సార్.. అనుమతులు చూపించండి!

31 Mar, 2016 01:30 IST|Sakshi
సార్.. అనుమతులు చూపించండి!

ఇసుక రీచ్ నుంచి వెళ్లిపోతాం
పెనుమాక క్వారీలో అధికారుల ఆవేదన

 
తాడేపల్లి రూరల్: ‘సార్!  అనుమతులు చూపించండి.. ఇసుక రీచ్‌లో నుంచి మేము వెళ్లిపోతాం.. మిమ్ముల్ని సతాయించాలని మేము ఇక్కడకు రాలేదు’  ఓ అధికారి బుధవారం పెనుమాక రీచ్‌లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడితో ఫోన్‌లో సంభాషించిన తీరు ఇదీ. సేకరించిన సమాచారం మేరకు.. పెనుమాక ఇసుక రీచ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులకు, టీడీపీ తాడేపల్లి మండల నాయకులకు మధ్య ఇసుక అమ్ముకునే విషయంపై గత రెండు రోజుల నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు చేతులెత్తేసి, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లా నుంచి రెవెన్యూ డిపార్టుమెంట్ ప్రత్యేక గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ సత్యసాయి క్వారీలో జరుగుతున్న ఆధిపత్య పోరును సద్దుమణిగించేందుకు పెనుమాక ఇసుక రీచ్‌కి బుధవారం వచ్చారు.

ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు తమ దగ్గర ఉన్న పత్రాలను సత్యసాయికి చూపించారు. అలాగే రెండో వర్గానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులను కూడా పత్రాలు చూపించమని కోరడంతో వారు పత్రాలు చూపించకుండా, మా సార్ మాట్లాడతారు, మీరు ఫోన్‌లో మాట్లాడమంటూ డిప్యూటి కలెక్టర్‌కు ఫోన్ అందజేశారు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి గుంటూరుకు వస్తే పత్రాలు చూపిస్తానని తెలియజేశారు. అధికారి మాత్రం రెండు గంటలైనా ఇక్కడే ఉంటాను.. మీరు పంపించండంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఎమ్మెల్యే అనుచరులు పలుసార్లు అధికారిని బెదిరించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

చివరకు సత్యసాయి ఇరిగేషన్ ఎస్‌ఈని ఫోన్‌లో సంప్రదించగా.. అనుమతులు ఇవ్వలేదనీ, ఇసుక తీసుకోమని జిల్లా కలెక్టర్ చెప్పారని సెలవిచ్చారు. దీంతో అసహనం చెందిన డిప్యూటి కలెక్టర్ సత్యసాయి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. జరుగుతున్న ఈ తంతు చూస్తుంటే ఎటువంటి అనుమతులు లేకుండానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థం అవుతోందని అక్కడకు వచ్చిన పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.
 

>
మరిన్ని వార్తలు