‘మేళా’ల పేరిట మేసేశారు!

29 Jul, 2019 04:27 IST|Sakshi

ఎల్‌ఎల్‌ఆర్‌ల ముసుగులో రూ.100 కోట్లను దోచేసిన టీడీపీ నేతలు

అనంతపురంలో టీడీపీ ముఖ్య నేత దోపిడీ

లెక్క తేలని రూ.40 కోట్ల సొమ్ము

అవినీతి బాగోతంపై రవాణా శాఖ నివేదిక సిద్ధం

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. రూ.వంద కోట్ల ప్రభుత్వ సొమ్మును టీడీపీ నేతలకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టిన అక్రమ బాగోతమిది. రూ.250 కోట్ల మేర రవాణా శాఖకు రావాల్సిన జీవిత పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌) ఎగ్గొట్టిన వైనం మరువక ముందే లెర్నర్‌ లైసెన్సు రిజిస్ట్రేషన్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌) మేళాల పేరిట టీడీపీ నేతలు, అధికారులు రూ.వంద కోట్ల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు. ఈ దోపిడీలో టీడీపీ నేతలదే ముఖ్య పాత్ర. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ప్రచారం పొందాలనే ఉద్దేశంతో, ఎన్నికల ముందు ప్రజల దగ్గర పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాల్లో లైసెన్సు లేని వాహనదారులకు ఎల్‌ఎల్‌ఆర్‌ ఇప్పిస్తామని, దీనికయ్యే రిజిస్ట్రేషన్‌ రుసుములను తామే భరిస్తామని రవాణా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

రవాణా శాఖ అధికారులు కూడా టీడీపీ నేతలతో జత కట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, కళాశాలల్లో 300 వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా టీడీపీ నేతలు చెప్పినట్టు అధికారులు నడుచుకోవడం వివాదాస్పదమైంది. ద్విచక్ర వాహనాలకు ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.390, ద్విచక్ర వాహనం, కారు రెండు కలిపి లైసెన్సుకు రూ.440 రుసుములను రవాణా అధికారులకు టీడీపీ నేతలు చెల్లించారు. రవాణా అధికారులు మేళాలో ల్యాప్‌టాప్‌ తీసుకుని స్లాట్‌లు బుక్‌ చేయడంతోపాటు వాహనదారులకు కంప్యూటర్‌లో పరీక్ష నిర్వహించాలి. పరీక్ష లేకుండానే టీడీపీ నేతలు ఇచ్చిన పేర్లతో ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ చేసేశారు. అంతేకాకుండా ఒక్కో మేళాలో పదివేల మంది వరకు లైసెన్సు లేని వాహనదారులకు ఎల్‌ఎల్‌ఆర్‌ ఇచ్చినట్లు రికార్డుల్లో చూపారు. 

ప్రభుత్వ సొమ్ముతో టీడీపీ నేతలకు ప్రచారం
అనంతపురం జిల్లాలో చీటికిమాటికి నోరు పారేసుకునే టీడీపీ ముఖ్య నేత ఒకరు తన నియోజకవర్గంలో మేళా నిర్వహించి పది వేల మందికి ఎల్‌ఎల్‌ఆర్‌ లైసెన్సులు ఇప్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాత తనకు రూ.30 లక్షల వరకు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని తనకు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో టీడీపీ ప్రభుత్వం సదరు నేతకు ఆ మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇలా టీడీపీ నేతకు చెల్లించడంతో రవాణా శాఖకు లైసెన్సు తీసుకున్నవారు చెల్లించాల్సిన రుసుమును ప్రభుత్వం కోల్పోయింది. ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మేళాల్లో ఎల్‌ఎల్‌ఆర్‌లు ఇచ్చినందుకు టీడీపీ నేతలకు రూ.వంద కోట్ల వరకు చెల్లింపులు జరిపినట్లు రవాణా శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అసలు లైసెన్సు మేళాల్లో ఎంతమందికి ఎల్‌ఎల్‌ఆర్‌లు ఇచ్చారో.. టీడీపీ నేతలకు ఎంత మొత్తం నిధులు చెల్లించారో స్పష్టత లేదని రవాణా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ప్రభుత్వ సొమ్ముతో టీడీపీ నేతలకు ప్రచారం దక్కినట్లయింది.

కొంత మంది అధికారుల హస్తం
రవాణా శాఖలో పౌర సేవలను ఆన్‌లైన్‌ చేయడంతో సేవలకు స్వైపింగ్‌ మెషీన్లు వినియోగించారు. వాహనదారుల రిజిస్ట్రేషన్‌కు, యాజమాన్య హక్కులు బదలాయించడం, తదితర సేవలకు స్వైపింగ్‌ ద్వారా నిర్ణీత రుసుమును రవాణా శాఖ జమ చేసుకుంది. 2016 నుంచి స్వైపింగ్‌ మెషీన్ల ద్వారానే లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీలకు సంబంధించి రూ.40 కోట్ల సొమ్ము లెక్క తేలడం లేదని విశ్వసనీయ సమాచారం. రవాణా శాఖను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన దోపిడీకి ఆ శాఖలోని కొందరు అధికారులు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతి బాగోతంపై ఇప్పటికే నివేదిక సిద్ధమైనట్లు సమాచారం.   

>
మరిన్ని వార్తలు