ఎవరడ్డుకుంటారో చూస్తా!

21 Jun, 2018 08:18 IST|Sakshi

టీడీపీ నేత అనుచరుడి వీరంగం 

రాళ్లకుంటలో అక్రమ మట్టి తవ్వకాలు 

తనిఖీకి వెళ్లిన మహిళా తహసీల్దారు ముందే వాగ్వాదం  

అధికారపార్టీ నేత ఒత్తిడితో వెనక్కి తగ్గిన తహసీల్దారు 

ద్వారకాతిరుమల: ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న మహిళా తహసీల్దారు ముందు ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు. తవ్వకాలను ఎవరడ్డుకుంటారో చూస్తా.. పనులు కానివ్వండంటూ రెవెన్యూ అధికారుల ముందే అతడు హడావిడి చేశాడు. ఇంత ధీమాగా అతడు హల్‌చల్‌ చేయడానికి కారణం అతను వెనకున్న టీడీపీ నేతలేనని తెలుసుకున్న తహసీల్దారు చివరకు వెనక్కి తగ్గారు. వివరాలు ఇవి.. ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంట గ్రామంలోని సర్వే నంబర్‌ 91/1ఎ లోని 19 సెంట్ల బండిదారిలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ మండల యూత్‌ అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్‌ తహసీల్దారు టీడీఎల్‌ సుజాతకు బుధవారం ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తవ్వకం పనులను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. 

జేసీబీ, ట్రాక్టర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో రాళ్లకుంటకు చెందిన చుక్కా నాని అక్కడికి చేరుకుని పనులు తానే చేయిస్తున్నానంటూ తహసీల్దారుకు చెప్పాడు. అంతటితో ఆగకుండా ఫిర్యాదు చేసింది ఎవరంటూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం ప్రారంభించాడు. దీంతో నానికి, ఫిర్యాదుదారుడైన లక్ష్మణ్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో అక్కడికి కొందరు టీడీపీ నాయకులు చేరుకున్నారు. దీంతో నాని తహసీల్దారును సైతం లెక్కచేయకుండా పనులను ఎవరు అడ్డగిస్తారో రండి చూస్తానంటూ సవాల్‌ విసిరాడు. కలెక్టరొచ్చినా భయపడేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. అప్పటికే నియోజకవర్గ ముఖ్య నేత నుంచి తహసీల్దారుకు ఫోన్‌ రావడంతో ఆమె చేసేది లేక వెనక్కి తగ్గారు. 

మొక్కుబడి జరిమానాలతో సరి
రాళ్లకుంటలో నిర్మిస్తున్న వేబ్రిడ్జికి, ఓ రియల్‌ ఎస్టేట్‌ భూమి మెరకకు ఈ మట్టిని తోలుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఒక జేసీబీతోపాటు 9 ట్రాక్టర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. టీడీపీ నేతల ఒత్తిడి కారణంగా తహసీల్దారు జేసీబీతో పాటు, ఒక ట్రాక్టరును మాత్రమే లెక్కలో చూపారు. అక్రమంగా మట్టి తవ్వినందుకు జేసీబీకి రూ.10 వేలు, ఒక ట్రాక్టరుకు రూ.5 వేలు జరిమానా విధిస్తున్నట్టు తహసీల్దారు సుజాత విలేకర్లకు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు