రెండు రోజుల్లో ఆర్డీఓగా ప్రమోషన్‌.. కానీ ఇంతలోనే..

8 Mar, 2019 10:26 IST|Sakshi
తహసీల్దార్‌ జయప్రకాష్‌ 

సాక్షి, కావలి:  కావలి టీడీపీ నాయకులు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రల అడ్డమైన దోపిడీకి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న దగదర్తి తహసీల్దార్‌ డి.జయప్రకాష్‌ కేవలం రెండు రోజుల్లో ఆర్డీఓగా పదోన్నత పొందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇందుకు సంబంధించిన ఫైలు చాలా కాలంగా ఉంది. అయితే ప్రాధాన్యతల వారీగా  రాష్ట్ర రెవెన్యూశాఖ  కార్యదర్శిగా ఉండే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఈ ఫైలుపై సంతకాలు చేయాల్సి ఉంది. ఇంతలో టీడీపీ నాయకుల భూ దందాలో చిక్కుకుని బలైపోయారు. 

అసలు భూములు కథ ఏమిటంటే..
దగదర్తి మండలంలో ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉండటం, ఆ ప్రాంతానికి చెందిన వారు ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలసలు పోవడం,  సంపన్నులు తమ ఆస్తులు పెంచుకునే క్రమంలో మండలంలోని భూములపై కన్ను పడటం, వలస వెళ్లిపోయిన మండలానికి చెందిన ప్రజలు ఆర్థికంగా స్థిరత్వం పొందడంతో వారి గ్రామాల్లో ని భూములపై ఆసక్తి కనపరిచారు. అలాగే మండలంలో విమానాశ్రయం నిర్మించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం, పరిశ్రమలు స్థాపనకు మండలంలోని భూములను గుర్తించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఇవన్నీ కూడా జరిగేసరికి 2014 సంవత్సరం వచ్చింది. అప్పుడే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కావలి నియోజకవర్గంలో అధికార టీడీపీ నాయకులుగా బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలు అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో తమ అదుపులోకి తెచ్చుకున్నారు. బీద సోదరులు తమ ఆక్వా సామ్రాజ్యాన్ని అల్లూరు మండలంలోని సముద్రతీరం వెంబడి వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో విస్తరించుకున్నారు. అక్కడికి ఆగక విస్తరణను దగదర్తి మండలంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు వరకు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఒక పక్క విమానాశ్రయ భూములు, మరో పక్క పరిశ్రమలకు భూములు అంటూ టీడీపీ ప్రభుత్వం దగదర్తి మండలంలో భూసేకరణకు తెరతీసింది. ఇవన్నీ ముందస్తుగానే తెలిసిన బీద సోదరులు దగదర్తి తహసీల్దార్‌గా  తమ కనుసన్నల్లో ఉన్న వారినే నియమించుకోసాగారు. 

విలేజ్‌ అసిస్టెంట్‌ నుంచి..
రెవెన్యూ శాఖలో విలేజ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన డి.జయ ప్రకాష్, ప్రమోషన్లతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) అయిన, ప్రస్తుతం తాహసీల్దార్‌ వరకు చేరుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆర్డీఓగా ప్రమోషన్‌ ఉత్తర్వులను అందుకోవాల్సి ఉండగా, టీడీపీ నాయకులతో కలిసి చేసిన భూదందాల పాపంలో పాలు పంచుకుని వాటాలు మింగడంతో సస్పెండ్‌ ఉత్తర్వులు అందుకున్నారు. 2019 ఏప్రిల్‌ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న డి.జయప్రకాప్‌ను,  ఎన్నికల బదిలీల్లో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లను బదిలీ చేసినా ఆయన్ను చేయలేదు.

ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉండటంతో డి.జయప్రకాస్‌ సేవలు దగదర్తి తాహసీల్దార్‌గానే అందిస్తారని టీడీపీ నాయకులు బీద మస్తన్‌రావు, బీద రవిచంద్ర చేసిన ఒత్తిళ్లకు ఉన్నత స్థాయి అధికారులు తలొగ్గి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల సంఘం ఆ పప్పులు ఉడకవని హెచ్చరించడంతో డి.జయప్రకాష్‌ను కోనేరు రంగారావు కమిటీలో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇంతలో కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు ఆదేశాలతో కావలి సబ్‌ కలెక్టర్‌ చామకూరు శ్రీధర్‌ కొన్ని భూదందా ఫిర్యాదులపై చేసిన విచారణలో దగదర్తి తాహసీల్దార్‌ హోదాలో డి.జయప్రకాష్‌ చేసిన అక్రమాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్‌ అయ్యారు.

 ఆర్డీఓ హోదాలో ఉద్యోగ విరమణ చేయాల్సిన డి.జయప్రకాష్, టీడీపీ నాయకులు అక్రమాల దందాల్లో భాగస్వామ్యం కావడంతో ఆ ఉత్తర్వులు అందుకోకుండానే తాహసీల్దార్‌గానే పదవీ విరమణ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా తమ అక్రమాలకు తాహసీల్దార్‌ హోదాలో ఉన్న డి.జయప్రకాష్‌ను అన్ని రకాలుగా వాడుకున్న టీడీపీ నాయకులు బీద సోదరులు కనీసం సస్పెండ్‌ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆయన్ను పలకరించలేదు. దీంతో ఆయన పలువురి వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి క్షోభకు గురి అవుతాన్నట్లు సమాచారం. 
 

మరిన్ని వార్తలు