జిల్లాలో ‘కోట్ల’ ఖర్చు

6 Apr, 2019 11:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు :  కొన్ని రోజుల క్రితం అధికార పార్టీలో చేరిన ఒక నేత డబ్బు ఖర్చు చేస్తున్న వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మొన్నటివరకు ‘మేం నీతివంతులం’ అని చెప్పుకుంటున్న సదరు కుటుంబం కాస్తా... టీడీపీలో చేరిన తర్వాత ఏకంగా రెండు బ్యాంకుల్లో ఉన్న రూ.75 లక్షల రుణాన్ని వెంటనే చెల్లించేశారు. అంతేకాకుండా తనకు దగ్గరగా ఉండే వారి పేరు మీద ఏకంగా నాలుగు కార్లు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది.

‘మా వద్ద డబ్బుల్లేవ్‌.. మాది నీతివంతమైన కుటుంబం’ అని చెప్పుకునే సదరు నేత కాస్తా ఇప్పుడు చేస్తున్న వ్యవహారం చూసి పక్కనున్న నాయకులే వాపోతున్నారు. అలాంటి మనుషులు ఈ విధంగా తయారవుతారనుకోలేదని అభిప్రాయ పడుతున్నారు. ఫలితంగా వీరి కుటుంబంపై దశాబ్దాలుగా ఉన్న గౌరవం కాస్తా  పోయిందని అంటున్నారు. మరోవైపు మొన్నటి వరకు వైరి వర్గాలుగా ఉన్న రెండు కుటుంబాల వారు ఇప్పుడు ఒకే వాహనంలో తిరుగుతున్నారు.

సొంత అన్నదమ్ముల్లా అన్యోన్యంగా మెలుగుతూ ఓట్లు వేయాలంటూ తిరుగుతున్న వీరిని చూసి.. వీరి కోసమా తాము ఇన్ని రోజులుగా కుటుంబాలను వదులుకున్నదంటూ విమర్శిస్తున్నారు. వేర్వేరు వర్గాలుగా విడగొట్టి, తమ గ్రామాల్లో ఫ్యాక్షన్‌ కుంపటి రాజేసిన ఆ ఇరువురు నేతలు ఇప్పుడు.. ప్రతిపక్ష పార్టీ వైపు ఉంటే ఇబ్బంది పడతావంటూ బెదిరింపులకు దిగుతుండడం గమనార్హం. ఇక ప్రచారం సందర్భంలోనూ సదరు కుటుంబం పెడుతున్న ఖర్చును చూసి.. ‘వారు వీరేనా’ అన్న సందేహం కలుగుతోంది. 

మద్యం పారించి..డబ్బు వెదజల్లుతూ.. 
గతంలో ఈ కుటుంబం ఎన్నడూ పెద్దగా మందు పంపిణీ చేసింది లేదు. అయితే, టీడీపీలో చేరే సమయంలో కేసుల కొద్దీ మద్యాన్ని ఏరులా పారించారు. ఎవరికి ఎన్ని కేసుల మద్యం కావాలంటే అంత పంపిణీ చేశారు. ఇందుకోసం ముందుగానే టోకెన్లు జారీచేశారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో కూడా నేతలకు నోట్ల కట్టలను వెదజల్లుతున్నారు. అవతలి పార్టీలో ఉన్న వారిని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తున్న తీరు దారుణంగా ఉంటోంది.

సొంత నియోజకవర్గంలోని అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు తీసుకున్న ప్యాకేజీ కూడా చర్చనీయాంశమవుతోంది. అన్ని రోజులుగా పాటిస్తున్న విలువలను అధికార పార్టీలో చేరిన వెంటనే తుంగభద్ర నదిలో కలిపిన వైనాన్ని చూసి జనం అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తమ్మీద అధికార పార్టీలో చేరిన తర్వాత సదరు కుటుంబం చేస్తున్న ‘కోట్ల’ ఖర్చు వ్యవహారం జనంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.    

మరిన్ని వార్తలు