అసంతృప్తి సెగ

23 Apr, 2016 02:07 IST|Sakshi

కొందరు ముఖ్యనేతల తీరుతో
రగిలిపోతున్న స్థానిక టీడీపీ నేతలు
{పాధాన్యత ఇవ్వలేదంటూ ఆక్రోశం

కుప్పం, తంబళ్లపల్లె, సత్యవేడు నియోజకవర్గాల్లో తారస్థాయికి చేరిన వైనం

 

జిల్లాలో కొందరు అధికార పార్టీ నేతల తీరుపై స్థానిక నాయకులు రగిలిపోతున్నారు. నీరు-చెట్టు పనులు, అంగన్‌వాడీ పోస్టుల భర్తీల్లో నిజమైన కార్యకర్తలకు లబ్ధి  చేకూరలేదనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. కొన్ని నియోజక వర్గాల్లో పర్సెంటేజీలు తీసుకుని పనులు, పోస్టులు కట్ట బెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధిష్టానం సైతం సీరియస్‌గా  ఉన్నట్లు తెలిసింది.

 

తిరుపతి: జిల్లాలో కొందరు ముఖ్యనేతల తీరుపై స్థానిక టీడీపీ నాయకులు రగిలిపోతున్నారు. దీనిపై అధిష్టా నానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఆయన పీఏ వైఖరి దేశంపార్టీ నేతలకు చెంపపెట్టుగా మారినట్టు చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోలేదనే భావ న ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో చూపిన ప్రేమ ఇప్పుడు కనిపించడం లేదని, కనీసం ఫోన్ చేసి కూడా స్పదిండం లేదని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అక్కడ పనులను పర్సెంజీలు తీసుకుని పక్క జిల్లాల వారికి కట్టబెడుతున్నారనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తెలిసి పార్టీ అధినేత కూడా చూసీచూడనట్టు వ్యవహారిస్తున్నారని అక్కడి ప్రజలు రగిలిపోతున్నారు.

 
మిగతా నియోజకవర్గాల్లో..

టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నచోట ప్రధానంగా పార్టీ క్యాడర్ గుర్రు గా ఉంటోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆపార్టీ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, నియోజకవర్గ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని అక్కడి ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. దీనికితోడు ఫోన్ చేసేందుకు కూడా అం దుబాటులో ఉండరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే తండ్రి కర్రపెత్తనంతో అక్కడి ముఖ్యనేతలు విసిగిపోయారు. ఇందు లో భాగంగానే ఆ నియోజకవర్గ ప్రధాన నేతలు ఇటీవల తిరుపతిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి బహిరంగ విమర్శలకు దిగడం దీనికి మరింత బలా న్ని చేకూర్చుతోంది. నీరు-చెట్టు పనుల అప్పగింత, అంగన్‌వాడీ కార్యకర్తల నియామకాల్లో ప్రధానంగా ఆ పార్టీ నేత ల్లో అసంతృప్తి తెచ్చినట్టు సమాచారం. 

 
తిరుపతిలో..

అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు స్థానిక నేతలను పిలవడం లేదనే అసంతృప్తి నగరంలోని నేతల్లో చోటుచేసుకుంటోంది. కార్పొరేషన్ పరిధిలోని బండ్లవీధిలో గత మంగళవారం డ్రైనేజీ కాలువ పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే సుగుణమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు సమాచారం ఇవ్వలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు చైర్మన్ గ్రూపుల మధ్య సమన్యయం కొరవడినట్టు తెలుస్తోంది. ఈ గ్రూపుల మధ్య అధిపత్య పోరు నడుస్తోంది.

 
కార్పొరేషన్ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకొవాల్సిదేనా..

పార్టీలో గ్రూపుల మధ్య విభేదాలు, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వక పోవడం, ప్రతి పక్ష పార్టీ బలపడుతుండడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎదురీత తప్పదనే భావన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు