గుట్టు రట్టయ్యేనా!

20 Sep, 2014 00:13 IST|Sakshi
గుట్టు రట్టయ్యేనా!

వెల్దుర్తి:
 ఖనిజ తవ్వకాలకు అనుమతి పొం దిన వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. నిబంధనల మేరకు లీజుకు తీసుకున్న భూములను విస్మరించి ప్రభుత్వ బంజారు, అటవీ, దేవాదాయ భూములను అడ్డంగా తవ్వేస్తూ పచ్చని పల్లెల్లో పుడమితల్లికి గర్భకోశాన్ని మిగుల్చుతున్నారు. భూదందాలకు తోడు ఇనుప ఖనిజాన్ని రాత్రికి రాత్రే ఎల్లలు దాటిస్తు సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగారు.జిల్లాలో ఖనిజ నిక్షేపాలకు రామళ్లకోట గ్రామం పేరుగాంచింది. ఇక్కడి ఖనిజానికి రాష్ట్రం లోనే కాక ఇతర ప్రాంతాలలోనూ మంచి డిమాండ్ ఉంది. ఇంతటి ఘనత ఉన్న ఈ గ్రామంలో ఖనిజ మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోయింది. రామళ్లకోట, రత్నాపల్లి, పుల్లగుమ్మి, సర్పరాజ పురం గ్రామాల పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజ నిక్షేపాలను నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు వెలికితీస్తున్నారు. ఈ గ్రామాల పరిధిలో ఖనిజాల తవ్వకాలకు ప్రభుత్వం 12 మందికి మాత్రమే కొన్ని ప్రైవేట్ భూముల్లో అనుమతి ఇచ్చింది. అయితే సర్కార్ కేటాయించిన భూముల్లో ఖనిజ సంపద లేకపోవడంతో వ్యాపారుల కన్ను ప్రభుత్వ, దేవాదాయ భూములపై పడింది. వీరికి అధికార పార్టీ నేతలు, అధికారులు అండదండగా నిలవడంతో అక్ర మంగా ఖనిజాన్ని వెలికితీసి రాజమార్గంలో తరలిస్తు న్నారు.  ఇలా ఐదేళ్లుగా వ్యాపారులు భూదందా కొనసాగిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది.  

 200 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు..
 రామళ్లకోట గ్రామ పరిధిలోని ప్రభుత్వ, దేవాదాయ భూముల్లో సుమారు 200 ఎకరాలలో అక్రమంగా ఖనిజ తవ్వకాలు చేపడుతున్నారు.
 గ్రామంలోని వనం లక్ష్మివెంకటేశ్వర స్వామికి చెందిన 359 సర్వేనంబర్‌లో 58 ఎకరాలు, అటవీశాఖకు సంబంధించిన తిప్పారెడ్డి కొండలో   25 ఎకరాల్లో ఖనిజ తవ్వకాలు యధేచ్చగా జరుగుతున్నాయి. పుల్లగుమ్మి గ్రామ సమీపంలోని అటవీశాఖకు చెందిన బుగ్గ తిప్పకొండలోనూ  20 ఎకరాలు, రత్నాపల్లి గ్రామ పొలిమేరలోని 30 ఎకరాల్లోనూ అక్రమ ఖనిజ తవ్వకాలు జరుగుతున్నాయి. బ్రహ్మగుండం క్షేత్రం పరిధిలోని 1231, 821, 822, 824 సర్వే నంబర్లలోని అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన భూముల్లో ఖనిజ తవ్వకాలు చేపడుతున్నట్లు స్థానికులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి వెనుక ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి. పరోక్షంగానే అక్రమ ఖనిజ తవ్వకాలను అధికారులే ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.



 

మరిన్ని వార్తలు