అధికార పార్టీలో ఆధిపత్య పోరు!

10 Feb, 2016 01:06 IST|Sakshi
అధికార పార్టీలో ఆధిపత్య పోరు!

అమాత్య పదవిపై ఆశతో స్కెచ్‌లు
 రాజప్ప చాపకిందకు నీరు తెచ్చేందుకు యత్నాలు
  కాపు ఉద్యమం వేదికగా వ్యూహాలు
  పావులు కదుపుతున్న ఇద్దరు నేతలు

 
 జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇప్పటివరకూ తెరవెనుక ఎత్తులు వేసుకుంటున్నవారి మధ్య విభేదాలు.. ఇప్పుడు బహిరంగంగానే సాగుతూండటంతో ప్రజలు విస్తుపోతున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాపు ఉద్యమంకంటే కూడా.. తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న విభేదాలే పార్టీ అధినేత చంద్రబాబుకు తలబొప్పి కట్టించాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు కొత్తేమీ కాదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో అది మరింత తీవ్రమైంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని మంత్రులు.. వారికి మద్దతుగా నిలిచిన ఓ ఎమ్మెల్సీ, ఓ ఎమ్మెల్యే మధ్య సాగుతున్న ఈ పోరుకు కాపు ఉద్యమం ఒక వేదికగా మారింది. తనకన్నా జూనియర్ అయిన నిమ్మకాయల చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి పదవులు ఇవ్వడం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తొలినుంచీ ఇబ్బందికరంగానే మారింది. తనకు శిష్యుడే అయినప్పటికీ ప్రొటోకాల్ ప్రకారం  రాజప్పకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడం యనమలకు కంటగింపుగా మారిందనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఇదే సమయంలో వారి వెనుక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరడంతో ఆధిపత్య పోరు ముదురుపాకాన పడింది.
 
 శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు హోం మంత్రి మీద విమర్శలు రావడం సహజం. కాపుగర్జన సభ సందర్భంగా తుని విధ్వంస ఘటనకు దారి తీసిన పరిస్థితులు, దీనిపై హోం మంత్రిగా చినరాజప్ప స్పందించిన తీరు.. ఆయన సొంత సామాజికవర్గంలోనే తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ముద్రగడపై రాజప్ప నేరుగా విమర్శలు చేయడాన్ని చాలామంది బహిరంగంగానే తప్పు పట్టారు. ఇదే అదనుగా టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగించారు. దీంతో టీడీపీలో ఆధిపత్య పోరు మరోమారు బహిర్గతమైంది.
 
 మంత్రిగిరీకోసం..
 జిల్లాలో చినరాజప్పతో తొలినుంచీ విభేదాలున్న ఓ నాయకుడు, వచ్చే ఎన్నికల నాటికి ఆయనను పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారు. అలాగే, రాజప్పను మంత్రివర్గం నుంచి తొలగిస్తే అదే సామాజికవర్గం కోటాలో తనకు అవకాశం వస్తుందని మరో ఎమ్మెల్యే ఆశిస్తున్నారు. వీరిద్దరూ కాపు ఉద్యమాన్ని వేదికగా చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయనను ఆ పదవి నుంచి ఎప్పటికైనా తప్పిస్తారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఇదే జరిగితే ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఓ సీనియర్ నేత ఆశిస్తున్నారు.
 
 అయితే ఇందుకు చినరాజప్ప అడ్డంకిగా మారారని, ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయనను తప్పిస్తే అదే సామాజికవర్గానికి చెందిన తనకు లైన్ క్లియర్ అవుతుందన్నది సదరు నేత ఆలోచనగా ఉన్నట్లు టీడీపీలోనే ఓ వర్గంవారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమాన్ని ఉధృతం చేయడంలోను, రాజప్ప దిష్టిబొమ్మలు దహనం చేయించే కార్యక్రమంలోను తెరవెనుక ఆ నేత కీలక పాత్ర పోషించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హోంమంత్రి పదవిపై ఎప్పటినుంచో మోజుపడుతున్న ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి సైతం ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకున్నారని సమాచారం.
 

మరిన్ని వార్తలు