జగన్ బెయిల్‌పై టీడీపీ గోబెల్స్ ప్రచారం: మర్రి రాజశేఖర్

28 Sep, 2013 01:36 IST|Sakshi
సాక్షి, గుంటూరు : కాంగ్రెస్‌తో అంటకాగుతూ, రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్న సొంత పార్టీ విధానాన్నే ప్రశ్నించలేని టీడీపీ జిల్లా నేతలు జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో చంద్రబాబు గోబెల్స్ థియరీని అనుకరిస్తున్నారని జిల్లా వైఎస్సార్ సీపీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారని, ప్రజల్లో ఇంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌తో జగన్ పొత్తు పెట్టుకోబోతున్నారని, అందువల్లే బెయిల్ వచ్చిందని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారంటే వారి మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందన్నారు.
 
జగన్ బెయిల్ విషయంలో స్పష్టత ఉన్నా దురుద్దేశాలు ఆపాదిస్తున్నారంటే కచ్చితంగా వీరికి మతి భ్రమించిందేమోనని సామాన్యులు చర్చించుకుంటున్న విధంగానే తాము ఆలోచించాల్సి వస్తుందన్నారు. చట్టాలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్న టీడీపీ నేతల తీరును ఏమనాలని ప్రశ్నించారు. తమ రాజీనామాలు ఆమోదింపజేసుకుని పార్టీలో నుంచి బయటకు వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనే దమ్ముందా అని  మర్రి  టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖలు రాసి, ప్రత్యేక రాజధాని కోసం ప్యాకేజీ అడిగి విభజనకే కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెప్పిన చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేని ఆ పార్టీ జిల్లా నేతలు జగన్ విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని మాట్లాడుతూ మరింత దిగజారేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
 
సమైక్య విధానంపై నిర్ణయాన్ని తీసుకుని ఆమరణ దీక్ష చేసి స్పష్టమైన విధానంతో ముందుకు కదులుతున్న జగన్‌పై బురద జల్లడమే పనిగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వైఎస్సార్ సీపీ వైపు మరల్చడానికి ఆ పార్టీ నాయకులు పడుతున్న పాట్లను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. జగన్‌పై విమర్శలు చేయడం సూర్యుడిపై ఉమ్మి వేసిన చందమేనని స్పష్టం చేశారు. 
 
మరిన్ని వార్తలు