పచ్చ నేతల కుటిల రాజకీయం

30 Jun, 2020 09:33 IST|Sakshi
అంబాపురంలో దాడి అనంతరం శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న ఎస్‌ఐ బాలకృష్ణ, పోలీసులు

శనివారం నాటి  హత్యకు పార్టీ రంగు పులుముతున్న వైనం

పాతకక్షల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటన 

అంబాపురం (గురజాల రూరల్‌): ఒకే సామాజికవర్గంలోని బంధువుల్లో ఇంటివద్ద బోరింగ్‌ వివాదంలో ప్రత్యర్థులు గొడ్డళ్లతో చేసిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన  ఘటన మండలంలోని అంబాపురం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న సంగతి  విదితమే. కుటుంబాల గొడవల్లో పాతకక్షల నేపపథ్యంలో జరిగిన హత్యకు పచ్చపార్టీ నేతలు పార్టీల రంగు పులుముతున్నారు. వివరాల్లోకి వెళితే..అంబాపురం గ్రామంలో 2019 జనవరిలో జరిగిన గొడవల్లో బాజీ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన  ఘటనలో దోమతోటి విక్రమ్, బత్తుల వాసు నిందితులు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య పలుమార్లు చెదురుమదురు ఘటనలు(గొడవలు) చోటు చేసుకున్నాయి.  ఇటీవల కాలంలో తాగునీటి బోరు విషయంలో జరిగిన తగాదా నేపథ్యంలో.. దోమతోటి విక్రమ్, బత్తుల వాసు ఒక ద్విచక్రవాహనపై, బత్తుల నాగరాజు, అర్జున్, జంగా పాపులు మరో  ద్విచక్రవాహనపై శనివారం రాత్రి గురజాలకు వచ్చి స్వగ్రామమైన అంబాపురానికి తిరుగు ప్రయాణమయ్యారు.

పాతకక్షల నేపథ్యంలో  ప్రత్యర్థులు మంటి పుల్లయ్య, మంటి బ్రహ్మయ్య, మామిడిపల్లి మల్లయ్య, కసుకుర్తి కొండా, గొట్టిముక్కల  నాగులు, పెంటమళ్ల వెంకటేశ్వర్లు, దోమతోటి బాజితోపాటు మరికొంతమంది గొడ్డళ్లతో నాగరాజు, అర్జున్, పాపులపై ముందుగా దాడి చేశారు. అనంతరం రెండో ద్విచక్రవాహనంపై వచ్చిన వాసు, విక్రమ్‌పై దాడి చేశారు. విక్రమ్‌కు కాళ్లు, చేతులపై తీవ్రగాయాలై కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు  క్షతగాత్రులను పోలీసుల సొంత వాహనంలో గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అధిక రక్తస్రావమై అపస్మారకస్థితిలో ఉన్న విక్రమ్‌(33)ను వైద్యులు పరీక్షించి అప్పటికే  మృతి చెందాడని ధృవీకరించారు. మిగతా వారిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ బాలకృష్ణ గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న డీఎస్‌పీ మాట్లాడుతూ కేసును త్వరగా ఛేదిస్తామని తెలిపారు. ఇప్పటికే కొంతమంది నిందుతులను పట్టుకుని విచారిస్తున్నట్లు అనధికార సమాచారం. అయితే ఇలాంటి ఘటనలకు కూడా పచ్చ పార్టీ నేతలు పార్టీల రంగులు పులిపి గ్రామాల్లో ఫ్యాక్షన్‌  చెలరేపేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు