డేటా చోర్‌పై నిఘా?

17 Apr, 2019 13:34 IST|Sakshi

 ఐటీ గ్రిడ్‌ అశోక్‌ కోసం అన్వేషణ

డేటా చోరీ కేసులో కీలక సూత్రధారి

రెండు నెలలుగా అజ్ఞాతంలోనే..

బీద బ్రదర్స్‌తో బలమైన సంబంధాలు

బీద బ్రదర్స్‌ ద్వారానే లోకేష్‌తో పరిచయం

స్వస్థలం అల్లూరుపై పోలీసుల కన్ను

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజల వ్యక్తిగత డేటా చోరీలో కీలక సూత్రధారిగా ఉన్న డాకవరం అశోక్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వెలుగు చూసిన రెండు నెలల నుంచి అతను అజ్ఞాతంలోనే ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సిట్‌ బృందం అశోక్‌ జాడను గుర్తించడం కోసం రంగంలోకి టీమ్‌లు దింపిన క్రమంలో అతని స్వస్థలం అల్లూరులో మళ్లీ అలజడి రేగింది. అశోక్‌ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అతని మూలాలపై జిల్లాలో చర్చ సాగుతోంది. అనతి కాలంలలో బడా వ్యక్తిగా ఎదగడం వెనుక రాజకీయంగా జిల్లాలో ఎవరి సహకారం ఉంది. స్థానికంగా సహకరిస్తున్నది ఎవరనే దానిపై జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ప్రజల ఆధార్‌ కార్డులతో పాటు వ్యక్తిగత డేటా చోరీ చేసిన డాకవరం అశోక్‌ కావలి నియోజకవర్గం అల్లూరుకు చెందిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబం నుంచి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ముఖ్యంగా అశోక్‌ ఆర్థికంగా స్థిరపడిన తర్వాత జిల్లాలో పొలాలు భారీగా కొనుగోలు చేశాడు. అశోక్‌ తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం, బీద సోదరులతో ఉన్న సంబంధాలు తదితర అంశాలపై చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని ఓటర్ల ఆధార్‌ డేటాతో పాటు వ్యక్తిగత వివరాల డేటాను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా లిమిటెడ్‌ తస్కరించిదనితెలంగాణ సిట్‌ బృందం నిర్ధారించి కేసు నమోదు చేశారు. దాదాపు రెండు నెలల క్రితం కేసు నమోదైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడ, ఎన్నికల ప్రక్రియ జరగటంతో పోలీసులు కేసును పక్కన పెట్టారు. తాజాగా ఎన్నికలు ముగిసిపోవడంతో ఆధార్‌ డేటా వ్యవహారం తెరపైకి రావడంతో అశోక్‌ కోసం అన్వేషణ మొదలైంది. ముఖ్యంగా అశోక్‌ గడిచిన నాలుగు నెలల కాలంలో జిల్లాకు వచ్చారా? అనే దానిపై పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించినట్లు సమాచారం. వాస్తవంగా గతంలో అశోక్‌ ఏటా మూడు నాలుగు సార్లు అల్లూరుకు వచ్చి వెళ్తుండేవాడు.  గడిచిన నాలుగు నెలలుగా జిల్లాకు రాలేదని ప్రాథకంగా నిర్ధారించారు. అల్లూరులో అశోక్‌ బంధువులు, సన్నిహితులు ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

బీద టూ నారా లోకేష్‌
అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన బీద సోదరుల సహకారంతో సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు అశోక్‌ సన్నిహితుడుగా మారాడు. టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌ను అశోక్‌ సంస్థే రూపొందించింది. అల్లూరుకు చెందిన డాకవరం బుజ్జయ్య కుమారుడు అశోక్‌. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచిన బుజ్జయ్య  మండలంలో ఉప్పు సాగు చేసే సాధారణ రైతు. ఆర్థికంగా నష్టపోయాడు. ఈక్రమంలో బుజ్జయ్య కుమారుడు అశోక్‌ కు టీడీపీ నాయకులైన బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రతో సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో బుజ్జయ్య కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరాడు. అశోక్‌ అల్లూరులో ఇంటర్మీడియట్, కర్ణాటకలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు.

కొత్త టెక్నాలజీ పేరుతో బీద రవిచంద్ర ద్వారా సీఎం చంద్రబాబునాయుడ్ని, ఆయన కుమారుడు లోకేష్‌ను కలిశారు. తద్వారా కొద్ది నెలలకే వారికి సొంత మనిషిగా మారిపోయాడు. దీనికి టీడీపీ నేతలుగా ఉన్న బీద సోదరులు వారధిగా నిలిచారు.  పదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థను ప్రారంభించాడు. లోకేష్‌ మంత్రిత్వ శాఖలోని విభాగాలకు సంబంధించి సాంకేతిక సహకారం అందించే యాప్‌లను కూడా ఇదే సంస్థ డెవలప్‌ చేసింది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ యాప్, పంచాయతీరాజ్‌ విభాగం, డ్రిప్‌ ఇరిగేషన్, గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం తదితర ప్రభుత్వ వైబ్‌సైట్లతో పాటు వాటికి సంబంధించి సాంకేతిక సహకారం వీరే అందిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను తయారు చేసి, ఈ యాప్‌ను టీడీపీ నాయకుల వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్లలో పని చేసే విధంగా సాంకేతికతను తయారు చేశారు. 

మరిన్ని వార్తలు