సారోళ్లకు ఏమైందో!

6 Oct, 2018 13:37 IST|Sakshi
బయోమెట్రిక్‌ యంత్రం

ఒకే రోజు బయోమెట్రిక్‌ వేయని 355 మంది ఉపాధ్యాయులు

నేటిలోగా సంజాయిషీ ఇవ్వాలని డీఈఓ ఆదేశాలు

సరైన కారణాలు లేకుంటే చర్యలు

ఒంగోలు టౌన్‌: ఉపాధ్యాయ శాఖలో కలకలం రేగింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరైన వెంటనే ఉదయం, సాయంత్రం రెండు పూటలా బయోమెట్రిక్‌ హాజరు వేయాల్సి ఉంటుంది. అయితే శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో 355 మంది ఉపాధ్యాయులు బయోమెట్రిక్‌ హాజరు వేయలేదు. ఆ ఉపాధ్యాయులు సెలవు పెట్టినా, ఒకవేళ ఓడీ చేస్తున్నా సమాచారాన్ని తప్పనిసరిగా ఏపీటెల్‌ యాప్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. కానీ 355 మంది ఉపాధ్యాయులు బయోమెట్రిక్‌ హాజరు వేయకపోవడం, ఏపీటెల్‌ యాప్‌ ద్వారా సమాచారం చేరవేయక పోవడంతో జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్‌ సుబ్బారావు సీరియస్‌గా తీసుకున్నారు. 355 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. శనివారంలోగా సరైన కారణాలతో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బయోమెట్రిక్‌తో బ్రేక్‌లు
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్‌ పరిధిలో 3097 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 14137 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రతిరోజూ పాఠాలు బోధిస్తుండాలి. బయోమెట్రిక్‌ హాజరు అమలు కాకముందు వరకు అనేకమంది ఉపాధ్యాయులు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉండేది. పాఠశాలకు వెళితే వెళ్లినట్లు, వెళ్లకపోయినా వెళ్లినట్లుగానే ఉండేది. ఎందుకంటే ఆ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయుల మ«ధ్య అండర్‌ స్టాండ్‌ ఉండటమే. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉండేవి. ఒకరి తర్వాత మరొకరు సొంత పనుల పేరుతో పాఠశాలలకు డుమ్మా కొడుతూ అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు మాత్రం చేసుకుంటూ ఉండేవారు. మండల విద్యాశాఖాధికారి, ఉప విద్యాశాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి ఎప్పుడైనా అలాంటి పాఠశాలలు తనిఖీ చేసిన సమయంలో వెంటనే విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఆ రోజు పాఠశాలకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయుడిని సేవ్‌ చేసేందుకు ముందుగా సిద్ధం చేసుకొని ఉంచిన సెలవు చీటిని బయటకు తీసేవారు. ఆ సెలవు చీటిలో అప్పటికప్పుడు ఆ రోజు తేదీ రాసి అటెండెన్స్‌ రిజిస్టర్‌లో పెట్టేవారు. ఇలా ఒకరికొకరు ఉపాధ్యాయులు సహకరించుకుంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పడం కంటే సొంత పనులపైనే ఎక్కువగా దృష్టి పెడుతూ వచ్చారు.

బేజార్‌..
రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ప్రభుత్వ శాఖల్లో విస్తరిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ బయోమెట్రిక్‌ హాజరు పరిధిలోకి తీసుకువచ్చింది. ఉదయం పాఠశాల తెరిచిన వెంటనే, సాయంత్రం పాఠశాల మూసివేసే ముందు రెండుసార్లు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు వేయాల్సి ఉంటుంది. అయితే మొదట్లో బయోమెట్రిక్‌కు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో మాన్యువల్‌గా అనుమతి ఇస్తున్నారు. అదే సమయంలో బయోమెట్రిక్‌లో తప్పనిసరిగా వచ్చినట్లుగా థంబ్‌ వేయాల్సి ఉంటుంది. సాంకేతిక పరమైన సమస్య తొలగిన తరువాత ఆ ఉపాధ్యాయుడు ఆ సమయంలో తరగతులకు హాజరై బయోమెట్రిక్‌ హాజరు వేశారా లేదా అన్నది తేలుతుంది. సిగ్నల్స్‌ అందని ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తూ వచ్చారు. దీంతో తప్పించుకొని తిరిగే  ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ రూపంలో బ్రేక్‌లు పడినట్లయింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఒక్కరోజే 355 మంది ఉపాధ్యాయులు బయోమెట్రిక్‌ హాజరు వేయకుండా, సెలవు లేదా ఓడీకి వెళ్లినా ఆ సమాచారం కూడా ఏపీటెల్‌ యాప్‌ ద్వారా తెలియజేయకపోవడంతో జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్‌ సుబ్బారావు అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మెమోల రూపంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లయింది. ఏదిఏమైనప్పటికీ జిల్లాలోని 355మంది ఉపాధ్యాయులకు ఒకేసారి మెమోలు జారీ చేయడం విద్యాశాఖలో, ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు