పోలీసులైతే ఏం చేస్తార్రా..?

23 Jan, 2019 03:46 IST|Sakshi

హెడ్‌కానిస్టేబుల్‌పై తెలుగు తమ్ముడి తండ్రి దాష్టీకం

ఆలస్యంగా సోషల్‌ మీడియాతో వెలుగులోకి..

కేసు నమోదు చేయని పోలీసులు

చిత్తూరు జిల్లాలో ఘటన

పెనుమూరు: సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు పోలీసులంటే లెక్కలేకుండా పోయింది. ఓ తెలుగు తమ్ముడి తండ్రి, హెడ్‌కానిస్టేబుల్‌పై బహిరంగంగా కర్రతో దాడి చేసి గాయపరిచాడు. పోలీసులైతే ఏం పీకుతార్రా అంటూ వీరంగం చేశాడు. సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌ అయి వెలుగులోకి వచ్చింది.  శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన  వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని పెద్దకలికిరి పంచాయతీ కొత్తూరుకు చెందిన యుగంధర్‌నాయుడు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి చంద్రశేఖర్‌నాయుడికి గ్రామానికి చెందిన  హిమాచల్‌నాయుడు కుటుంబానికి చాలా కాలంగా గ్రామంలో స్థల వివాదం ఉంది. ఇది కోర్టుకు చేరింది.

ఆ స్థలంలో ఎవరూ ప్రవేశించరాదని ఇటీవల కోర్డు స్టే ఇచ్చింది.  అయితే చంద్రశేఖర్‌నాయుడు (75) కోర్టు స్టే ఉత్తర్వులను బేఖాతరు చేసి జేసీబీ సాయంతో ఈ నెల 19వతేదీన ఆ స్థలం చదును చేసేందుకు పూనుకున్నాడు. విషయం తెలుసుకున్న హిమాచల్‌నాయుడు పెనుమూరు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఎస్‌ఐ వంశీధర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రమేష్‌రెడ్డిని కొత్తూరుకు వెళ్లమని పురమాయించారు. దీంతో ఆయన ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌తో కలిసి బైక్‌లో అక్కడికి చేరుకున్నారు. పనులను అడ్డుకుని జేసీబీని రమేష్‌రెడ్డి అక్కడ నుంచి పంపించేశారు. దీంతో చంద్రశేఖర్‌నాయుడు శివాలెత్తాడు. ‘నీవెవడ్రా జేసీబీని పంపించేయడానికి’ అంటూ రమేష్‌రెడ్డిని దుర్భాషలాడుతూ అతడిపై కర్రతో దాడి చేశాడు. తలకు తీవ్రగాయమైంది. ప్రశ్నించిన రమేష్‌రెడ్డిని బండబూతులు తిట్టాడు. జరిగిన ఘటనను ఎస్‌ఐకు ఫోన్‌లో రమేష్‌రెడ్డి వివరిస్తున్నంతసేపూ ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నాడు. గాయపడ్డ హెడ్‌కానిస్టేబుల్‌ ఆస్పత్రిలో చికిత్స చేసుకున్న తర్వాత స్టేషన్‌కు వెళ్లి తనపై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేయాలని ఎస్‌ఐను కోరారు. అయితే ఎస్‌ఐ కేసు వద్దని చెప్పినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు