మా సారొస్తే అమ్మవారి హారతి ఇవ్వరా?

14 Dec, 2018 12:04 IST|Sakshi

అర్చకునిపై పంచాయతీ అధికారుల చిందులు

ఇంటి వద్దకు వచ్చి ఓవరాక్షన్‌

స్థానికులు నిలదీతతో వెనక్కు తగ్గిన వైనం

చిత్తూరు, తిరుచానూరు: ‘‘మా సారొస్తే..హారతి ఇవ్వరా..? మీకు ఎంత ధైర్యం..?’’ అంటూ పంచాయతీ అధికారులు గురువారం ఆలయ అర్చకునిపై రెచ్చిపోయారు. ఆపై వారి ఇంటికి ఉన్న పంచాయతీ నీటి కొళాయి కనెక్షన్‌ తొలగించేందుకు యత్నించారు. వివరాలు.. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌ నాయుడు తన కుటుంబ సభ్యులతో వాహనసేవకు వచ్చారు. అయితే వాహన సేవలో ఆయనకు హారతి ఇవ్వకపోవడంతో ఆగ్రహించారు. అలాగే బుధవారం అమ్మవారి పంచమితీర్థంలో కూడా ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని సుమారు గంట పాటు సెక్యూరిటీ సిబ్బంది నిలువరించారు.

ఈ నేపథ్యంలో, గురువారం చోటుచేసుకున్న పరిణామాలు కక్ష సాధింపునకు అద్దం పట్టాయి. పంచాయతీ ఇన్‌ఛార్జ్‌ ఈఓ కిరణ్‌ తన సిబ్బందితో కలసి ఆలయ అర్చకుడు బాబు స్వామి ఇంటికి వచ్చారు. అక్రమంగా పంచాయతీ కొళాయిని ఏర్పాటు చేసుకున్నారంటూ హడావుడి చేశారు. కనెక్షన్‌ను తొలగించేందుకు యత్నించారు. తాము 20 ఏళ్ల క్రితమే పంచాయతీకి డబ్బులు కట్టి కొళాయి కనెక్షన్‌ పొందామని బాబుస్వామి బదులిచ్చారు. అయితే, రసీదులు చూపమంటూ అధికార దర్పం ప్రదర్శించారు.  కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుసుకున్న స్థానికులు వారిని నిలదీశారు. దీంతో బాబుస్వామిని పంచాయతీ కార్యాలయానికి రావాలంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత కార్యాలయానికి వెళ్లిన బాబుస్వామిపై ఇన్‌చార్జ్‌ కార్యదర్శి చిందులుతొక్కారు. ‘మాసారు వాళ్లు అమ్మవారికి హారతి ఇస్తుంటే  తోసేస్తారా?.. పంచాయతీ అధికారులంటే మీకు భయం లేదా..మీరు ఏమనుకుంటున్నారు?’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.  మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని హెచ్చరించడంతో బాబుస్వామి మనస్తాపంతో ఇంటిముఖం పట్టారు. దీనిపై కిరణ్‌ను వివరణ కోరగా...అలాంటిదేమీ లేదని, బాబుస్వామి ఇంటి వద్ద కొళాయికి మోటారు పెట్టి నీటిని వాడుతున్నారని ఫిర్యాదు అందడంతో తాను తనిఖీ చేసినట్టు చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు