అధికారులపై తెలుగు తమ్ముళ్ల పెత్తనం

20 Sep, 2014 00:20 IST|Sakshi
అధికారులపై తెలుగు తమ్ముళ్ల పెత్తనం

రుద్రవరం: తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించారు. చట్టబద్ద కార్యకలాపాలకు అడ్డుతగులుతూ..తాము చెప్పిందే వేదమంటూ హుకుం జారీ చేస్తున్నారు. అధికారం ఉందనే అండతో ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చెలాయించడంతో మనస్తాపానికి గురైన రుద్రవరం మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తాళలేక మండల పరిషత్ అభివృద్ధిఅధికారిణి విజయలక్ష్మి, ఈఓపీఆర్‌డీ దస్తగిరి, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ అనీఫ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బది ముక్కుమ్మడిగా సెలవు పెట్టి స్థానిక కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మండలంలో విధులు నిర్వహిస్తుండగా అధికార పార్టీ నాయకుడు భాస్కర్‌రెడ్డితోపాటు అయన అనుచరులు తమపై వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విధులకు అడ్డం తగులుతూ మాటవినకపోతే బదిలీ చేయిస్తామని బెదిరిస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. టీడీపీ నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు పోలీసులను కోరారు.విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హరినాధరెడ్డి, సిబ్బందితో కార్యాలయానికి చేరుకొని ఎంపీడీఓ విజయలక్ష్మితో చర్చించారు. ఉద్యోగుల ఆందోళనపై ఎస్‌ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళ్లారు. అధికారుల ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించారు. అధికార పార్టీ నేతల వ్యవహారంపై శనివారం కలెక్టర్ విజయ మోహన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.   
 వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సంఘీభావం..
 కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులకు వైఎస్‌ఆర్‌సీపీ మండల నాయకులు సంఘీభావం తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు కూడా ఉద్యోగులకు బాసటగా నిలిచారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా