సీఎం పర్యటన మళ్లీ రచ్చనే!

23 Nov, 2013 03:28 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన మరోమారు రచ్చకెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 26న సంగారెడ్డి నియోజకవర్గంలో సీఎం పర్యటన కోసం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ టి.జయప్రకాశ్‌రెడ్డి సన్నద్ధమవుతున్నారు. అయితే సీఎం పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యలు పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. సీఎం పర్యటన ఖరారైన పక్షంలో అదే రోజు జిల్లాలో ఏదో ఒకచోట సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ జైత్రయాత్ర సభ నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
 
 పటాన్‌చెరు లేదా సిద్దిపేటలో సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు వి.భూపాల్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులకు సూచించినట్టు సమాచారం. అయితే ఇంతవరకు సీఎం పర్యటనకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడ లేదు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సీఎం జిల్లాలో పర్యటిస్తే ఆ ప్రభావం తమపై పడుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో వారు సీఎం పర్యటనను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో జరుగుతున్న రచ్చబండ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సీఎం కిరణ్ ఫొటోలను తొలగించి డిప్యూటీ సీఎం ఫొటోలను పెట్టించటంతోపాటు సీఎం సందేశాన్ని చదవనివ్వటంలేదు. డిప్యూటీ సీఎం దామోదర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులు సీఎం పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కిరణ్ పర్యటనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
 
 సీఎం పర్యటన జరిగేనా?
 సదాశివపేట మండలం వెల్టూరులో ఈనెల 16న నిర్వహించతలపెట్టిన రచ్చబండ సమావేశంలో పాల్గొనాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి సీఎం కిరణ్‌ను కోరడంతో ఆయన అంగీకరించారు. దీంతో 16న సీఎం జిల్లా పర్యటన ఖరారు కావడంతోపాటు అధికారులు యుద్ధప్రాతిపదికన సదాశివపేట, వెల్టూరు గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం పర్యటనను డిప్యూటీ సీఎం, జిల్లా ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం పర్యటనను వ్యతిరేకించటంతోపాటు ఆయన హాజరయ్యే కార్యక్రమానికి దూరంగా ఉండాలని డీసీసీ నిర్ణయించింది. సొంతపార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో సీఎం తన పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పైచేయి సాధించినట్లు అయ్యింది. తాజాగా ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని తన నియోజకవర్గానికి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు. వెల్టూరులో వాయిదా వేసిన రచ్చబండ సమావేశానికే సీఎంను తీసుకువచ్చి తన రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకోవాలనే భావనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈనెల 26న మరోమారు వెల్టూరులో రచ్చబండకు హాజరు కావాల్సిందిగా జయప్రకాశ్‌రెడ్డి సీఎంను కోరగా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సీఎం పర్యటన 26న ఉంటుందని జయప్రకాశ్‌రెడ్డి ప్రకటించిన వెంటనే డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి సీఎం పర్యటనను అడ్డుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలు సీఎం పర్యటనను కోరుకోవడంలేదు. దీంతో జిల్లాలో పర్యటించాలన్న సీఎం రెండో ప్రయత్నం సఫలం అవుతుందా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు