఉద్యోగం నుంచి తీసివేయిస్తామనే బెదిరింపుల నేపథ్యంలో ఏమీ చేయలేక తిలా పాపం తలా పిడికెడు చందంగా వీళ్లూ వంత పాడుతున్నారు.

నేతల పాలిట ‘సంజీవని’
 భూమిపై పడిన ప్రతి నీటిచుక్కనూ కాపాడుకుని భూగర్భ జలాలను పెంపొందించుకోవడంతో పాటు పంట కుంటల తవ్వకం ద్వారా కేవలం ఉపాధి కూలీలకు పనులు కల్పించాలనేది జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లోనూ యంత్రాలను ఉపయోగించవద్దని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 100 నుంచి 150 చొప్పున లక్ష నీటి కుంటలు తవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఒక్కో నీటి కుంటకు సైజును బట్టి 200 నుంచి 500 పనిదినాలను కల్పించవచ్చనేది ఆలోచన. అయితే, సగటున 300 పనిదినాలు కల్పించవచ్చనని అంచనా వేశారు. తద్వారా జిల్లాలో నిర్మించనున్న లక్ష నీటి కుంటల వల్ల 3కోట్ల పనిదినాలను కల్పించే వీలుంది. ఈ కార్యక్రమానికి పంట ‘సంజీవని’గా నామకరణం కూడా చేశారు. ఇది కాస్తా అధికార పార్టీ నేతలకు సంజీవనిగా మారిపోయింది. తమ యంత్రాలతో పనులు చేయిస్తూ కూలీలకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. వాళ్ల నోట్లో మట్టి కొట్టి ఆ నగదును కాస్తా తమ అకౌంట్లలో జమ చేసుకుంటున్నారు.
 
వలసబాటలో జనం
జిల్లాలో ఉపాధి పనులను ప్రధానంగా పంట కుంటలను తవ్వేందుకే చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించుకుంది. కేవలం మూడు నెలల కాలం(జనవరి, ఫిబ్రవరి, మార్చి)లోనే వీటిని తవ్వించడం ద్వారా 3కోట్ల పనిదినాలను వేసవి కాలంలో కల్పించి వలసలు లేకుండా చూడాలని భావించారు. అయితే, ఈ పనులపై కన్నేసిన అధికార పార్టీ నేతలు యంత్రాలతో పని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో లక్షలాది మంది జనం వలసబాట పడుతున్నారు.

మరిన్ని వార్తలు