టీ, టిఫిన్లు ఇవ్వలేం!

3 Feb, 2014 04:20 IST|Sakshi

మెదక్, న్యూస్‌లైన్:  పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ స్మితా సబర్వాల్, విద్యాశాఖ అధికారి జి. రమేష్ వినూత్న ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఈ మేరకు గత ఏడాది జూలై నుంచే పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఈ యేడు జనవరి 22 నుంచి 40 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు. క్విజ్‌ల ఏర్పాటు, ఉపాధ్యాయుల దత్తత, సమీప అధికారుల పరిశీలన తదితర కార్యక్రమాలు ఇప్పటికే సత్ఫలితాలిస్తున్నాయి.

ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నడుస్తుండటంతో సాయంత్రం వేళ టీ, టిఫిన్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం రవ్వ ఉప్మా, మంగళవారం ఒక్కో విద్యార్థికి 3 గారెలు, బుధవారం టమాటా బాత్, గురువారం 3 వడలు, శుక్రవారం సేమియా ఉప్మా, శనివారం అటుకుల ఉప్మా(పోవ)లతోపాటు ప్రతిరోజూ విద్యార్థులందరికి టీ ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతంలో కొన్ని పాఠశాలల్లో హెచ్‌ఎంలు స్థానికంగా ఉన్న దాతల సహకారంతో టీ, స్నాక్స్ అందించారు.

అక్షయ పాత్ర ఉన్నచోట వారి సహాయ సహకారాలు తీసుకున్నారు. కాగా ఈసారి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మెనూ ప్రకారం టీ, టిఫిన్లు అందించాలని, రోజువారీ విద్యార్థుల హాజరు, టిఫిన్ల వివరాలను శనివారం నుంచే విద్యాధికారులకు పంపాలని ఆదేశించారు. ఇందుకు మధ్యాహ్న భోజన ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలను ఉపయోగించుకోవాలని, వారికి కొంతమేర బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.

అయితే ఒక్కో విద్యార్థికి ఎంత మొత్తంలో చెల్లిస్తారన్న విషయంపై స్పష్టత లేనట్లు తెలుస్తోంది. ఒక్కో విద్యార్థికి రోజుకు సుమారు రూ.5 చొప్పున చెల్లించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 556 ఉన్నత పాఠశాలలు ఉండగా, 30 వేల మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. అయితే ప్రస్తుతం 124 పాఠశాలల్లో 26.089 మంది విద్యార్థులకు టీ, టిఫిన్లు అందించనున్నారు.
 
బిల్లులు లేవు... రోజుకో టిఫిన్ ఎలా చేయాలి?

9,10 తరగతి విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు సుమారుగా మూడు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు రోజుకో టిఫిన్ ఎలా చేయాలని ఏజెన్సీ మహిళలు ప్రశ్నిస్తున్నారు. వడలు, గారెలు తయారుచేయడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది మహిళలు మాత్రం వడలు, గారెలు తమకు చేయరాదని చేతులెత్తేస్తున్నారు.

వడలు, గారెలు తయారు చేయాలంటే ఎంతలేదన్న ఒక్కో విద్యార్థికి రూ.15 వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే రోజూ ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 3 గంటల వరకు పనిచేస్తున్నామని, కాని తమకు రూ.1,000 మాత్రమే గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారని, అవికూడా సమయానుకూలంగా రావడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల మధ్యాహ్న భోజనం రేట్లు పెంచినప్పటికీ ఆశించిన స్థాయిలో తమకు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. కాగా అటు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మహిళల నిరాసక్తత, ఇటు పథకం అమలుపై హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు.
 
 ఏజెన్సీ మహిళలే టిఫిన్లు అందించాలి
 విద్యార్థుల భవిష్యత్తును, మంచి ఫలితాలను ఆశించి చేపట్టిన ఈ బృహత్ పథకాన్ని ఏజెన్సీ మహిళలే నిర్వహించాలి. త్వరలో వాటి రేట్లు ప్రకటిస్తాం. ఒక్కో విద్యార్థికి సుమారు రూ.5లకు పైగా చెల్లించే అవకాశం ఉంది. అవసరమైతే హెచ్‌ఎంలు ముందుకు వచ్చి దాతల సహకారం తీసుకోవాలి. పథకాన్ని జయప్రదం చేయాలి.
 -సామెల్, డిప్యూటీఈఓ
 

మరిన్ని వార్తలు